ITR: ఇంకా ఐటీ రిటర్న్స్ రాలేదా..? అయితే ఈ తప్పు జరిగి ఉంటుంది.. వెంటనే ఇలా చేయండి!
ఆదాయపు పన్ను రిటర్నులు ( ITR ) దాఖలు చేసినా ఇంకా రీఫండ్ అందలేదా? మీ ఐటీ రీఫండ్ ఆలస్యం కావడానికి గల కారణాలను, దాని ప్రస్తుత స్థితిని ఆన్‌లైన్‌లో ఎలా తనిఖీ చేయాలో రెండు పద్ధతుల్లో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసే సీజన్ ముగిసింది. కానీ కొంతమంది పన్ను చెల్లింపుదారులకు ఇంకా ఐటీ రిఫండ్స్ అందలేదు. ఐటీ రిటర్న్స్‌ను సకాలంలో దాఖలు చేసి, ఈ-వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేసినప్పటికీ ఇప్పటి వరకు ఐటీ రిఫండ్స్ రాకుంటే మీ రీఫండ్ నిలిచిపోయిందా? లేదా ఫారమ్‌లో పొరపాటు జరిగిందా? అనే విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు రీఫండ్ ఆలస్యం అనేది సాధారణ ప్రక్రియలో భాగమే కావచ్చు. కానీ ఆలస్యం ఎందుకు అవుతుందో ఇప్పుడు కేవలం మీ స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ఉపయోగించి మీ ఇంటి నుంచే తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో మీ వాస్తవ పన్ను బాధ్యత కంటే ఎక్కువ పన్ను చెల్లించినప్పుడు, అది TDS, ముందస్తు పన్ను లేదా స్వీయ-అంచనా పన్ను రూపంలో అయినా, ఆదాయపు పన్ను శాఖ గణన తర్వాత అదనపు మొత్తాన్ని మీకు తిరిగి ఇస్తుంది. సాధారణంగా మీరు మీ రిటర్న్‌ను ఇ-వెరిఫై చేసిన తర్వాత, రీఫండ్ ప్రాసెస్ పూర్తి చేస్తారు. 4 నుండి 5 వారాలలోపు మీ బ్యాంక్ ఖాతాకు నేరుగా జమ అవుతుంది. డిపార్ట్‌మెంట్ ప్రక్రియ చాలా వేగంగా, మరింత పారదర్శకంగా మారింది. అయితే ఈ గడువు దాటిపోయి డబ్బు రాకపోతే, మీరు వెంటనే స్థితిని తనిఖీ చేయాలి.
మీ రిటర్న్స్ స్థితిని తనిఖీ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో చెక్ చేయొచ్చు. ఈ పద్ధతి మీకు స్థితిని అందించడమే కాకుండా ఏవైనా సమస్యలకు పరిష్కారాలను కూడా సూచిస్తుంది.
మొదటి పద్ధతి..
- ముందుగా అధికారిక ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి వెళ్లండి.
- మీ పాన్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి.
- డాష్‌బోర్డ్ తెరిచినప్పుడు ‘ఈ-ఫైల్’ మెనుపై క్లిక్ చేసి, ‘ఆదాయపు పన్ను రిటర్న్స్’ ఎంచుకోండి.
- దీని తర్వాత ‘సబ్మిట్ చేసిన రిటర్న్స్’ ఆప్షన్‌కు వెళ్లండి.
- అక్కడ మీరు దాఖలు చేసిన అన్ని రిటర్న్‌లను మీరు చూస్తారు. ప్రస్తుత అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంచుకుని, వీవ్ డీటెలయిల్స్‌పై క్లిక్ చేయండి. ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది అనే మొత్తం వివరాలు వచ్చేస్తాయి.
రెండవ పద్ధతి..
మీరు సుదీర్ఘమైన లాగిన్ ప్రక్రియను నివారించాలనుకుంటే, NSDL-TIN వెబ్‌సైట్ ఒక త్వరిత ఎంపిక. రీఫండ్ ట్రాకింగ్ పేజీని సందర్శించి, మీ పాన్ నంబర్, అసెస్‌మెంట్ సంవత్సరాన్ని నమోదు చేయండి. ‘ప్రొసీడ్’ క్లిక్ చేయడం ద్వారా రీఫండ్ బ్యాంకర్‌కు పంపబడిందో లేదో మీకు తెలుస్తుంది.
బ్యాంక్ ఖాతాను లింక్ చేయకపోయినా, పాన్-ఆధార్ లింక్ లేకపోయినా, బ్యాంక్ విలీనం కారణంగా మీ IFSC కోడ్ మారి ఉంటే, మీరు దాన్ని అప్డేట్ చేయకున్నా కూడా రిటర్న్స్ రాకపోవచ్చు. అవన్నీ ఒకసారి మళ్లీ చెక్ చేసుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
