IRCTC: కష్టమంతా రైల్వేది.. కాసుల వర్షం ఐఆర్‌సీటీసీది.. దీన్ని సంపాదన తెలిస్తే మీ మైండ్ బ్లాంకే..
ఐఆర్‌సీటీసీ.. ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే ప్రతి ఒక్కరికీ ఇది బాగా తెలుసు. నిజానికి చాలామంది ఐఆర్‌సీటీసీనే రైళ్లు నడుపుతుందని భ్రమపడుతుంటారు. కానీ ఇది రైళ్లను నడపదు. కానీ రైళ్ల ద్వారా వేల కోట్ల లాభాలను పొందుతుంది. కోట్లాది మంది ప్రయాణికులు దాటి వెళ్లే ఆ డిజిటల్ టోల్‌గేట్ వద్ద ఐఆర్‌సీటీసీ కూర్చొని చేస్తున్న వ్యాపారం తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

భారతదేశంలో రైలు ప్రయాణం అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు ఐఆర్‌సీటీసీ. చాలామంది ఐఆర్‌సీటీసీనే రైళ్లను నడుపుతుందని అనుకుంటారు. కానీ నిజానికి అది తప్పు. దేశవ్యాప్తంగా ట్రాక్‌లు వేయడం, స్టేషన్లు నిర్వహించడం, వేలాది లోకోమోటివ్‌లు, కోచ్‌లను నడపడం, భారీ వ్యయాన్ని భరించడం వంటివన్నీ ఇండియన్ రైల్వేస్ చూసుకుంటుంది. ఐఆర్‌సీటీసీ కేవలం కొన్ని ప్రత్యేక కార్పొరేట్, టూరిస్ట్ రైళ్లను మాత్రమే నడుపుతుంది. అయినప్పటికీ ఐఆర్‌సీటీసీ వేల కోట్ల రూపాయల లాభాలను ఎలా గడిస్తోంది? దీని వెనుక ఉన్న అసలైన వ్యాపార రహస్యం చాలా మందికి తెలియదు.
స్క్రీన్ ఒక్కటే.. కానీ వందల కోట్ల ఆదాయం..
రైలు ప్రయాణం కోసం మనం చూసే బుకింగ్ స్క్రీన్ దగ్గరే ఐఆర్‌సీటీసీ అసలైన వ్యాపార బలం దాగి ఉంది. భారతదేశంలో రిజర్వ్డ్ రైల్వే టికెట్ బుకింగ్ మార్కెట్లో ఐఆర్‌సీటీసీకి ఏకంగా 89 శాతం వాటా ఉంది. మీరు ఐఆర్‌సీటీసీ యాప్‌లో బుక్ చేసినా లేదా ఇతర ప్రైవేట్ ట్రావెల్ యాప్స్ ద్వారా బుక్ చేసినా ఆ లావాదేవీలు ఐఆర్‌సీటీసీ వ్యవస్థ ద్వారానే జరగాలి. గత ఆర్థిక సంవత్సరంలో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా రోజుకు సగటున 13.88 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. అంటే ఏడాదికి 50 కోట్లకు పైగా టికెట్లు అన్నమాట..
ఆ 15 రూపాయలే.. వేల కోట్ల సామ్రాజ్యం..
ఐఆర్‌సీటీసీ వసూలు చేసే కన్వీనియన్స్ ఫీజు చాలా తక్కువగా అనిపిస్తుంది.
