అత్యవసరం ఉందా? ఏటీఎంకు వెళ్లకుండా ఇంట్లో కూర్చొని డబ్బులు డ్రా చేసుకోవచ్చు..
ఎటీఎం లేదా బ్యాంకుకు వెళ్లలకుండా తపాలా శాఖ ప్రారంభించిన ఆధార్ ATM (AePS) సేవను ఉపయోగించుకొని ఇంట్లోని ఉండి మన డబ్బును డ్రా చేసుకోచ్చు. పోస్టుమాన్ మన ఇంటికి మన నగదు తీసుకువచ్చి ఇస్తాడు.
మీకు అత్యవసరంగా డబ్బు అవసరమైతే, సమీపంలో ఏటీఎం లేకపోతే డబ్బు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అవును, మీరు ATMకి వెళ్లకుండానే డబ్బును ఎలా విత్‌డ్రా చేసుకోవచ్చో తెలుసుకొండి.
డిజిటల్ యుగంలో ఎక్కడైనా ఏదైనా కొనాలనుకున్న మొబైల్ ఫోన్ ఉంటే చాలు. ఇప్పుడు మనం ప్రతిదానికీ ఫోన్ పే, గూగుల్ పే చేస్తూ చాలా సులభంగా ట్రాన్సాక్షన్స్ చేసుకుంటున్నాము. అయితే ఒక్కోసారి ఈ ఆన్‌లైన్ తో సైబర్ దొంగలు మన సొమ్మును కాజేస్తున్నారు. అందుకే డిజిటల్‌పై ఆధారపడి ఉండటం అన్నివేళల సాధ్యం కాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో నగదు చెల్లించాల్సి రావచ్చు. మనకు డబ్బు అవసరమైనప్పుడు ఖచ్చితంగా ATM పై ఆధారపడవలసిందే…లేదా సమీపంలోని బ్యాంకులో డబ్బు డ్రా చేసేందుకు ప్రయత్నిస్తాం. కాని కొన్నిసార్లు అవి అందుబాటులో లేకుంటే ఏం చేయాలో తెలియక చాలా మంది ఆందోళన చెందుతారు.
ఇలాంటి సమయాల్లోనే తపాలా శాఖ ప్రారంభించిన ఆధార్ ATM (AePS) సేవను ఉపయోగించుకోవడం ఉత్తమం. అవును, తపాలా శాఖ ఆధార్ ATM (AePS) సేవను ప్రారంభించింది. దీని నుండి మీరు ఇంట్లో నుంచే డబ్బు డ్రా చేసుకోవచ్చు. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అందించే ఈ ప్రత్యేక సేవ గురించి మరింత తెలుసుకోండి..
మీకు అత్యవసరంగా డబ్బు అవసరమైతే మరియు బ్యాంక్ లేదా ATMకి వెళ్లడానికి సమయం లేకుంటే, మీరు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఆన్‌లైన్ ఆధార్ ATM (AePS) సేవను ఉపయోగించి ఇంటి నుండి డబ్బు తీసుకోవచ్చు… పోస్ట్‌మ్యాన్ మీ ఇంటికి వచ్చి డబ్బును డ్రా చేసి ఇస్తాడు. మీరు సైతం పోస్టాఫీసుకు వెళ్లి డబ్బు డ్రా చేసుకోవచ్చు.
ఈ ఆన్‌లైన్ ఆధార్ ATM (AePS) సేవను ఉపయోగించడానికి మీ ఆధార్ తప్పనిసరిగా మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడి ఉండాలి. మీ బయోమెట్రిక్ కూడా సరిగ్గా నమోదు చేయబడాలి. AePS ద్వారా ఇంట్లో డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఖాతాలోని బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. మినీ స్టేట్‌మెంట్‌ను పొందవచ్చు. డబ్బును ఇతర బ్యాంకులకు బదిలీ చేయవచ్చు. ఈ సేవకు ఎటువంటి రుసుము లేదు. కానీ మీ ఇంటికి వచ్చి సేవలు అందించినందుకు పోస్ట్‌మ్యాన్‌కు సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
మీరు డబ్బును ఉపసంహరించుకున్న తర్వాత, మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు నగదు బదిలీ SMSని అందుకుంటారు. ఈ సందేశం ఇండియన్ పోస్టల్ సర్వీస్ మరియు మీ బ్యాంక్ ద్వారా పంపబడుతుంది.