ఈ సంక్షోభ సమయంలో ఓ గుడ్‌న్యూస్! విద్యుత్ బిల్లులు పెంచకుండా ఉండేందుకు..
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు, ముడిసరుకుల ధరల పెరుగుదల భారత ఇంధన రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దీనికి ప్రతిస్పందనగా, కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) పెరిగిన ఖర్చులను వినియోగదారులపై మోపకుండా, తానే భరిస్తోంది. పేలుడు పదార్థాలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ, విద్యుత్, ఉక్కు వంటి రంగాలపై భారం పడకుండా, బొగ్గు ధరల స్థిరత్వాన్ని కాపాడటం CIL లక్ష్యం.

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారత ఇంధన రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ముడిసరుకు ధరల భారాన్ని వినియోగదారులపై మోపకుండా, ఆ ఖర్చును స్వయంగా భరించేందుకు సంస్థ ముందుకు వచ్చింది. బొగ్గు ధరలు పెరిగితే, దాని ప్రభావం విద్యుత్, ఉక్కు వంటి పలు రంగాలపై పడే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం పేలుడు పదార్థాలు, పారిశ్రామిక డీజిల్ వంటి కీలక ముడిసరుకుల ధరలు భారీగా పెరిగాయి.
ముఖ్యంగా ఓపెన్‌కాస్ట్ గనుల్లో విస్తృతంగా ఉపయోగించే అమ్మోనియం నైట్రేట్ ధర ఏప్రిల్ నాటికి టన్నుకు రూ.72,750కు చేరి, యుద్ధానికి ముందు స్థాయిలతో పోలిస్తే సుమారు 44 శాతం పెరిగింది. దీని ప్రభావంగా పేలుడు పదార్థాల సగటు ధర కూడా గణనీయంగా పెరిగింది. ప్రతి ఏడాది దాదాపు 0.9 మిలియన్ టన్నుల పేలుడు పదార్థాలను వినియోగించే కోల్ ఇండియా, ఈ పెరిగిన ఖర్చును పూర్తిగా తానే భరిస్తోందని వెల్లడించింది. ఇంకా డీజిల్ ధరలు కూడా తీవ్రంగా పెరిగాయి. మార్చి మధ్యలో లీటరుకు రూ.92గా ఉన్న ధరలు, కొద్ది వారాల్లోనే రూ.142కు చేరాయి.
2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సుమారు 4.19 లక్షల కిలోలీటర్ల డీజిల్‌ను వినియోగించింది. పెరిగిన ధరల ప్రభావంతో గనుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు నష్టపరిహారం కూడా చెల్లిస్తోంది. వ్యయ ఒత్తిళ్లు పెరిగినప్పటికీ, వినియోగదారులకు అందుబాటు ధరల్లో బొగ్గును అందించేందుకు సంస్థ అనేక చర్యలు చేపట్టింది. ఇ-వేలంపాటలలో రిజర్వ్ ధరలను తగ్గించడం, వేలం తరచుదనాన్ని పెంచడం, మార్కెట్లో మరింత బొగ్గు అందుబాటులో ఉంచడం వంటి చర్యలు చేపట్టింది. దీని ద్వారా ఇంధన ధరల పెరుగుదల వల్ల ఇతర పరిశ్రమలపై పడే ప్రభావాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మొత్తం మీద అంతర్జాతీయ పరిస్థితులు ఒత్తిడిని సృష్టిస్తున్నప్పటికీ, దేశీయంగా ధరల స్థిరత్వాన్ని కాపాడటంలో కోల్ ఇండియా కీలక పాత్ర పోషిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
