IT రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ట్యాక్స్ సాథీ ఎలా యూజ్ అవుతుంది? పూర్తి వివరాలు..
ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ‘టాక్స్ సాథీ’ అనే ఏఐ చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టింది. పన్ను చెల్లింపుదారులకు డిజిటల్ సహాయకుడిగా ఇది పనిచేస్తుంది. పన్నుల సందేహాల కు వెంటనే సమాధానాలు, రీఫండ్ స్థితి, నోటీసుల స్పందన, రిటర్న్ ఫైలింగ్ మార్గదర్శకత్వం వంటి సేవలను అందిస్తుంది.

పన్నుల వ్యవహారం అంటే సామాన్యుడికి ఎప్పటినుంచో ఒక కఠినమైన ప్రక్రియగా భావన ఉంది. ప్రతి సంవత్సరం రిటర్న్‌లు దాఖలు చేసే సమయంలో క్లిష్టమైన నిబంధనలు, అనేక ఫారాలు, చిన్న పొరపాట్లకే వచ్చే నోటీసులు పన్ను చెల్లింపుదారులను ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ‘టాక్స్ సాథీ’ అనే అత్యాధునిక ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ను ప్రారంభిస్తూ, పన్ను చెల్లింపుదారులకు డిజిటల్ సహాయకుడిని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ కొత్త వ్యవస్థ ద్వారా పన్నులకు సంబంధించిన అనేక సందేహాలకు వెంటనే సమాధానాలు లభిస్తాయి. ఇప్పటివరకు చిన్న విషయాల కోసం కూడా చార్టర్డ్ అకౌంటెంట్లు లేదా నిపుణులను సంప్రదించాల్సి వచ్చేది. కానీ ‘టాక్స్ సాథీ’తో ఆ అవసరం గణనీయంగా తగ్గనుంది. రీఫండ్ స్థితి తెలుసుకోవడం నుంచి పాత నోటీసులకు స్పందించడం వరకు, రిటర్న్ ఫైలింగ్ ప్రక్రియను అర్థం చేసుకోవడం వరకు అన్ని సేవలు ఒకే వేదికపై అందుబాటులో ఉంటాయి. పన్ను వ్యవస్థలో ప్రధాన సమస్యలలో ఒకటి దాని క్లిష్టమైన భాష. దీనివల్ల సాధారణ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు గందరగోళానికి గురవుతుంటారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, టాక్స్ సాథీ క్లిష్టమైన నిబంధనలను సులభమైన భాషలో వివరిస్తుంది. ఇది రిటర్న్ ఫైలింగ్ మొత్తం ప్రక్రియలో దశలవారీ మార్గదర్శకత్వం అందిస్తూ, వినియోగదారుడికి తదుపరి ఏం చేయాలో స్పష్టంగా తెలియజేస్తుంది.
2,000కు పైగా అంశాలపై ముందుగానే సిద్ధం చేసిన సమాచారం ఇందులో అందుబాటులో ఉండటం మరో ప్రత్యేకత. అదనంగా, ఈ సేవ 24 గంటలూ అందుబాటులో ఉండటం వల్ల కస్టమర్ కేర్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. అత్యంత ముఖ్యంగా, పన్నులు దాఖలు చేసే సమయంలో జరిగే పొరపాట్లను ముందుగానే గుర్తించి హెచ్చరించడం ఈ చాట్‌బాట్ ప్రధాన ప్రయోజనం. తప్పుడు ఫారమ్ ఎంపిక లేదా అసంపూర్ణ సమాచారం వల్ల విధించే జరిమానాలు, నోటీసుల ప్రమాదాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా కొత్త పన్ను చెల్లింపుదారులు, చిన్న పెట్టుబడిదారులకు ఇది ఒక భద్రతా కవచంలా ఉపయోగపడనుంది. మొత్తంగా చూస్తే, టాక్స్ సాథీ ప్రవేశంతో పన్ను వ్యవస్థ మరింత సులభం, పారదర్శకంగా మారే అవకాశముంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
