దూకుడులో ప్రకాష్ రాజ్ రోల్ ఆయన చేయాల్సింది.. అప్పుడే తండ్రి పాత్ర వద్దన్నాడు: శ్రీను వైట్ల
దూకుడు చిత్రం విజయం, మహేష్ బాబుతో తన అనుభవాలను దర్శకుడు శ్రీను వైట్ల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సినిమా మేకింగ్ దశలోనే విజయం ఖాయమని నమ్మిన ఆయన, మహేష్ బాబు స్వేచ్ఛ, సహకారం వల్లే అద్భుతమైన డైలాగులు, సన్నివేశాలు సాధ్యమయ్యాయన్నారు. ఇస్తాంబుల్‌లో షూటింగ్ సమయంలో ఎదురైన సవాళ్లను, వినోదాత్మక సంఘటనలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు, సమంత జంటగా ప్రకాష్ రాజ్, సోను సూద్, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ వంటి తారాగణంతో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ దూకుడు. ఎస్ థమన్ సంగీతం అందించిన దూకుడు ఇండస్ట్రీని షేక్ చేసింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రం ఆగస్టు 9, 2026న రీ-రిలీజ్ అవుతున్న సందర్భంగా దర్శకుడు శ్రీను వైట్ల ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. దూకుడు కథ కేబీఆర్ పార్క్‌లో పుట్టిందని, ఈ సినిమా ఒక ఇండస్ట్రీ హిట్ అవుతుందని మేకింగ్ దశలోనే తాను ఖచ్చితంగా నమ్మానని శ్రీను వైట్ల తెలిపారు. ఈ విషయాన్ని మహేష్ బాబుకు కూడా చాలా సార్లు చెప్పానని ఆయన అన్నారు. మహేష్ బాబు మాస్ స్టెప్పులు, డైలాగులు థియేటర్లలో పండగ వాతావరణాన్ని సృష్టించాయని ఆయన గుర్తుచేసుకున్నారు. అప్పట్లో మిలియన్ డాలర్ మార్కును దాటడం అరుదు కాగా, దూకుడు 2.4 మిలియన్ డాలర్లు వసూలు చేసిందని నిర్మాత నవీన్ యెర్నేని చెప్పారని శ్రీను వైట్ల వెల్లడించారు. మహేష్ బాబును అన్ని షేడ్స్‌లో, సరైన పాత్రలో చూడటమే ఈ సినిమా అద్భుత విజయానికి ముఖ్య కారణమని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదివేసేయండి : అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఒక్క హిట్ కూడా లేదు.. ఇప్పుడు ఇలా
దూకుడు సినిమా నిర్మాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కోలేదని, ప్రతి రోజును ఎంజాయ్ చేస్తూ పనిచేశానని శ్రీను వైట్ల చెప్పారు. దీనికి ప్రధాన కారణం మహేష్ బాబు తనకు ఇచ్చిన స్వేచ్ఛ అని అన్నారు. ఆయన సహకారం వల్ల తాను, నిర్మాతలు అందరం ఆనందంగా పనిచేశామని, అదే సినిమాలోని ప్రతి సన్నివేశంలోనూ కనిపించిందని తెలిపారు. దర్శకుడిగా తాను డైలాగులకు, వాటి టైమింగ్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తానని శ్రీను వైట్ల అన్నారు. మహేష్ బాబుతో తన వేవ్ లెంత్ బాగా కుదరడంతో, ఆయన డైలాగులను అద్భుతంగా పలికించారని ప్రశంసించారు. ఇస్తాంబుల్ షెడ్యూల్ కోసం ముందుగానే డైలాగులు రాసి మహేష్ బాబుకు వినిపించినట్లు చెప్పారు. “మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతాను” వంటి సంభాషణలు మహేష్ బాబు చెప్పినప్పుడు తనకు మరింత శక్తిని ఇచ్చాయని, ఇంకా రాయడానికి స్ఫూర్తినిచ్చాయని వైట్ల వివరించారు. “ఏయ్ మళ్ళీ వేశాడు” అనే ఐకానిక్ డైలాగ్ తన స్నేహితుడి మ్యానరిజం నుంచి వచ్చిందని, మహేష్ బాబు తనకంటే బాగా చెప్పారని గుర్తు చేసుకున్నారు.
ఇది కూడా చదివేసేయండి : సూపర్ స్టార్ కృష్ణ కాలర్ పట్టుకున్న హీరో.. కటౌట్లు తగలబెట్టి , థియేటర్లపై దాడి చేసిన అభిమానులు
మహేష్ బాబును డైరెక్టర్స్ డిలైట్ అని అభివర్ణించిన వైట్ల, ఆయన ఎంతో మద్దతుగా ఉంటారని పేర్కొన్నారు. వ్యక్తిగా ఆయన చాలా హాస్యం, వినయం గలవారని, కొత్త డైరెక్టర్లని కూడా “సార్” అని పిలుస్తారని తెలిపారు. మహేష్ బాబుతో పనిచేసినప్పుడు ఒత్తిడి ఉండదని, ఆయన చాలా మంచి మనిషి అని కొనియాడారు. దూకుడు స్క్రిప్టును మహేష్ బాబును దృష్టిలో పెట్టుకునే రాశానని శ్రీను వైట్ల స్పష్టం చేశారు. అయితే ప్రకాష్ రాజ్ పాత్ర కోసం మొదట నటుడు శ్రీహరిని అనుకున్నా.. విషయం శ్రీహరికి చెప్తే ఆయన ఇప్పుడే నేను తండ్రి పాత్రలు చేయాలా.? అని ఆలోచించారని శ్రీహరి ఆ డైలమాలో ఉన్నప్పుడే.. మహేష్ కు ఇదే విషయం చెప్తే శ్రీహరి అప్పుడే తండ్రి పాత్రలు వద్దు అనుకుంటున్నారుగా.. ఆయనను ఇబ్బందిపెట్టకండి. ఆ పాత్ర మనం ప్రకాష్ రాజ్ కు ఇద్దాం.. అన్నాడు. మహేష్ బాబు సూచన మేరకు ప్రకాష్ రాజ్‌ను ఎంపిక చేశామని తెలిపారు. అలాగే ప్రకాష్ రాజ్ కూడా అద్భుతంగా చేశారని అన్నారు శ్రీను వైట్ల .. ఇక సినిమా మొత్తం 140 రోజులు చిత్రీకరించగా, టాకీ పార్ట్ కేవలం 42 రోజుల్లోనే పూర్తయిందని వెల్లడించారు.
ఇది కూడా చదివేసేయండి : ఆ విలన్ చెప్పే డైలాగ్స్, యాక్షన్ అంటే బాలయ్యకు అంత ఇష్టమా.. సెట్లో దగ్గరుండి మరీ చూసేవారట
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