- నాన్ ఏసీ ఈ టికెట్‌కు: రూ.15 + జీఎస్టీ
- ఏసీ ఈ టికెట్‌కు: రూ.30 + జీఎస్టీ
చదవడానికి ఇది చిన్న మొత్తంగా అనిపించినా.. కోట్ల సంఖ్యలో టికెట్లు బుక్ అయినప్పుడు ఇది అక్షరాలా బంగారంగా మారుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనే ఐఆర్‌సీటీసీ 13.39 కోట్ల టికెట్లను బుక్ చేసి, కేవలం ఈ కన్వీనియన్స్ ఫీజుల ద్వారానే రూ.247 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
డిజిటల్ టోల్‌బూత్
రైలులో ప్రయాణికుడికి భోజనం వండాలన్నా, వాటర్ బాటిల్ అందించాలన్నా ఖర్చు అవుతుంది. కానీ ఒకసారి డిజిటల్ సిస్టమ్ సెట్ చేసిన తర్వాత.. అదనంగా మరో లక్ష టికెట్లు ప్రాసెస్ చేయడానికి ఐఆర్‌సీటీసీకి అయ్యే ఖర్చు చాలా తక్కువ. అందుకే 2025-26 చివరి త్రైమాసికంలో ఇంటర్నెట్ టికెటింగ్ ద్వారా రూ.390 కోట్ల రెవెన్యూ రాగా.. అందులో EBITDA మార్జిన్ ఏకంగా 76 శాతంగా నమోదైంది. ఎలాంటి సొంత ప్రొడక్ట్ తయారు చేయకుండా వేల షాపులు పెట్టకుండా భారీగా అడ్వర్టైజ్‌మెంట్లు చేయకుండా ఇంత పెద్ద మొత్తంలో లాభాలు రావడం ఒక్క డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కే సాధ్యం.
కేటరింగ్‌లో రెవెన్యూ ఎక్కువ.. టికెటింగ్‌లో లాభం ఎక్కువ..
ఆర్థిక సంవత్సరం 2025-26 నివేదిక ప్రకారం ఐఆర్‌సీటీసీ వ్యాపారాల ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి..
- కేటరింగ్ – రూ.2,399 కోట్లు
- ఇంటర్నెట్ టికెటింగ్ – 1,536 కోట్లు
- టూరిజం – రూ.890 కోట్లు
- రైల్ నీర్ – రూ.391 కోట్లు
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఐఆర్‌సీటీసీకి కేటరింగ్ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తున్నప్పటికీ, అందులో ఫుడ్ మెటీరియల్స్, ఉద్యోగులు, కిచెన్‌లు, లాజిస్టిక్స్ వంటి భౌతిక ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రైల్ నీర్ బాటిళ్లకు ఫ్యాక్టరీలు కావాలి, టూరిజానికి హోటల్స్ బుక్ చేయాలి. కానీ టికెటింగ్ వ్యాపారానికి అలాంటి భౌతిక ఖర్చులు ఉండవు కాబట్టి ఇందులో లాభాల శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.
గెలుపు సూత్రం
ప్రయాణికుడు తన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుని, డబ్బులు చెల్లించే అత్యంత కీలకమైన సమయంలో ఐఆర్‌సీటీసీ అతడిని కలుస్తుంది. అక్కడి నుంచే వారికి భోజనాలు, హాలిడే ప్యాకేజీలు, లగ్జరీ రైలు ప్రయాణాలు, హోటల్ రూమ్‌లు, వాటర్ బాటిళ్లను క్రాస్ సెల్ చేస్తుంది. ఈ వినూత్న వ్యాపార శైలి కారణంగానే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఐఆర్‌సీటీసీ కార్యకలాపాల ద్వారా రూ.5,215 కోట్ల ఆదాయాన్ని, రూ.1,393 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
కాగా శతాబ్ద కాలంగా ఇండియన్ రైల్వేస్ నిర్మించిన భారీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటూ.. ప్రయాణికుడు ప్రయాణం ప్రారంభించే ఆ చిన్న డిజిటల్ గేట్ వద్ద నిలబడి ఐఆర్‌సీటీసీ టోల్ ఫీజు వసూలు చేస్తోంది. కష్టపడి పనిచేసే సంస్థ కంటే సరైన లాభదాయకమైన స్థానాన్ని ఆక్యుపై చేసిన సంస్థే బిజినెస్‌లో ఎక్కువ గెలుస్తుందనడానికి ఐఆర్‌సీటీసీ ఒక అద్భుతమైన ఉదాహరణ.
