Andhra: వేసవిలో రావాల్సిన ముంజలు, మామిడిపళ్లు..డిసెంబరులోనే.. మన ఏపీలోనే
మాములుగా కొన్ని రకాల పండ్లు కొన్ని సీజన్స్‌లోనే లభిస్తాయి. దీంతో ఎప్పుడెప్పుడు ఆయా సీజన్స్ వస్తాయా అని ఎదురుచూస్తారు సీజనల్ ఫ్రూట్ లవర్స్. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. అదిరిపోయే మామిడిపండ్లు, కమ్మగా ఉండే తాటి ముంజలు డిసెంబర్‌లోనే అందుబాటులోకి వచ్చాయి.. ఎక్కడో తెలుసుకుందాం పదండి...
ఇది మల్లెల వేళయనీ.. ఇది వెన్నెల మాసమనీ..తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ.. అన్నాడో సినీకవి. అయితే ఇప్పుడు కోయిల కూయలేదు కానీ.. వేసవిలో రావాల్సిన మామిడి పండ్లు, తాటిముంజలు శీతాకాలంలో కాస్తున్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం తాటి ముంజలు ఎంతో ఇష్టంగా తింటారు ప్రజలు. ఇక ఫలరాజమైన మామిడిపండుకు అందరూ ఫ్యాన్సే. అయితే ఈ పండ్లు తినేందుకు వేసవిదాకా ఎదురుచూడాల్సిన పనిలేకుండా ముందే వచ్చేసాయి. అవును పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా ఉలవపాడులో ఈ పండ్లు ముందే కాపుకాసి పక్వానికి వచ్చి రారమ్మంటున్నాయి.
మండు వేసవిలో రావాల్సిన మామిడి పండ్లు డిసెంబరులోనే అందుబాటులోకి వచ్చాయి. ఏప్రిల్‌లో వచ్చి ఎండ తీవ్రతను దూరం చేసే తాటిముంజలు విక్రయానికి అప్పుడే రహదారి పక్కన కనిపిస్తున్నాయి. ఇవి ‘పైరుకాపు’ ఉత్పత్తులని, వందల చెట్లలో కొన్ని ఇలా ముందే కాస్తాయని రైతులు చెబుతున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు ప్రాంతంలో తోటల్లోని రెండు వేల చెట్లలో పైరుకాపు మామిడి పండ్లు నాలుగు టన్నుల దిగుబడి వచ్చింది. వాటిని ఇలా విజయవాడ కృష్ణలంక సమీపంలో రహదారిపై విక్రయిస్తున్నారు. కిలో రూ.250 నుంచి రూ.300కు అమ్ముతున్నారు. బందరు రోడ్డులోని గంగూరు సమీపంలో పైరుకాపులో వచ్చిన తాటిముంజలను డజను రూ.100 నుంచి రూ.120కి అమ్ముతున్నారు. ముందే వచ్చిన ఈ పళ్లను ముందుగా టేస్ట్ చేసేందుకు ప్రజలు కూడా ముందుకొస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..