Generic Medicine: జనరిక్ మందులనే రాయండి.. వైద్యులకు కేంద్రం హెచ్చరిక
ప్రస్తుతం ఆస్పత్రికి వెళితే మెడిసిన్ బిల్లు తడిసి మోపెడవుతుంటుంది. చిన్నపాటి అనారోగ్య సమస్య ఉన్నా.. మందుల కోసం వందల్లో ఖర్చు అవుతుంటుంది. బ్రాండెడ్ మందుల ధరలు విపరీతంగా ఉండటంతో సామాన్యులకు సైతం ఇబ్బందిగా మారిన పరిస్థితి ఉంటుంది. ఈ..
ప్రస్తుతం ఆస్పత్రికి వెళితే మెడిసిన్ బిల్లు తడిసి మోపెడవుతుంటుంది. చిన్నపాటి అనారోగ్య సమస్య ఉన్నా.. మందుల కోసం వందల్లో ఖర్చు అవుతుంటుంది. బ్రాండెడ్ మందుల ధరలు విపరీతంగా ఉండటంతో సామాన్యులకు సైతం ఇబ్బందిగా మారిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరల్లో మందులు అందే విధంగా కేంద్ర ప్రభుత్వం జనరిక్ మందులను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే వైద్యులు జనరిక్ మందులను రాయకుండా బ్రాండెడ్ మందులను రాస్తున్నారు. దీంతో రోగులకు ఖర్చులు మరింతగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆస్పత్రులు, సీజీహెచ్‌ఎస్ వెల్‌నెస్ కేంద్రాల్లోని వైద్యులు తమ వద్దకు వచ్చే పేషెంట్లకు చౌకగా లభించే జనరిక్ మందులనే రాయాలని కేంద్రం సూచించింది. ఇలా జనరిక్ మందులను రాయకుండా బయట బ్రాండెడ్ మందులను రాసినట్లయితే చర్యలు కఠినంగా ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. అంతేకాకుండా ఆస్పత్రులకు మెడికల్ రిప్రజెంటేటివ్‌ల రాకపోకలను తగ్గించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు హెల్త్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ ఈ నెల 12న అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు.
బ్రాండెడ్ మందులపై పెద్ద ఎత్తున కమీషన్లు:
కాగా, బ్రాండెడ్ మందులు రోగులకు రాస్తే ఆయా ఫార్మా కంపెనీలు వైద్యులకు పెద్ద ఎత్తున కమీషన్లు ముట్టజెబుతున్నాయని ఆరోపణలున్నాయి. ఈ కారణంగా వారు తక్కువ ధరకు లభించే మందులను ప్రోత్సహించడం లేదని కూడా ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. భారతీ వైద్య విధాన మండలి సైతం జనరిక్ మందులను మాత్రమే రాయాలని పదేపదే హెచ్చరిస్తున్నా.. రాయడం లేదు. అయితే ఈ జనరిక్ మందులను రాస్తే రోగులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. బ్రాండెడ్ మందులతో పోలిస్తే ఈ జనరిక్ మందులు దాదాపు 70 నుంచి 80 శాతం వరకు ఖర్చు తగ్గుతుంది.
బ్రాండెడ్-జనరిక్‌ల మధ్య తేడా ఏమిటి?
అయితే బ్రాండెడ్, జనరిక్ మందుల్లో ఉండేది ఒకే రకరమైన ఔషధమే. ఈ రెండింటి మెడిసిన్‌లో ఎలాంటి తేడా ఉండదు. బ్రాండెడ్ మందులకు ఉత్పత్తి ఖర్చుతో పాటు డీలర్, హోల్‌సేల్, రిటైల్‌ల లాభాలు, వైద్యుల కమీషన్లు అందులోనే ఉంటాయి. అందుకే వీటి ధర అధికంగా ఉంటుంది. అదే జనరిక్‌లో అలాంటివేమి ఉండవు. అందుకే తక్కువ ధరల్లో లభిస్తాయి.
జనరిక్ మందులు నాణ్యమైనవేనా?
జనరిక్ అయినా బ్రాండెడ్ అయినా తయారీ నాణ్యత, పనితీరు ఒకే విధంగా ఉంటాయి. తయారీలోనూ, మార్కెటింగ్‌లోనూ అదనపు ఖర్చు ఉండదు కాబట్టే తక్కువ ధరల్లో లభించేందుకు సాధ్యపడుతుంది. కాలపరిమితి ముగియటంతో మొదటి ఉత్పత్తిదారుడు పేటంట్ రైట్ కోల్పోవటంతో ఇతరులు వీటిని తయారుచేస్తారు. దీర్ఘకాలిక రోగాలకు ‘జనరిక్’ ఔషధాలు చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ ఖరీదైన మందులకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ధరే అయినా, ప్రజలు జనరిక్ మందుల వైపు వెళ్లడం లేదు. అందుకే వీటి వాడకాన్ని పెంచేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. బయట మార్కెట్ రూ. 20కు దొరికే టాబ్లెట్ జనరిక్ మెడిసిన్ కేవలం రూ.8 లభిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి