Gautam Adani: ప్రతి ఒప్పందంపైనా విమర్శలే.. ఎందుకని అదానీ మాత్రమే టార్గెట్‌..? సంచలన కథనం

'SAY NO TO ADANI PROJECT'. ఇలాంటి స్లోగన్లు ఇండియాలో బోలెడు సార్లు చూశాం, బోలెడు వార్తలు విన్నాం. కాని, కొన్ని నెలలుగా విరామం అన్నదే లేకుండా ఈ స్లోగన్‌ వినిపించింది ఎక్కడో తెలుసా. ఎక్కడో ఆఫ్రికా ఖండంలో ఉన్న కెన్యాలో. Say no to adani project అంటూనే మరో స్లోగన్‌ కూడా ఇచ్చారు కెన్యన్‌ యూత్. Please protect our jobs అని. అదానీ వస్తే తమ ఉద్యోగాలు పోతాయని భయపడ్డారు వాళ్లు. ఆందోళనలు చేశారు.

Gautam Adani: ప్రతి ఒప్పందంపైనా విమర్శలే.. ఎందుకని అదానీ మాత్రమే టార్గెట్‌..? సంచలన కథనం
Adani
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 22, 2024 | 9:13 PM

‘SAY NO TO ADANI PROJECT’. ఇలాంటి స్లోగన్లు ఇండియాలో బోలెడు సార్లు చూశాం, బోలెడు వార్తలు విన్నాం. కాని, కొన్ని నెలలుగా విరామం అన్నదే లేకుండా ఈ స్లోగన్‌ వినిపించింది ఎక్కడో తెలుసా. ఎక్కడో ఆఫ్రికా ఖండంలో ఉన్న కెన్యాలో. Say no to adani project అంటూనే మరో స్లోగన్‌ కూడా ఇచ్చారు కెన్యన్‌ యూత్. Please protect our jobs అని. అదానీ వస్తే తమ ఉద్యోగాలు పోతాయని భయపడ్డారు వాళ్లు. ఆందోళనలు చేశారు. ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తేవాలో అంతా తెచ్చారు. అయినా.. అదానీ జపం ఆగపోవడంతో కోర్టుకెళ్లారు. ఏకంగా ఫ్లైట్లు క్యాన్సిల్‌ అయ్యేంతగా పోరాడారు. ఇక శ్రీలంకలో. ‘STOP ADANI’ అంటూ జనం రోడ్డెక్కారు. సోషల్‌ మీడియాలో ఓ మెసేజ్‌ పాస్‌ చేసి, సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు ధర్నా చేద్దాం రండి అని ప్రకటించుకుని, సరిగ్గా అదే సమయానికి అంతా కలిసి రోడ్ల మీదకు వచ్చారు. అంటే.. అదానీపై ఎంత ఆగ్రహం ఉంటే జనం ఆ స్థాయిలో కదిలివస్తారు. ఇక మయన్మార్‌లో. అదానీ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేసినందుకు జనాన్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చింది అక్కడి సైనిక ప్రభుత్వం. ఇక్కడితో ఆగలేదు స్టోరీ. ఆస్ట్రేలియాలో కూడా నిరసనలే. ‘మైనింగ్‌ చేయడానికి అదానీకి పర్మిషన్‌ ఇచ్చి పర్యావరణాన్ని నాశనం చేస్తారా’ అంటూ పోరాటాలు చేశారు అక్కడ. ‘Go back Adani’ అంటూ ఆందోళనలు చేశారు. ఇక హిండెన్‌బర్గ్. అదానీ గ్రూప్‌ షేర్ల ధరలు పెరగడం వెనక అతిపెద్ద స్టాక్‌ మానిప్యులేషన్ జరిగిందంటూ పెద్ద రిపోర్ట్‌నే బయటపెట్టింది. చాలామంది హిండెన్‌బర్గ్‌ గురించే మాట్లాడుకున్నారు గానీ.. ‘ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్’ అనే ఇంటర్నేషనల్ ఏజెన్సీ అదానీపై ఇచ్చిన రిపోర్ట్‌పై పెద్దగా డిస్కస్ చేయలేదు. ఆ రిపోర్ట్‌లో అదానీ కుటుంబ సభ్యులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇలా ఒకటా రెండా.. అదానీ అంటేనే వివాదాలు అనేంతగా ముద్ర పడిపోయింది. ఒక టాటా, ఒక బిర్లా, ఒక అంబానీ.. వీళ్లంతా దేశవిదేశాల్లో వ్యాపారం చేశారు. చాలా దేశాల్లో ప్రాజెక్టులు చేపట్టారు, కంపెనీలను కొన్నారు. కాని, వాళ్లెవరికీ అంటని మరకలు ఒక్క అదానీకే ఎందుకు అంటాయి? అంబానీ, టాటా-బిర్లాల వ్యాపారాలపై ఎక్కడా వ్యతిరేకత రాలేదు. మరి.. అదానీ అడుగుపెట్టడంతోనే ఎందుకని ఆందోళనలు, వివాదాలు మొదలయ్యాయి? డిటైల్డ్‌ రిపోర్ట్‌..

