బ్లింకిట్‌కు FSSAI షాక్..! ఓ కస్టమర్ పెరుగు తిని అస్వస్థతకు గురి కావడంతో..
బ్లింకిట్ ద్వారా ఆర్డర్ చేసిన పెరుగు తిన్న తర్వాత అస్వస్థతకు గురైనట్లు వినియోగదారు చేసిన ఫిర్యాదుపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పందించింది. ఘటనను తీవ్రంగా పరిగణించిన నియంత్రణ సంస్థ, ఆహార భద్రతా ప్రమాణాల అమలుపై వివరణ కోరుతూ 24 గంటల్లో నివేదిక సమర్పించాలని బ్లింకిట్‌కు నోటీసు జారీ చేసింది.

క్విక్ కామర్స్ రంగంలో ప్రముఖ సంస్థగా ఎదిగిన బ్లింకిట్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. బ్లింకిట్ ద్వారా ఆర్డర్ చేసిన పెరుగు తిన్న తర్వాత తాను అస్వస్థతకు గురయ్యానని ఓ వినియోగదారు చేసిన ఫిర్యాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండెడ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సంస్థకు నోటీసు జారీ చేసి, 24 గంటల్లోగా వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
వివరాల ప్రకారం బ్లింకిట్ ప్లాట్‌ఫారమ్ ద్వారా కొనుగోలు చేసిన పెరుగు తిన్న అనంతరం ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు వినియోగదారు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వెంటనే విచారణ ప్రారంభించింది. ఫిర్యాదుకు సంబంధించి సంస్థ తీసుకున్న చర్యలు, ఉత్పత్తి నాణ్యత తనిఖీలు, అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకుంటున్న చర్యలపై పూర్తి వివరాలు అందించాలని బ్లింకిట్‌ను కోరింది. ఈ ఘటన ఒక్కటే కాకుండా, ఇటీవలి కాలంలో నాణ్యత లేని, గడువు తేదీ సమీపించిన లేదా ప్యాకేజింగ్ దెబ్బతిన్న ఆహార ఉత్పత్తుల సరఫరాపై బ్లింకిట్‌పై పలువురు వినియోగదారులు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. కొంతమంది నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయగా, మరికొందరు సోషల్ మీడియా వేదికల ద్వారా తమ అనుభవాలను వెల్లడించారు. దీంతో నియంత్రణ సంస్థ ఈ అంశాన్ని మరింత సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తన నోటీసులో ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలను పాటించడం ప్రతి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ బాధ్యత అని స్పష్టం చేసింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టంలోని సెక్షన్ 26, 27 ప్రకారం సురక్షితం కాని లేదా నాణ్యతలేని ఆహార ఉత్పత్తుల విక్రయం చట్టవిరుద్ధమని పేర్కొంది. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు మాత్రమే అందేలా చూడాల్సిన బాధ్యత సంస్థలపై ఉంటుందని తెలిపింది. విషయం తీవ్రత దృష్ట్యా, 24 గంటల్లోపు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR), కంప్లయన్స్ రిపోర్ట్‌ను సమర్పించాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశించింది. ఈ కేసు ఫలితం క్విక్ కామర్స్ రంగంలో ఆహార భద్రత ప్రమాణాల అమలుపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
