Indian Railways: ప్రయాణికులకు రైల్వేశాఖ భారీ గుడ్ న్యూస్.. 908 ప్రత్యేక రైళ్లకు గ్రీన్ సిగ్నల్..
సమ్మర్ వేళ రైల్వేశాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. రానున్న మూడు నెలల పాటు భారీగా ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు రైల్వే బోర్డు ఆమోదం తెలపగా.. అనంతరం నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. పలు మార్గాల్లో వీటిని నడపనున్నట్లు స్పష్టం చేసింది.

ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. వేసవికాలం సెలవుల కారణంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఈ వేసవికాలం మూడు నెలల పాటు ఏకంగా 18 వేల 262 ప్రత్యేక రైళ్ల ట్రిప్పులను నడిపేందుకు సిద్దమైంది. సెంట్రల్ రైల్వే 3082 ట్రిప్పులు, ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2711, నార్త్ వెస్టర్న్ రైల్వే 2245 ట్రిప్పులను తిప్పనుంది. వేసవి సెలవుల కారణంగా ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. పర్యాటక ప్రదేశాలు, ఆలయాలకు వెళ్తున్నారు. దీంతో రైళ్లల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ వెయిట్‌లిస్ట్‌లను తగ్గించడం, సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు, మరింత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు పలు మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, మెరుగైన ప్రయాణం అందించేందుకు ఈ స్పెషల్ రైళ్లను తీసుకొచ్చినట్లు రైల్వేశాఖ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
908 ప్రత్యేక రైళ్లకు ఆమోదం
ఏప్రిల్ 15వ తేదీ నుంచి జులై 15వ తేదీ వరకు ఈ సమ్మర్ స్పెషల్ రైళ్లు నడవనున్నాయి. మొత్తం 908 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఇవి 18,2358 ట్రిప్పులు తిరగనున్నాయి. వీటిల్లో 660 రైళ్లను 11,294 ట్రిప్పులకు ఇప్పటికే నోటిఫై చేశారు. ప్రయాణికులు వీటిల్లో ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చని, మెరుగైన ప్రయాణాన్ని పొందవచ్చని రైల్వేశాఖ స్పష్టం చేసింది.
ఏ జోన్‌లో ఎన్ని..?
-దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 124 రైలు సర్వీసులను ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలపగా.. వాటిల్లో 76 రైళ్లకు నోటిఫికేషన్ జారీ చేశారు.
-ఇక పశ్చిమ రైల్వే పరిధిలో 106 రైళ్లకు గాను 92 రైళ్లను ఇప్పటికే నోటిఫై చేశారు.
-నార్త్ వెస్టర్న్ రైల్వే పరిధిలో 76 రైళ్లకు ఆమోదం తెలపగా.. వాటిల్లో 62 రైళ్లకు నోటిఫికేషన్ జారీ చేశారు.
-ఉత్తర రైల్వే పరిధిలో 76 రైళ్లకు ఆమోదం తెలపగా.. 56 రైళ్లను నోటిఫై చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
-సెంట్రల్ రైల్వే పరిధిలో 74 రైళ్లకు గాను 70 రైళ్లను నోటిఫై చేశారు.
-దక్షిణ రైల్వే పరిధిలో 72 రైళ్లకు గాను 38 రైళ్లకు నోటిఫికేషన్ ఇచ్చారు
-తూర్పు మధ్య రైల్వే పరిధిలో 64 రైళ్లకు గాను 38 రైళ్లకు నోటిఫికేషన్ ఇచ్చారు.
-ఈశాన్య రైల్వే పరిధిలో 52 రైళ్లకుగాను 34 రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు
-ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో 28 రైళ్లకుకు ఆమోదం తెలపగా.. వాటిల్లో 18 రైళ్లకు నోటిఫికేషన్ జారీ చేశారు.
-పశ్చిమ మధ్య రైల్వే పరిధిలో 28 రైళ్లకు ఆమోదం తెలపగా.. వాటిల్లో 18 రైళ్లను నోటిఫై చేశారు.
-తూర్పు రైల్వే పరిధిలో 24 రైళ్లకు గాను 10 రైళ్లను నోటిఫై చేశారు
-ఇక సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో 20 రైళ్లకు ఆమోదం లభించగా.. వాటిల్లో 18 రైళ్లను నోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
-సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో 10 రైళ్లకు ఆమోదం తెలపగా.. వాటిల్లో 8 రైళ్లకు పచ్చజెండా ఊపారు