అదానీ ఎక్కడ వ్యాపారం చేసినా.. కామన్‌గా వినిపించిన ఆరోపణ ఏంటో తెలుసా. ‘లంచాలు ఇచ్చి వ్యాపారం చేస్తారు అని’. అమెరికా కోర్టు ఆరోపణ చేసింది కాబట్టి ఈ విషయం ఇంత హైలెట్‌ అయింది గానీ.. శ్రీలంకలో, కెన్యాలో, ఆస్ట్రేలియాలో, మయన్మార్‌లో.. ఇలా ప్రతీ చోట అవే ఆరోపణలు వినిపిస్తూ వచ్చేవి. సింపుల్‌గా చెప్పాలంటే.. ఏదైనా ఒక ప్రాజెక్ట్‌ చేపట్టడానికి ముందుగా టెండర్లు పిలుస్తారు. దేశవిదేశాల కంపెనీలు ఆ బిడ్డింగ్‌లో పోటీపడతాయి. కానీ అదేంటో.. ‘అదానీ వస్తున్నారంటే పోటీలో మరో కంపెనీయే ఉండదు.. ఆ కంపెనీ ఎంతకు కోట్‌ చేస్తే అంతకే పనులు అప్పగిస్తారు’ అనే అపవాదు బలంగా ఉంది. కేవలం అదానీకే ఎందుకు కాంట్రాక్టులు దక్కుతాయని అడిగితే.. ‘కంపెనీ వాళ్లు లంచాలు ఇస్తారు, ఆ దేశంలోని అధికారులు లంచాలు పుచ్చుకుంటారు’ అని చెప్పుకుంటూ ఉంటారు. దీనికి బిగ్గెస్ట్‌ ఎగ్జాంపుల్‌గా కెన్యా ఎయిర్‌పోర్ట్ అగ్రిమెంట్‌ను చెబుతున్నారు బిజినెస్‌ అనలిస్టులు. కెన్యాలోని ‘జోమో కెన్యట్టా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌’ అత్యంత కీలకమైనది. ఆ ఎయిర్‌పోర్ట్‌ కెపాసిటీకి మించి ప్రయాణికులు వస్తూపోతూ ఉంటారు. లిటరల్‌గా ఓ బస్టాండ్‌ను తలపిస్తుంది. అలాంటి ఎయిర్‌పోర్ట్‌ను ఇంకాస్త ఆధునీకరించి, విస్తరించాలనుకుంది కెన్యా ప్రభుత్వం. సరిగ్గా అదే సమయంలో అదానీ గ్రూప్‌ ఎంటర్‌ అయింది. ఒప్పందంలో భాగంగా రెండో రన్‌వేను కూడా నిర్మిస్తామని ఒప్పుకుంది అదానీ కంపెనీ. మొత్తంగా 15వేల 631 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు అదానీ కంపెనీ రెడీ అయింది. కాకపోతే.. ఓ కండీషన్. 30 ఏళ్ల పాటు ఆ ఎయిర్‌పోర్ట్‌ మెయింటనెన్స్‌ను అదానీ ఎయిర్‌పోర్ట్‌ కంపెనీకి ఇచ్చేయాలి అనేది అందులోని నిబంధన. ఈ అగ్రిమెంట్‌పైనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఒకవేళ అదానీకి గనక 30 ఏళ్ల పాటు ఎయిర్‌పోర్టును లీజ్‌కు ఇస్తే.. తమ ఉద్యోగాలు ఊడతాయని ఆందోళన వ్యక్తం చేశారు అక్కడి ప్రజలు. అలాంటిదేం జరగదు అని అధికారపార్టీ చెబుతున్నా.. వినిపించుకోలేదు. ఒట్టి చేతులతో వచ్చిన అదానీకి ఏకంగా ఎయిర్‌పోర్టును ఎలా కట్టబెడతారంటూ ఎదురు తిరిగారు అక్కడి ప్రజలు. అసలు పబ్లిక్‌ టెండర్లను ఆహ్వానించకుండా.. అదానీ అడిగింది కదా అని ఆ కంపెనీకే ఎయిర్‌పోర్టును 30 ఏళ్ల పాటు ఎలా లీజుకు ఇస్తారంటూ ప్రశ్నించారు కెన్యా ప్రజలు. పైగా.. ఆ ఎయిర్‌పోర్టును అదానీకి అప్పగించేందుకు కెన్యా గవర్నమెంట్‌ చేసుకున్న ఒప్పందాన్ని చాలా రహస్యంగా ఉంచారనే విమర్శలు వినిపించాయి. చివరికి అక్కడి కోర్టు ప్రశ్నించే వరకు ఈ వివాదం నడిచింది.

