GST New Slab: త్వరలో పేలనున్న జీఎస్టీ బాంబు.. పన్ను రేట్ల పెంపు?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో కొత్త విధానం తీసుకురావడానికి అడుగులు వేస్తోంది. ఇప్పటికే అమల్లో ఉన్న జీఎస్ టీ లో మరిన్ని మార్పులు చేయనుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ వేగంగా జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

GST New Slab: త్వరలో పేలనున్న జీఎస్టీ బాంబు.. పన్ను రేట్ల పెంపు?
Follow us
Srinu

|

Updated on: Dec 04, 2024 | 5:00 PM

మనం నిత్యం మార్కెట్ లో వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటాం. నిబంధనల మేరకు వాటన్నింటిపై జీఎస్ టీ ఉంటుంది. వస్తువు ధరతో పాటు జీఎస్టీని అందరూ చెల్లించాలి. ఈ జీఎస్టీ పర్సంటేజీ అనేది ఆయా వస్తువులపై ఆధారపడి ఉంటుంది. దీనిలో మరో కొత్త విధానానికి కేంద్ర ప్రభుత్వం తెరలేపనుంది. వస్తు, సేవల పన్నునే జీఎస్టీ అని పిలుస్తారు. 2017 జూలై 1న ఈ విధానాన్ని దేశ వ్యాప్తంగా అమల్లోకి తీసుకువచ్చారు. వివిధ కేంద్ర, రాష్ట్ర పన్నులన్నింటినీ కలిపి ఒక దేశం, ఒకే పన్ను అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ని తీసుకువచ్చింది. ప్రస్తుతానికి దీనిలో 5, 12, 18, 28 శాతం అనే నాలుగు రకాల శ్లాబులు అమలవుతున్నాయి. ఆయా వస్తువుల ఆధారంగా ఈ శాతాన్ని విధిస్తారు. ఈ నాలుగు శ్లాబులకు అదనంగా మరో శ్లాబు ను అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది.

జీఎస్టీ శాతం హేతుబద్ధీకరణపై ఇటీవల బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆధ్వర్యంలో మంత్రులు (జీవోఎం) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, ఇతర శీతల పానీయాలు, గ్యాంబ్లింగ్ పై 35 శాతం పన్ను వేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఇవన్నీ 28 శాతం పన్ను శ్లాబ్ లో కొనసాగుతున్నాయి. దీంతో ఐదో శ్లాబ్ విధానం తీసుకువచ్చి, దానిలో పైన తెలిపిన వస్తువులను చేర్చుతారని, వీటికి 35 శాతం జీఎస్టీ విధిస్తారని సమాచారం. కొత్త శ్లాబ్ రూపకల్పనతో పాటు పాత వాటిలో రేట్ల సర్దుబాటుపై కూడా మంత్రులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దుస్తులు, మరికొన్నింటిపై జీఎస్టీ మార్పులు చేయాలని చర్చించారు. దుస్తులకు సంబంధించి రూ.1500 వరకూ ఐదు శాతం, రూ.1500 నుంచి రూ10 వేల మధ్య 18 శాతం, రూ.10 వేలకు పైన 28 శాతం పన్ను విధిస్తారు. మొత్తం 148 రకాల వస్తువులు, సేవలపై ప్రస్తుతం ఉన్న పన్ను రేట్లను సవరించాలని మంత్రులు ప్రతిపాదించింది. వీటిలో ఎక్కువ శాతం ప్రస్తుతం 18 శాతం శ్లాబులో ఉన్నాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాయకత్వంలో డిసెంబర్ 21న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. మంత్రుల ప్రతిపాదనలపై ఆ సమాశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. ముందుగా వాటిపై కూలంకషంగా చర్చిస్తారు. అయితే పన్ను వసూలు పెంచుకోవడంలో భాగంగానే కేంద్రం ఈ రేట్లను సర్డుబాటు చేస్తుందని సమాచారం. జీఎస్టీ విధానంలో నిత్యావసరాలకు సున్నా నుంచి ఐదు శాతం పన్ను విధిస్తున్నారు. అలాగే లగ్జరీ వస్తువులు, ఆరోగ్యానికి హాని కలిగించే వస్తువులపై దాదాపు 28 శాతం అమలు చేస్తున్నారు. ఈ కేటగిరీలో ఖరీదైన కార్లు, మోటారు సైకిళ్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, కొన్ని రకాల శీతల పానీయాలు, గ్యాంబింగ్, క్యాసినోలు, లాటరీ ఉన్నాయి. ప్రస్తుతం వీటికి పన్నును పెంచాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి