2050లో తులం బంగారం ధర ఎంత ఉంటుంది.. ఈ లెక్కలు చూస్తే దిమ్మతిరగాల్సిందే..
రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్న పసిడి ధరలు భవిష్యత్తులో సామాన్యుడికి అందుతాయా? నిపుణుల అంచనా ప్రకారం 2050 నాటికి తులం బంగారం ధర ఏకంగా రూ. 20 లక్షలు దాటే అవకాశం ఉందా.. అసలు ఈ లెక్కలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు లక్ష రూపాయలు పెడితే అప్పటికి ఎంత లాభం వస్తుంది? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. అది ఒక పటిష్టమైన ఆర్థిక భరోసా. ద్రవ్యోల్బణం పెరిగినా, ఆర్థిక మాంద్యం వచ్చినా అందరూ నమ్మే ఏకైక పెట్టుబడి గోల్డ్. ప్రస్తుతం ఆల్ టైమ్ హైలో ఉన్న బంగారం ధరలు భవిష్యత్తులో ఎక్కడికి చేరుకుంటాయనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా నిపుణుల అంచనాల ప్రకారం.. 2050 నాటికి బంగారం ధరలు ఊహించని స్థాయికి చేరనున్నాయి.
గత 30 ఏళ్ల ప్రస్థానం
గడిచిన మూడు దశాబ్దాల డేటాను పరిశీలిస్తే.. భారతదేశంలో బంగారం ధరలు సగటున ఏడాదికి 10.83శాతం వార్షిక వృద్ధి రేటుతో పెరుగుతూ వచ్చాయి. 2020లో రూ. 50,000 ఉన్న 10 గ్రాముల బంగారం ధర, కేవలం 6 ఏళ్ల కాలంలోనే మూడు రెట్లు పెరగడం గమనార్హం. రూపాయి విలువ పడిపోవడం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణాలు.
2050 నాటికి ధర ఎంత ఉండొచ్చు?
అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషణల ప్రకారం.. భవిష్యత్తులో బంగారం ధర ఔన్సుకు 10,000 డాలర్ల నుండి 20,000 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన భారతీయ మార్కెట్లో ధరలను అంచనా వేస్తే..
- 10శాతం వృద్ధి రేటు ఉంటే: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 14 లక్షల నుండి రూ. 15 లక్షల వరకు ఉంటుంది.
- 12శాతం వృద్ధి రేటు ఉంటే: ధర ఏకంగా రూ. 21 లక్షల నుండి రూ. 22 లక్షల మార్కును చేరుకోవచ్చు.
లక్ష రూపాయల పెట్టుబడి.. 25 ఏళ్ల తర్వాత ఎంతవుతుంది?
మీరు ఇప్పుడు ఒక లక్ష రూపాయలను బంగారంపై పెట్టుబడి పెడితే 2050 నాటికి దాని విలువ..
- 10శాతం వృద్ధి రేటుతో రూ. 9.85 లక్షలు అవుతుంది.
- 12శాతం వృద్ధి రేటుతో రూ. 12 నుండి 15 లక్షలశాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
అదే ఒక లక్ష రూపాయలను బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే, అది 2050 నాటికి గరిష్టంగా రూ. 4 లక్షల నుండి 5 లక్షల వరకు మాత్రమే పెరుగుతుంది. అంటే దీర్ఘకాలంలో బ్యాంక్ డిపాజిట్ల కంటే బంగారంపై రాబడి దాదాపు రెట్టింపు ఉండే అవకాశం ఉందని ఈ లెక్కలు చెబుతున్నాయి.
ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు..
కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు: భారత్, చైనా, రష్యా వంటి దేశాలు భారీగా బంగారాన్ని నిల్వ చేస్తున్నాయి.
డాలర్ బలహీనత: అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ తగ్గితే బంగారం ధర పెరుగుతుంది.
టెక్నాలజీ డిమాండ్: గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో బంగారం వినియోగం పెరుగుతోంది.
గతాన్ని బట్టి చూస్తే బంగారంలో పెట్టుబడి లాభదాయకమే అయినప్పటికీ మార్కెట్ రిస్క్‌లు ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి పెట్టుబడి పెట్టేముందు నిపుణుల సలహా తీసుకోవడం, మొత్తం డబ్బును ఒకే చోట కాకుండా విభిన్న మార్గాల్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
