Jasprit Bumrah : 5 మ్యాచ్‌ల్లో 163 పరుగులు.. 19 ఓవర్లు.. 0 వికెట్లు.. బుమ్రా బుల్లెట్లు తుప్పు పట్టాయా?
Jasprit Bumrah : ఐపీఎల్ 2025 సీజన్ చివర్లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్ నుంచి బుమ్రా ఫామ్ కోల్పోయాడు. ఆ మ్యాచ్‌లో 40 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఇక 2026 సీజన్‌లో కోల్‌కతా, ఢిల్లీ, రాజస్థాన్, తాజా బెంగళూరు మ్యాచ్‌లలోనూ ఇదే పరిస్థితి.

Jasprit Bumrah : క్రికెట్ ప్రపంచంలో యార్కర్ కింగ్ అని ఎవరిని పిలుస్తారు అంటే చిన్న పిల్లాడు కూడా జస్రీత్ బుమ్రా అని చెబుతాడు. బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం, వికెట్లను గాల్లోకి ఎగరేయడం బుమ్రాకు వెన్నతో పెట్టిన విద్య. కానీ ఐపీఎల్ 2026లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. గత ఐదు మ్యాచ్‌లుగా బుమ్రా ఒక్క వికెట్ తీయడానికి కూడా నానా తంటాలు పడుతున్నాడు. ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌కు ఏమైంది? ముంబై ఇండియన్స్ గెలుపు గుర్రం ఎందుకు చతికిలబడుతోంది? అనే ఆందోళన ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్‌లో మొదలైంది.
ఆదివారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. బెంగళూరు బ్యాటర్లు ఏకంగా 240 పరుగులు పిండుకున్నారు. ఈ క్రమంలో ముంబై ప్రధాన అస్త్రం జస్రీత్ బుమ్రా కూడా వికెట్ తీయడంలో విఫలమయ్యాడు. నాలుగు ఓవర్లలో 35 పరుగులు ఇచ్చిన బుమ్రా, తన జట్టులో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ.. వికెట్ కాలమ్ మాత్రం సున్నాగానే ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఆయనకు ఒక్క వికెట్ కూడా దక్కకపోవడం గమనార్హం.
నిజానికి ఈ వికెట్ల కరువు ఈ సీజన్‌తోనే మొదలవ్వలేదు. ఐపీఎల్ 2025 సీజన్ చివర్లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్ నుంచి బుమ్రా ఫామ్ కోల్పోయాడు. ఆ మ్యాచ్‌లో 40 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఇక 2026 సీజన్‌లో కోల్‌కతా, ఢిల్లీ, రాజస్థాన్, తాజా బెంగళూరు మ్యాచ్‌లలోనూ ఇదే పరిస్థితి. అంటే గత 5 మ్యాచ్‌ల్లో బుమ్రా ఏకంగా 19 ఓవర్లు (114 బంతులు) వేసి 163 పరుగులు ఇచ్చాడు. కానీ ఒక్క బ్యాటర్‌ను కూడా పెవిలియన్ పంపలేకపోయాడు. ఆయన ఎకానమీ రేటు 8.5గా ఉండటం విశేషం.
ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలవడంలో బుమ్రా పాత్ర ఎంతో ఉంది. కానీ ఇప్పుడు ఆయనే వికెట్లు తీయలేకపోతుండటంతో జట్టుపై ఒత్తిడి పెరుగుతోంది. సాధారణంగా బుమ్రా స్పెల్ కోసం బ్యాటర్లు భయపడి ఆడుతుంటారు, దీనివల్ల ఇతర బౌలర్లకు వికెట్లు దక్కేవి. కానీ ఇప్పుడు బుమ్రా బౌలింగ్‌లో పరుగులు వస్తుండటం, వికెట్లు పడకపోవడంతో ప్రత్యర్థి జట్లు భయం లేకుండా ఆడుతున్నాయి. కేవలం 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ కూడా బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్లు బాదడం ఆయన ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం.
బుమ్రా కేవలం ముంబై ఇండియన్స్‌కే కాదు, భారత జట్టుకు కూడా వెన్నెముక. ఐపీఎల్ ముగిసిన వెంటనే అంతర్జాతీయ మ్యాచులు ఉండటంతో, బుమ్రా ఫామ్ కోల్పోవడం భారత క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. బుమ్రా త్వరగా తన ఫామ్‌ను అందుకోవాలని, తన మార్క్ యార్కర్లతో ప్రత్యర్థులను క్లీన్ బౌల్డ్ చేయాలని అందరూ కోరుకుంటున్నారు. రాబోయే మ్యాచ్‌ల్లోనైనా బుమ్రా వికెట్ల ఖాతా తెరుస్తాడో లేదో వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