ఒక్క ఎయిర్‌పోర్టే కాదు.. కెన్యాలో పవర్‌ లైన్ల నిర్మాణానికి కూడా అదానీ కంపెనీ అగ్రిమెంట్లు చేసుకుంది. ఈ అగ్రిమెంట్‌ విలువ ఏకంగా 6వేల 218 కోట్ల రూపాయలు. కాని, ఈ ఒప్పందం వెనక భారీ ఎత్తున లంచాలు ముట్టాయంటూ కెన్యా ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. కాని, కెన్యా అధ్యక్షుడు రూటో మాత్రం.. లంచాలు గానీ, ఎలాంటి అవినీతి గానీ జరగలేదని చాలా గట్టిగా చెప్పారు. ఒకవేళ అవినీతి జరిగి ఉంటే వెంటనే యాక్షన్‌ తీసుకుంటామన్నారు. అక్కడి ప్రజలు, ప్రతిపక్షాలు అదానీతో ఒప్పందాలు వద్దని వారిస్తున్నా వినని కెన్యా రూటో ప్రభుత్వం.. ఒకే ఒక్క ఇన్సిడెంట్‌తో ఆ అగ్రిమెంట్‌ను రద్దు చేసుకుంది. ఏ ఇన్సిడెంటో తెలుసుగా. ఇండియాలో పవర్ పర్చేజ్‌ అగ్రిమెంట్లు కుదుర్చుకోడానికి అదానీ కంపెనీ లంచాలు ఇచ్చిందంటూ అమెరికా డిస్ట్రిక్ట్‌ కోర్ట్ ఆరోపణలు చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ వార్త రాగానే కెన్యా గవర్నమెంట్‌ వెనక్కి తగ్గింది. ఎయిర్‌పోర్ట్, ఎనర్జీ డీల్స్‌ రద్దు చేస్తున్నామని ప్రకటించింది. అదానీ కంపెనీలతో డీల్స్‌ రద్దు చేస్తూ కెన్యా ప్రెసిడెంట్‌ రూటో ఓ మాట అన్నారు. ‘తప్పు చేసినట్టు ఆధారాలు ఉన్నప్పుడు తాను ఎలాంటి నిర్ణయం తీసుకోడానికైనా వెనకాడను’ అని. అంటే అర్ధం.. అమెరికా కోర్టు చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని కెన్యా ప్రెసిడెంట్‌ కూడా నమ్మినట్టే కదా.

