Gold: వచ్చేవారం బంగారం ధర పెరుగుతుందా..? వెండి వేగం తగ్గుతుందా..? షాకింగ్ లెక్కలు ఇవే..
బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పసిడి సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి, అమెరికా ఫెడ్ నిర్ణయాలు పసిడికి రెక్కలు ఇస్తుంటే.. వెండి సైతం అదే బాటలో పయనిస్తూ ఆశ్చర్యకరమైన ర్యాలీని కొనసాగిస్తోంది. మరి వచ్చే వారం ఈ పసిడి పరుగు ఎక్కడి వరకు వెళ్తుంది? అనేది తెలుసుకుందాం..

విలువైన లోహాల మార్కెట్‌లో పసిడి పరుగు కొనసాగుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి తోడవడంతో బంగారం ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి కూడా తన జీవితకాల గరిష్ట స్థాయిని తాకి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరుస్తోంది. గడిచిన వారంలో దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు 2.7శాతం (రూ.3,698) పెరిగాయి. బుధవారం నాడు 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,590 వద్ద ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సుకు 4,650.50 డాలర్ల మార్కును తాకింది.
ఎందుకు పెరుగుతోంది?
ఇరాన్ చుట్టూ నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లను బంగారం వైపు మళ్లిస్తున్నాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలు పసిడికి ఊతాన్నిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ కేంద్ర బ్యాంకులు తమ నిల్వలకు భారీగా బంగారాన్ని జోడిస్తున్నాయి.
వెండి ర్యాలీ
గడిచిన వారంలో వెండి ధరలు ఏకంగా 14శాతం పెరిగి కిలోకు రూ.2,92,960 వద్ద రికార్డు సృష్టించాయి. అంతర్జాతీయంగా ఔన్సు వెండి ధర 93.75 డాలర్లకి చేరింది. అయితే ఇంతటి భారీ ర్యాలీ తర్వాత వెండి ధరల్లో కొంత దిద్దుబాటు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ కమోడిటీ విశ్లేషకులు ప్రథమేష్ మాల్యా అంచనా ప్రకారం.. బంగారం వచ్చే వారం దేశీయంగా 10 గ్రాములకు రూ.1,46,000 వరకు చేరవచ్చు. అంతర్జాతీయంగా ఔన్సుకు 4,750 డాలర్లను మార్కును తాకవచ్చు. వెండి ఔన్సుకు 100 డాలర్ల మార్కుకు చేరువలో ఉన్నందున, అక్కడ కొంత లాభాల బుకింగ్ జరిగే అవకాశం ఉంది.
వచ్చే వారం ప్రభావితం చేసే అంశాలు
పెట్టుబడిదారులు ప్రధానంగా ఈ అంశాలపై దృష్టి సారించనున్నారు.
US డేటా: ద్రవ్యోల్బణ గణాంకాలు, GDP వృద్ధి రేటు, నిరుద్యోగ డేటా.
చైనా ఎకానమీ: చైనా నుండి రాబోయే పారిశ్రామిక లోహాల డేటా వెండి ధరలపై ప్రభావం చూపుతుంది.
ట్రంప్ ప్రసంగం: ప్రపంచ వేదికపై డొనాల్డ్ ట్రంప్ చేసే ప్రసంగం, వాణిజ్య విధానాలపై సుప్రీంకోర్టు తీర్పులు కీలకం కానున్నాయి.
బంగారం, వెండి ప్రస్తుతం నిర్మాణపరంగా బలంగా ఉన్నాయి. స్వల్పకాలికంగా ధరల దిద్దుబాటు సహజమే అయినా దీర్ఘకాలంలో వీటి ట్రెండ్ సానుకూలంగానే ఉంటుందని ఇన్‌క్రెడ్ మనీ CEO విజయ్ కుప్పా తెలిపారు. టెక్నాలజీ, పునరుత్పాదక శక్తి విభాగాల్లో వెండికి పెరుగుతున్న డిమాండ్ దీనికి ప్రధాన కారణమని ఆయన తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
