AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రస్తుతం భారత్ వద్ద ఎంత పెట్రోల్ ఉందో తెలుసా..? ఇంకెన్ని రోజులు వస్తుందంటే..!

అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. ఇప్పుడు మీ వంటింటి బడ్జెట్‌ను, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. ఈ యుద్ధం ఇంకొన్నాళ్లు ఇలాగే కొనసాగితే.. 1929 నాటి భయంకరమైన ఆర్థిక సంక్షోభం మళ్లీ రిపీట్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం భారత్ వద్ద ఎన్ని కోట్ల లీటర్ల పెట్రోల్ ఉంది..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం భారత్ వద్ద ఎంత పెట్రోల్ ఉందో తెలుసా..? ఇంకెన్ని రోజులు వస్తుందంటే..!
How Many Crore Liters Of Crude Oil Does India Have In Reserve
Krishna S
|

Updated on: Mar 10, 2026 | 4:36 PM

Share

పశ్చిమాసియాలో రాజుకున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దహించివేసే స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా జరిపిన వైమానిక దాడులు కేవలం సైనిక చర్యలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్త చమురు సంక్షోభానికి దారితీస్తున్నాయి. హార్ముజ్ జలసంధి వేదికగా ఇరాన్ వేస్తున్న ఎత్తుగడలు ఇప్పుడు భారత్ సహా అనేక దేశాల నిద్రను చెడగొడుతున్నాయి. ప్రపంచ ముడి చమురు రవాణాలో 20 శాతం వాటా కలిగిన హార్ముజ్ జలసంధిని ఇరాన్ తన గుప్పిట్లోకి తీసుకోవడం ఇప్పుడు పెను ముప్పుగా మారింది. చమురు ట్యాంకర్లపై దాడులు పెరగడంతో ఈ మార్గంలో రవాణా దాదాపు నిలిచిపోయింది. సోమవారం ఒక్కరోజే బ్యారెల్ ముడి చమురు ధర 85 డాలర్ల నుండి 115 డాలర్లకి దూసుకువెళ్లింది. యుద్ధం ఇలాగే కొనసాగితే ఇది 200డాలర్లకి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత్‌పై ప్రభావం: 90శాతం దిగుమతులపైనే ఆధారం

భారతదేశం తన చమురు అవసరాల కోసం 90 శాతం ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది. మనకు అందే చమురులో 40 శాతం హార్ముజ్ జలసంధి ద్వారానే వస్తుంది. ప్రస్తుతం భారత్ వద్ద 4000 కోట్ల లీటర్ల (సుమారు 250 మిలియన్ బ్యారెళ్లు) నిల్వలు ఉన్నాయి. ఇది మన అవసరాలకు కేవలం 7 నుండి 8 వారాలకు మాత్రమే సరిపోతుంది. గతంలో 27 దేశాల నుండి కొనుగోలు చేసిన భారత్.. ఇప్పుడు రష్యా, అమెరికా సహా 40 దేశాల నుండి చమురు సేకరిస్తున్నప్పటికీ ధరల పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని పెంచే ప్రమాదం ఉంది.

రోజువారీ వస్తువుల నుంచి ఆసుపత్రుల వరకు.. అన్నీ ఖరీదే

ముడి చమురు అంటే కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు. దీని ద్వారా సుమారు 6000 రకాల వస్తువులు తయారవుతాయి. మనం వాడే ప్లాస్టిక్, షాంపూలు, సౌందర్య సాధనాలు, సిరంజిలు, కృత్రిమ అవయవాలు, గుండె కవాటాలను తయారుచేస్తారు. ముడి చమురు ధర పెరిగితే, సామాన్యుడి సబ్బు దగ్గర నుండి ఆసుపత్రి బిల్లు వరకు ప్రతిదీ భారంగా మారుతుంది.

1929 నాటి మహా మాంద్యం రిపీట్..?

ప్రముఖ సంస్థ వుడ్ మెకెంజీ అంచనా ప్రకారం.. ఈ యుద్ధం మరో వారం రోజులు ఇలాగే కొనసాగితే ప్రపంచం 1929 నాటి మహా మాంద్యం వంటి భయంకరమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే అవకాశం ఉంది. ఆనాడు అమెరికాలో మొదలైన సంక్షోభం కోట్లాది మందిని నిరుద్యోగులుగా మార్చింది. ఇప్పుడు చమురు సంక్షోభం రూపంలో అదే ముప్పు పొంచి ఉంది.

ఇంకెన్నాళ్లు..?

అమెరికా, ఇజ్రాయెల్ అత్యాధునిక ఆయుధ సంపత్తి ముందు ఇరాన్ సైనిక పరంగా నష్టపోయినప్పటికీ.. చమురు యుద్ధంలో మాత్రం గట్టి పోటీ ఇస్తోంది. గల్ఫ్ చమురు ప్రాజెక్టులపై దాడులు చేయడం ద్వారా ప్రపంచ మార్కెట్‌ను శాసించే ప్రయత్నం చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ వంటి నేతలు యుద్ధం త్వరగా ముగియాలని కోరుకుంటున్నారంటేనే ఇరాన్ సృష్టించిన ఆర్థిక ఒత్తిడి ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి యుద్ధం ఆగిపోవడమే ప్రపంచ దేశాల ముందున్న ఏకైక పరిష్కారం. లేదంటే, రాబోయే రోజుల్లో ప్రతి ఇల్లు ఆర్థిక సంక్షోభపు సెగను అనుభవించక తప్పదు.

Follow Us