అందరికీ గుర్తుండే ఉంటుంది.. 2022లో శ్రీలంక ఆల్‌మోస్ట్‌ తగలబడిపోయింది. శ్రీలంక ప్రభుత్వంపై ఆ స్థాయిలో వ్యతిరేకత రావడానికి, ఆనాటి అల్లర్లకు అదానీ గ్రూప్‌ ఒప్పందాలు కూడా ఓ కారణం అని చెబుతుంటారు ఆర్థిక విశ్లేషకులు. అందుకే, తమ ప్రభుత్వం వస్తే ‘వెంటనే అదానీ ఒప్పందాన్ని రద్దు చేస్తాం’ అని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. శ్రీలంక ఎన్నికల్లో అదానీ అంశం కూడా ఎన్నికల ప్రచార అంశం అయింది. అసలేం జరిగిందంటే.. శ్రీలంకలోని మన్నార్‌లో 500 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తి ప్లాంట్ నిర్మించే ప్రాజెక్టును అదానీ గ్రూప్ కంపెనీకి అప్పగించారు. కేవలం ప్రాజెక్ట్‌ నిర్మించడమే కాదు.. 25 ఏళ్ల పాటు దాని నిర్వహణ బాధ్యత కూడా అదానీ కంపెనీకే ఇచ్చేలా ఒప్పందాలు జరిగాయి. విండ్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఒక్కో యూనిట్‌కు 6.50 అమెరికన్‌ సెంట్లకు అమ్మేలా అక్కడి ఎలక్ట్రిసిటీ బోర్డుతో అగ్రిమెంట్‌ జరిగింది. ఏమైందో గానీ కొంతకాలానికి ఆ కరెంట్‌ను యూనిట్‌కు 7.55 సెంట్లకు అమ్ముతామని చెప్పింది అదానీ కంపెనీ. కాని, అక్కడి ప్రతిపక్షాలు గానీ, ఆర్థికవేత్తలు గానీ చెప్పిందేంటంటే.. డైరెక్టుగా అదానీకే ప్రాజెక్ట్‌ అప్పగించకుండా.. టెండర్లు ఆహ్వానిస్తే లాభం ఉంటుంది కదా అని గళమెత్తారు. గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానిస్తే యూనిట్‌ 4 సెంట్లకే వస్తుందని శ్రీలంక ఎలక్ట్రిసిటీ ఇంజనీర్లు కూడా చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ వల్ల అదానీ గ్రూప్‌కు 25 ఏళ్లలో దాదాపు 35వేల కోట్ల రూపాయలు ఇచ్చినట్టు అవుతుందని వాదించారు. కాని అప్పటి ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాలు, ఆర్ధికవేత్తలు, ఇంజనీర్ల అభిప్రాయాలు వినలేదు. శ్రీలంక ప్రజలపై ఆర్థిక భారం వేయడానికే రెడీ అయింది. అదే సమయంలో శ్రీలంక ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. అయినా సరే.. అదానీతో ఒప్పందంపై అప్పటి ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో.. ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోడానికి అది కూడా ఓ కారణమైంది.

ఆస్ట్రేలియాలో కూడా అదానీ ప్రాజెక్ట్‌పై ఇలాంటి వ్యతిరేకతే వచ్చింది. 2017లో క్వీన్స్‌ల్యాండ్‌లోని కార్మిఖేల్‌ కోల్‌ మైన్‌ ప్రాజెక్టును 11 బిలియన్‌ డాలర్లతో ప్రతిపాదించింది అదానీ గ్రూప్. కాని, అక్కడి పర్యావరణవేత్తలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించారు. కారణం.. అత్యంత సున్నితమైన గ్రేట్‌ బారియర్ రీఫ్‌కు ఆ ప్రాజెక్ట్‌ వల్ల నష్టం జరుగుతుందని ఆందోళనలు చేశారు. ఇక 2011లో మయన్మార్‌లోని యాంగాన్‌ పోర్టులో కంటైనర్ టర్మినల్‌ నిర్మించే ప్రాజెక్ట్‌ చేపట్టింది అదానీ కంపెనీ. కాని, ఆ ప్రాజెక్ట్‌ను స్థానికులు వ్యతిరేకించారు. తమ భూములు తీసుకోవడంపైనే వారి అభ్యంతరం. కాని, అక్కడున్నది సైనిక ప్రభుత్వం కావడంతో వందల మందిని చంపి, ఆ ఆందోళనను అణచివేశారు. ఇక బంగ్లాదేశ్‌లోనూ అదానీ ఒప్పందంపై పెద్ద రగడ జరుగుతోందిప్పుడు. బంగ్లాదేశ్‌లో అదానీ పవర్‌ కంపెనీ పవర్‌ జనరేట్‌ చేస్తోంది. సరఫరా చేసిన విద్యుత్‌కు గాను బంగ్లా ప్రభుత్వం ఏకంగా 7200 కోట్లు చెప్పించాల్సి ఉంది. కాని, ఇప్పటి వరకు ఆ బిల్లులను కొత్త ప్రభుత్వం చెల్లించలేదు. బిల్లులు కట్టకపోగా.. అదానీతో చేసుకున్న ఒప్పందాన్ని రివ్యూ చేస్తామంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. దేశ ప్రయోజనాలను తాకట్టుపెడుతూ గత ప్రభుత్వం అదానీతో ఒప్పందం చేసుకుందని, దానిపై దర్యాప్తు చేస్తామని చెప్పింది.

