IPL 2027: సీఎస్కే వద్దంది.. ఢిల్లీ ముద్దంది.. ఏకంగా ఆ ముగ్గురికి కొనేందుకు మాస్టర్ ప్లాన్..!
Delhi Capitals IPL 2027 Trials: గత సీజన్ పొరపాట్లను దిద్దుకుంటూ ఢిల్లీ క్యాపిటల్స్ వేస్తున్న ఈ ముందస్తు అడుగులు రాబోయే సీజన్‌పై వారి పట్టుదలను చూపిస్తున్నాయి. బెంగళూరు ట్రయల్స్‌లో మెరిసిన ఈ యువ రత్నాలు ఐపీఎల్ 2027 వేలంలో ఎంతటి ధరకు అమ్ముడుపోతారో చూడాలి!

Delhi Capitals IPL 2027 Trials: ఐపీఎల్ 2027 వేలానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం అప్పుడే వ్యూహాలకు పదును పెడుతోంది. గత సీజన్ నిరాశను అధిగమించేందుకు బెంగళూరు వేదికగా కొత్త ప్రతిభను వెలికితీసే పనిలో పడింది. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ ట్రయల్స్ తిరస్కరించిన యంగ్ ఆల్‌రౌండర్‌తో పాటు ముంబైకి చెందిన ముగ్గురు ఆటగాళ్లను రంగంలోకి దించింది..!
అక్షర్ పటేల్ సారథ్యంలో గడిచిన ఐపీఎల్ 2026 సీజన్‌లో 14 మ్యాచుల్లో 7 విజయాలతో 6వ స్థానంతో సరిపెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, రాబోయే సీజన్ కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. దక్షిణాది, పశ్చిమ మండలాలకు చెందిన యువ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని బెంగళూరులో ప్రత్యేక సెలక్షన్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ముంబై టి20 లీగ్‌లో అద్భుతంగా రాణించిన ఆయుష్ వర్తక్, అయాజ్ ఖాన్, అండర్ 19 మాజీ స్టార్ దివ్యాంష్ సక్సేనాలను విచారణకు పిలిచింది. ఈ ఆటగాళ్ల ప్రదర్శనను నిశితంగా పరిశీలించి మినీ వేలంలో కొనుగోలు చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
సీఎస్కే రిజెక్ట్ చేసిన ఆల్‌రౌండర్‌కు పిలుపు..
ఈ ట్రయల్స్‌లో పాల్గొంటున్న వారిలో 21 ఏళ్ల ఆల్‌రౌండర్ ఆయుష్ వర్తక్ పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది. గతేడాది ఐపీఎల్ సమయంలో సీఎస్‌కే ఆటగాళ్లు గాయపడటంతో చెన్నై జట్టు ఇతడిని ట్రయల్స్‌కు పిలిచినా కాంట్రాక్ట్ దక్కలేదు. ముంబై టి20 లీగ్‌లో నార్త్ ముంబై పాంథర్స్ తరఫున ఆడిన ఇతని ప్రదర్శన చూసి ఢిల్లీ యాజమాన్యం ఆకర్షితమైంది. అలాగే మిడిల్ ఆర్డర్ హిట్టర్ అయాజ్ ఖాన్, అండర్ 19 ప్రపంచకప్ ఆడిన దివ్యాంష్ సక్సేనా కూడా ఈ క్యాంప్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిద్దరూ ఇటీవలే ముంబై లీగ్‌లో 174 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.
పంత్ రాకతో మారిన సమీకరణాలు.. మిడిల్ ఆర్డర్ దృష్టి
ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కుల్దీప్ యాదవ్‌ను ఇచ్చి తమ మాజీ కెప్టెన్ రిషభ్ పంత్‌ను ఢిల్లీ సొంతం చేసుకుంది. పంత్ రాకతో టాప్ ఆర్డర్ బలోపేతమైనప్పటికీ లోయర్ మిడిల్ ఆర్డర్‌లో మ్యాచ్ ఫినిషర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. కెఎల్ రాహుల్ మినహా అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో ఫినిషర్ బాధ్యతలను సమర్థవంతంగా పోషించగల యువ ఆటగాళ్ల కోసం ఢిల్లీ వేట ప్రారంభించింది. అదే సమయంలో కుల్దీప్ స్థానాన్ని భర్తీ చేసే వికెట్ టేకింగ్ స్పిన్నర్ కూడా జట్టుకు అత్యవసరంగా మారాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




