LIC Policy: ఎల్ఐసీ నుంచి సూపర్ పాలసీ.. ఒకేసారి పెట్టుబడి.. నెలనెలా పెన్షన్.. పూర్తి వివరాలు ఇవి..
వృద్ధాప్యంలో ప్రతీ నెల ఆదాయం కోరుకునేవారికి ఈ పాలసీ మంచి ఆప్షన్. ఎల్ఐసీ జీవన్ అక్షయ్-VII పాలసీని ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో తీసుకోవచ్చు. ఇది సింగిల్ ప్రీమియం నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, పర్సనల్ యాన్యుటీ ప్లాన్.
లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( ఎల్ఐసీ) అంటేనే ప్రజల్లో బాగా నమ్మకం. అందరూ దీనిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడతారు. అదే క్రమంలో ఎల్ఐసీ సైతం వినియోగదారులను ఆకర్షించేందుకు పలు రకాల పాలసీలు అందిస్తుంటుంది. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత జీవితానికి సంబంధించి కూడా బెస్ట్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ది బెస్ట్ ఎల్ఐసీ జీవన్ అక్షయ్-VII. దీనిలో ఒక్కసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే.. రిటైర్ మెంట్ తర్వాత నెలనెలా పెన్షన్ తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ పథకం ఎలా పనిచేస్తుంది? అర్హతలేంటి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇది జీవన్ అక్షయ్ VII..
వృద్ధాప్యంలో పెన్షన్ కోరుకునేవారికి, ప్రతీ నెల ఆదాయం కోరుకునేవారికి ఈ పాలసీ మంచి ఆప్షన్. ఎల్ఐసీ జీవన్ అక్షయ్-VII పాలసీని ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో తీసుకోవచ్చు. ఇది సింగిల్ ప్రీమియం నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, పర్సనల్ యాన్యుటీ ప్లాన్. ఈ పాలసీ తీసుకోవడానికి ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఎల్ఐసీ దీనిని ప్రారంభించింది. ఈ ప్లాన్ లో పాలసీదారులకు వారి నిర్దిష్ట అవసరాల ఆధారంగా 10 విభిన్న యాన్యుటీ ఆప్షన్‌లను ఎంచుకునే సౌలభ్యాన్ని అందిస్తుంది. రూ. 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలు ధర లేదా ప్రారంభ ఏకమొత్తం చెల్లింపు చేసే పాలసీదారులు ఇన్సెంటివ్స్ కి అర్హులు. ఇది యాన్యుటీ రేటును పెంచుతుంది, అదనపు ప్రయోజనాన్ని అందిస్తుంది.
జీవన్ అక్షయ్ VII కి అర్హతలు ఇవి..
ఎల్ఐసీ జీవన్ అక్షయ్ VII పాలసీని కొనుగోలు చేయడానికి 30 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు అర్హులు. గరిష్ట వయస్సు100 సంవత్సరాల వరకూ ఉంటుంది. ఎల్ఐసీ జీవన్ అక్షయ్ 7 పాలసీలో కనీసం రూ.1,00,000 సింగిల్ ప్రీమియం చెల్లించాలి. వారికి ఏడాదికి రూ.12,000 యాన్యుటీ వస్తుంది. ఈ పాలసీలో లోన్ సదుపాయం కూడా ఉంది. పాలసీ తీసుకున్న మూడు నెలల తర్వాత లేదా ఫ్రీ లుక్ పీరియడ్ ముగిసిన తర్వాత లోన్ తీసుకోవచ్చు. ఇక పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే యాన్యుటీ ఆగిపోతుంది. సమ్ అష్యూర్డ్‌ను నామినీకి ఇస్తారు. ఇక ఈ పాలసీ తీసుకున్నవారికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీసీసీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
ఈ ఉదాహరణ చూడండి..
32 ఏళ్ల వ్యక్తి ఎల్ఐసీ జీవన్ అక్షయ్ 7 పాలసీ రూ.40,00,000 సమ్ అష్యూర్డ్‌కు పాలసీ తీసుకోవాలంటే ఒకేసారి రూ.40,72,000 ప్రీమియం చెల్లించాలి. నెలకు రూ.19,000, మూడు నెలలకు రూ.57,350, ఆరు నెలలకు రూ.1,15,600, ఏడాదికి రూ.2,34,800 యాన్యుటీ వస్తుంది. ఇలా జీవతకాలమంతా పొందొచ్చు. మొదట చెల్లించే ప్రీమియంను బట్టి యాన్యుటీ మారుతుంది. పాలసీ తీసుకున్నప్పుటే వడ్డీ రేటును లాక్ చేస్తారు. ఉదాహరణకు ఓ వ్యక్తి ఈ పాలసీని రూ.5,00,000 ప్రీమియం చెల్లించి తీసుకున్నారనుకుందాం. వడ్డీ రేటు 7 శాతంగా నిర్ణయిస్తే జీవితాంతం అదే వడ్డీ రేటు ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..