ఇలా అదానీ గ్రూప్‌పై వివాదాలు చెబుతూ వెళ్తే.. ఆ లిస్ట్‌ వస్తూనే ఉంటుంది. కాకపోతే, ఇక్కడ క్వశ్చన్‌ ఏంటంటే.. why adani. కేవలం అదానీ గ్రూప్‌ ఒప్పందాలపైనే ఇలాంటి వ్యతిరేకత వస్తోందా? లేదంటే కావాలనే ఓ ప్రచారం జరుగుతోందా? వాస్తవాలేంటి? పూర్తి డిటైల్స్‌ షార్ట్‌ బ్రేక్‌ తరువాత.

రతన్‌ టాటా చనిపోయినప్పుడు.. ఈ దేశంలోని వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఈవెన్ పెద్దస్థాయిలో ఉన్న అధికారులు కూడా ఓ కామన్‌ పాయింట్‌ చెప్పారు. టాటా వ్యాపార సామ్రాజ్యం మొత్తం అత్యంత నిజాయితీతో జరిగింది అని. ప్రాజెక్ట్‌ ఆలస్యమైనా ఫర్వాలేదు, కొన్నిసార్లు ఆ ప్రాజెక్ట్‌ రాకపోయినా ఫర్వాలేదు.. అంతే తప్ప అవినీతి చేయడం, లంచాలు ఇవ్వడం అనే ప్రాక్టీసే చేసేది కాదని మెచ్చుకున్నారు. అందులో హండ్రెడ్‌ పర్సెంట్‌ నిజం ఉంది. టాటా గ్రూప్‌ కంపెనీ విదేశాల్లో వ్యాపారాలు చేసింది, ఎన్నో దేశాల్లో తన ప్రాడక్ట్స్‌ను అమ్మింది, విదేశాల్లో కంపెనీలను కూడా కొనింది. కాని, ఎక్కడా, ఎప్పుడూ ఒక్క మాట కూడా పడలేదు. కారణం.. అవినీతికి ఆస్కారం ఇవ్వకపోవడమే. అత్యంత పారదర్శకంగా, అత్యంత నిజాయితీతో వ్యాపారం చేయడమే. ఇక అంబానీ గ్రూప్‌ విషయంలోనూ వివాదాలు లేవు. కారణం.. ఆ గ్రూప్ బిజినెస్‌ స్ట్రాటజీనే. ఆ కంపెనీ పబ్లిక్‌ డొమైన్‌లో ఉంది. ఆ కంపెనీ షేర్లు స్టాక్‌ ఎక్స్చేంజీలలో లిస్ట్‌ అయి ఉన్నాయి. అలాంటప్పుడు ఏ చిన్న తప్పు జరిగినా, ఎక్కడ తప్పుడు నిర్ణయం తీసుకున్నా.. ఆ మరక అలా ఉండిపోతుంది. ఆ మరక నిజం కాదు అని తెలిసినా.. ఎప్పటికీ చెరిగిపోని ముద్ర అయితే పడుతుంది. ముఖ్యంగా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కోల్పోతామన్న భయం వారిది. అందుకే, అంబానీ గ్రూప్‌ వ్యాపారాల విస్తరణలో గానీ, ఆ గ్రూప్ చేపట్టే ప్రాజెక్టుల విషయంలో గానీ ఏనాడూ వివాదాలు జరగలేదు. వీళ్లనే కాదు.. బిర్లా, ఇన్ఫోసిస్, మహీంద్రా, విప్రో.. ఇలాంటి బడా సంస్థలపై దాదాపుగా ఆరోపణలు లేవు. అంత జాగ్రత్తగా బిజినెస్‌ చేస్తారనే పేరుంది. అలాంటి వ్యాపార దిగ్గజాల్లో గౌతమ్‌ అదానీ కూడా ఒకరు. వాళ్లలానే వ్యాపారాలు చేస్తూ వస్తున్నారు. కాని, ఒక్క అదానీపైనే దేశవిదేశాల్లో ఇన్ని ఆరోపణలెందుకు? దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఎందుకని అదానీని టార్గెట్ చూస్తూ విమర్శలు చేస్తుంటాయి?

