Auto Expo 2025: ఫోల్డబుల్ ఈవీ స్కూటర్ రిలీజ్ చేసిన హోండా.. క్యూట్ లుక్‌తో కుమ్మెస్తుందిగా..!
భారతదేశంలో నిర్వహిస్తున్న ఆటో ఎక్స్‌పో-2025లో కొన్ని కంపెనీలు సరికొత్త వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ప్రముఖ కంపెనీ అయిన హోండా ఫోల్డబుల్ ఈవీ స్కూటర్‌ను ఈ ఎక్స్‌పో పరిచయం చేసింది. చూడడానికి సూట్ కేస్‌లా కనిపించే ఈ స్కూటర్‌ను ఎక్కడికైనా సింపుల్‌గా పట్టుకెళ్లవచ్చు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈవీ స్కూటర్లతో పాటు సీఎన్‌జీ స్కూటర్ల డిమాండ్ పెరుగుతుంది. అయితే స్కూటర్ ఏదైనా కొత్త కాన్సెప్ట్‌తో మన ముందుకు వస్తే డిమాండ్ పెరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో లైట్-వెయిట్ ఫోల్డబుల్ స్కూటర్‌ను హోండా ఆవిష్కరించింది. మోటో కాంపాక్టో అనే పేరుతో ఉన్న ఈ స్కూటర్ బరువు 19 కిలోలు మాత్రమే. ఈ స్కూటర్ 120 కిలోల బరువున్న వ్యక్తిని మోసుకెళ్లగలదని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఈ-స్కూటర్ ఒక్కసారి మడతపెట్టిన తర్వాత సూట్‌కేస్ లాగా ఉంటుంది. కంపెనీ దీనిని 2023లో విడుదల చేస్తామని గతంలో ప్రకటించినా 2026లో భారతదేశంలో అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
మోటో కాంపాక్టోకు అతి పెద్ద ఆకర్షణ దాని ఫోల్డబుల్ డిజైన్ అని నిపుణులు చెబుతున్నారు. ఈ డిజైన్ వల్ల ఈ స్కూటర్‌ను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఈ-స్కూటర్ సూక్ష్మమైన స్టైలింగ్ అంశాలతో పాటు హోండా బ్రాండింగ్‌తో ఆకట్టుకుంటుంది. ఈ-స్కూటర్‌లో ఫోల్డబుల్ సీటు, హ్యాండిల్ బార్ కూడా ఉన్నాయి. ఈ స్కూటర్ 742 ఎంఎం పొడవు, 94 ఎంఎం వెడల్పు, 536 ఎంఎం ఎత్తుతో వస్తుంది. అందువల్ల ఈ స్కూటర్‌ను సులభంగా ఎక్కడికైనా తీసుకువెళ్లవచ్చు. ఈ-స్కూటర్‌కు సంబంధించిన వీల్‌బేస్ కేవలం 742 మిమీ, సీటు ఎత్తు 622 మిమీగా ఉంది.
మోటో కాంపాక్టో శాశ్వత మాగ్నెట్ డైరెక్ట్-డ్రైవ్ మోటార్‌తో అమర్చబడి ఉంది. ఇది గరిష్టంగా 490 వాట్స్ పవర్ అవుట్‌పుట్, 16 ఎన్ఎం టార్క్‌తో వస్తుంది. ఈ-స్కూటర్ 19.31 కి.మీ పరిధితో వస్తుంది. అలాగే ఈ స్కూటర్ గరిష్ట వేగం 24.14 కి.మీగా ఉంది. ఈ స్కూటర్ 0.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ స్కూటర్‌ను 110 వాట్స్ సాకెట్ ద్వారా 3 గంటల 30 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. మోటో కాంపాక్టో ప్రస్తుతం విదేశాలలో విక్రయానికి అందుబాటులో ఉంది. దాదాపు 2026 నాటికి భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది. ఈ స్కూటర్ ధర ఇంకా ప్రకటించకపోయినా ఈ స్కూటర్ ధర రూ.లక్ష లోపే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.