విమర్శించడానికేముంది. ఓ మాట అనాలి అనుకుంటే కారణాలు కూడా అక్కర్లేదు. అనేస్తారంతే. అదాని గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌పై జరుగుతున్నది కూడా ఇదేనా? నిజానికి, అదానీ ఎంచుకున్న లక్ష్యం చాలా గొప్పది. ముంబైలోని ధారావి అనే స్లమ్‌ ఏరియా చాలా ఫేమస్. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అది. ఇండియాలో రెండు ప్రాంతాలను కచ్చితంగా చూడాలనుకుంటున్నానని బాక్సింగ్‌ కింగ్‌ మైక్‌ టైసన్‌ ఆమధ్య ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అందులో ఒకటి తాజ్‌మహల్‌ అయితే.. రెండోది మురికివాడ అయిన ధారావినే. కంప్లీట్‌ కాంట్రాస్ట్‌ ఉన్న టేస్ట్‌ అది. ఇదే సందర్భంలో అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. మైక్‌ టైసన్‌ ధారావికి వస్తే.. ‘ఇది అసలు ధారావియేనా.. ఆసియాలోని అతిపెద్ద మురికివాడేనా ఇది’ అని ఆశ్చర్యపోయేలా దాని రూపురేఖలు మారుస్తామన్నారు. దాదాపు 300 ఎకరాల్లో ఉన్న ధారావిని అభివృద్ధి చేసేందుకు ఓ పెద్ద ప్రాజెక్ట్‌ కూడా చూపించారు. డీఎల్‌ఎఫ్‌ కంపెనీతో పోటీ పడి మరీ 5వేల కోట్ల రూపాయలకు కాంట్రాక్ట్‌ దక్కించుకున్నారు కూడా. కాని, ఆ ప్రాజెక్టును కూడా ఒకవిధంగా వివాదం చేశారు.

ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. ఏ కంపెనీ అయినా అనతికాలంలోనే ఎదిగిపోతూ ఉంటే కొన్ని కంపెనీలు ఆ వేగాన్ని చూసి తట్టుకోలేకపోతుంటాయి. ఎత్తుకు పైఎత్తు వేయాలనే అనుకుంటాయి. సహజంగా కార్పొరేట్‌ వరల్డ్‌లో కనిపించేదే ఇది. అలాంటి పోటీ ఉండడమూ మంచిదే. మనదేశంలో టాటా, బిర్లా, అంబానీల గురించి వింటూ పెరిగిన జనరేషన్‌కి.. సడెన్‌గా అదానీ పేరు వినిపించడం మొదలైంది. చాలా తక్కువ సమయంలోనే చాలా ఎత్తుకు ఎదిగారు. కచ్చితంగా కార్పొరేట్‌ వరల్డ్‌ పాలిటిక్స్‌ ఉంటాయి. అదానీ గురించి ఇప్పటి వరకు మనం వింటున్నదంతా ఒక వర్షనే. అవినీతి, వివాదాలు, వ్యతిరేకత మాత్రమే చూస్తున్నాం. కాని, మరో వర్షన్ కూడా ఉంది. ఇన్ని ఆరోపణలు కేవలం అదానీ మీదనే ఎందుకు వస్తున్నాయి అని. అంటే.. కావాలనే ఒక ప్రొపగాండా క్రియేట్ చేస్తున్నారా అనేది కొందరు ఎకనమిస్టుల ఒపీనియన్.

ఇక్కడ అదానీకి ఉన్న ‘పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌’ అనే మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో.. ఆ ‘పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ను’ టార్గెట్ చేయాలనే వర్షన్‌ను చాలామంది గమనించరు అంటుంటారు బిజినెస్ అనలిస్టులు. వాళ్లు చెప్పేదేంటంటే.. కొన్నిటికి ఆధారాలు ఉండకపోవచ్చు గానీ.. కార్పొరేట్‌ వరల్డ్‌లోని ఓ సెక్షన్‌కు అపోజిషన్‌ కూడా తోడైతే అదానీ లాంటి కంపెనీపై ఇలాంటి ఆరోపణలే వస్తాయని చెబుతున్నారు. కాసేపు ఆ వర్షన్‌లో కూడా ఆలోచిద్దాం. సాధారణంగా.. ఒక కంపెనీపై ఆరోపణలు వస్తే ఇక ఆ కంపెనీ ఎదుగుదల గురించి మరిచిపోవాల్సిందే. సదరు కంపెనీకి కాంట్రాక్టులనేవే రావు. ఎంత పొలిటికల్‌ ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్నా.. ‘వద్దులే గురూ’ అని సైడ్‌ చేసేస్తారు. ఎవరూ వ్యతిరేకతను కొని తెచ్చుకోవాలనుకోరు కదా..! కాని, అదానీ గ్రూప్‌ ప్రాజెక్టులపై కొన్ని చోట్ల వివాదాలు వస్తున్నా సరే.. ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు వస్తున్నాయి. అగ్రిమెంట్లు కుదిరిపోతున్నాయి. ఇలా జరగడం మ్యాజిక్‌ అయితే కాదు. ఏడాది క్రితం హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ బయటికొచ్చింది. అదానీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలను ఈడ్చిపారేసే తుఫాన్‌లాంటి వార్త అది. అయినా సరే.. తట్టుకుని నిలబడగలిగింది. ఆ తరువాత కూడా ప్రాజెక్టులు, అగ్రిమెంట్లు చేసుకోగలిగింది. కారణం ఏంటి? ఆ కంపెనీ పాలసీ, ప్రాక్టీసే.

చాలామంది అనుకునేది ఏంటంటే.. 2014 తరువాతే అదానీ గ్రూప్‌ ఎదుగుదల మొదలైంది అని. కాని, అది రాంగ్. సంపద సృష్టించడం, సంపదను పెంచుకోవడం ఈ పదేళ్లలో జరిగింది కాదు. 2011లో అదానీ గ్రూప్ ఛైర్మన్ దేశంలోనే అత్యధిక సంపద సృష్టికర్తగా రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. అదానీ కంపెనీ లాభాలు దాదాపుగా రెట్టింపు అయి ఏకంగా.. 33వేల 211 కోట్లకు చేరింది. అదొక రికార్డ్ అప్పట్లో. 2007లోనే ఫోర్బ్స్-40 పేరుతో ఓ లిస్ట్‌ తయారు చేశారు. అందులో సంపన్న భారతీయుల జాబితాలో గౌతమ్ అదానీకి 13వ స్థానం. ఇందాక చెప్పుకున్నట్టు 2011 నాటికి అతని సంపద రెట్టింపు అవడమే కాదు.. ర్యాంక్ కూడా పెరిగి 7వ స్థానానికి చేరుకున్నారు. అంతెందకు.. రాజీవ్‌గాంధీ నిర్ణయాలతోనే వ్యాపారంలో తొలి అడుగు వేశానన్న స్టేట్‌మెంట్‌ స్వయంగా అదానీ నుంచే కదా వచ్చింది. ఇంపోర్ట్స్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ పాలసీని ఎప్పుడైతే సరళీకరించారో.. అప్పుడే తాను వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి అవకాశం లభించిందని గౌతమ్‌ అదానీ చెప్పడం నిజమే కదా. పీవీ నరసింహారావు ప్రధాని అయ్యాక.. అప్పుడు తీసుకున్న ఆర్థిక సంస్కరణలతో తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలైందని కూడా చెప్పుకున్నారు. సో, ఇక్కడ.. ఫలానా పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్ వల్లే అదానీ ఎదిగారని చెప్పడం ఎంత తప్పో.. ఆ బ్యాంక్‌గ్రౌండ్‌ లేని నాడు పడిపోతారని ఊహించుకోవడమూ అంతే తప్పు.

జాగ్రత్తగా గమనిస్తే.. 2017లో ఆస్ట్రేలియాలోని కార్మిఖేల్‌ కోల్‌మైన్‌ ప్రాజెక్ట్‌ వచ్చినప్పుడు అక్కడ విమర్శలు వినిపించాయి. అలాగని అదానీ వ్యాపార విస్తరణ ఆగిపోలేదు. 2021లో మయన్మార్ పోర్టు ప్రాజెక్ట్‌ దక్కించుకుంది. అక్కడా విమర్శలు వచ్చినప్పటికీ.. దాన్ని పూర్తి చేసి, ఆ ప్రాజెక్టును అమ్మేసింది కూడా. ఇంటాబయట ఆరోపణలు, వ్యతిరేకత వినిపిస్తున్నా.. 2022లో శ్రీలంక ప్రాజెక్ట్‌ అదానీ గ్రూప్‌ చేతికి వచ్చింది. 2023లో జనవరిలో హిండెన్‌బర్డ్‌ రీసెర్చ్‌ కొన్ని ఆరోపణలు చేసినా.. ఆనాడు లక్షల కోట్ల రూపాయల మార్కెట్‌ క్యాపిటలైజేషన్ పడిపోయినా.. ఇన్వెస్టర్లు మాత్రం అదానీనే నమ్మారు. ఏడాది తిరక్కుండానే హండ్రెడ్‌ పర్సెంట్‌ ప్రాఫిట్స్‌ వచ్చింది. ఇండియన్ స్టాక్‌మార్కెట్లో ఇదో రికార్డ్. అదానీ పెట్టుబడిదారీ విధానాన్ని చాలామంది వ్యతిరేకిస్తుంటారు. అయినా సరే.. కేరళలోని విళింజం పోర్ట్‌ ప్రాజెక్టు కూడా అదానీ చేతికే వచ్చింది. దీనికేం సమాధానం చెబుతారు విమర్శకులు. దాదాపు 20వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు కేరళలో. టెండర్లలో కేవలం అదానీ మాత్రమే పాల్గొనే చేస్తారనే అపవాదు ఉంది. మరి కేరళలో విళింజం పోర్ట్‌ ప్రాజెక్టుకు వచ్చిన ఏకైక బిడ్‌ అదానీదే. 2015లో కేరళ క్యాబినెట్‌ స్వయంగా అప్రూవ్ చేసింది కూడా. దీనికి సమాధానం ఏంటి?

సో, ఎన్ని విమర్శలు ఉన్నా, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌ ఉందని ఎవరు ఊహించుకున్నా.. అదానీ విస్తరణ మాత్రం ఆగడం లేదు. కాకపోతే.. అదానీది ‘గుజరాత్‌ బేస్‌’ కాబట్టి విమర్శలు తప్పవు అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. ఆ కారణంగానే ప్రతిపక్షాలు అదానీని టార్గెట్‌ చేస్తున్నాయన్న విమర్శలు కూడా లేకపోలేదు. అదానీపై చర్యలు తీసుకోవాలి, అవసరమైతే అరెస్ట్‌ చేయాలని ప్రతిపక్షాలు గట్టిగానే మాట్లాడుతున్నాయి. కాని, అదానీ ప్రాజెక్టులు టేకప్‌ చేసిన రాష్ట్రాలు మాత్రం కాస్త భిన్నంగా మాట్లాడుతుంటాయి. సీఎం రేవంత్‌ రెడ్డి అదానీ పెట్టుబడులను మరో కోణంలో ఆవిష్కరించారు. అదానీ సంపాదనను తమ రాష్ట్రంలో పెట్టుబడిగా మార్చుకున్నామని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇక్కడ సీఎం చంద్రబాబు కూడా ఆచితూచి మాట్లాడినట్టే లెక్క. అదానీ గ్రూప్‌పై వస్తున్న విమర్శలపై ‘డిటైల్డ్‌ ఇన్ఫర్మేషన్‌’ రావాల్సి ఉందని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ప్లే బైట్ః అటు వైసీపీ కూడా దీనిపై రియాక్ట్‌ అయింది. తాము ఒప్పందం చేసుకున్నది సెకితో తప్ప అదానీ కంపెనీతో కాదని చాలా క్లియర్‌గా చెప్పింది. ఏపీ డిస్కంలకు, అదానీ గ్రూపునకు ప్రత్యక్షంగా ఒప్పందం జరగలేదని గుర్తు చేసింది వైసీపీ.

సరే.. ఫైనల్‌గా చెప్పుకోవాల్సింది. ఆరోపణలు చేస్తూనే ఉంటారు, అలా ఆరోపణలు చేసిన వారే తమ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండని ఆహ్వానిస్తుంటారు, హిండెన్‌బర్గ్-అమెరికా కేసు లాంటి సందర్భాలు వచ్చినప్పుడు సీరియస్‌ యాక్షన్‌ తీసుకోవాలని డిమాండ్‌ చేస్తారు. దాని తరువాత మళ్లీ జరిగేది ఏంటి. ఆ సైకిల్‌ రిపీట్‌ అవుతుందంతే. తమ రాష్ట్రంలోనే పెట్టుబడులు పెట్టాలంటారు, కొందరు విమర్శిస్తుంటారు, యాక్షన్‌ తీసుకోవాలంటారు. జెయింట్‌ వీల్‌లా తిరిగి తిరిగి మళ్లీ పెట్టుబడుల దగ్గరకే వస్తారు. సో, గౌతమ్‌ అదానీ అనే ఈ ఎపిసోడ్ క్లైమాక్స్‌ ఎలా ఉండబోతోందో మీరే ఊహించుకోవచ్చు.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు