Malavika Hegde:వేల కోట్ల అప్పులెదురైనా కుంగిపోలేదు, పారిపోలేదు.. దటీజ్‌ మాళవికా హెగ్డే..

మాజీ సీఎం కూతురు, ప్రముఖ వ్యాపారవేత్త భార్య.. వింటుంటేనే ఎంతో అదృష్టవంతురాలు అనిపిస్తుంది కదా!  కానీ కడదాకా కలిసి కష్ట సుఖాలు పంచుకోవాల్సిన  భర్త 

Malavika Hegde:వేల కోట్ల అప్పులెదురైనా కుంగిపోలేదు, పారిపోలేదు.. దటీజ్‌ మాళవికా హెగ్డే..
Malavika Hegde
Follow us
Basha Shek

|

Updated on: Jan 11, 2022 | 6:56 PM

మాజీ సీఎం కూతురు, ప్రముఖ వ్యాపారవేత్త భార్య.. వింటుంటేనే ఎంతో అదృష్టవంతురాలు అనిపిస్తుంది కదా!  కానీ కడదాకా కలిసి కష్ట సుఖాలు పంచుకోవాల్సిన  భర్త  అనూ హ్యంగా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆమె జీవితం అంతా తల్లకిందులైంది. జీవితంలో స్థిరపడని పిల్లలు. దారి తెన్నూ లేని వ్యాపారాలు, వెనక వేల కోట్ల అప్పు! భయంతో ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ! ఇదే కేఫ్‌ కాఫీ డే సీఈఓ మాళవిక హెగ్దే కథ. ర్ అనుకోని కష్టాలు ఎదురైనా.. తను నిలబడి, సంస్థనూ ముందుకు నడుపుతున్న స్పూర్తివంతమైన మహిళ కథ

కేఫ్ కాఫీడే అలా పుట్టింది

మాళవిక పుట్టి పెరిగిందంతా బెంగళూరే. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌. నాన్న ఎస్‌ఎం కృష్ణ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. అమ్మ ప్రేరణ కృష్ణ సామాజిక వేత్త. 1991లో కాఫీ వ్యాపారవేత్త వీజీ సిద్ధార్థతో వివాహమైంది. వీళ్లిద్దరూ కలిసి కేఫ్‌ కాఫీ డేకు శ్రీకారం చుట్టారు. నిజానికి ఈ ఆలోచన సిద్ధార్థదే. మొదట దీన్ని మాళవికతో పంచుకున్నప్పుడు ఆమె ఒప్పుకోలేదట. రూ.5కి ఎక్కడైనా దొరికే కాఫీని రూ.25 పెట్టి తాగడానికి తమ పార్లర్‌కే ఎందుకు వస్తారన్నది ఆమె ఉద్దేశం. అందుకే ససేమిరా అందట. దీంతో సిద్ధార్థ మళ్లీ ఆలోచనలో పడ్డారు. ఈసారి ఆయన ‘కాఫీకి ఉచిత ఇంటర్నెట్‌నూ అందిస్తే?’ అన్నారట. ఈ ఆలోచన ఈసారి ఈమెకీ నచ్చింది. ఇద్దరూ కలిసి ప్లాన్‌ చేశారు. అలా 1996లో మొదటి కేఫ్‌ కాఫీ డే (సీసీడీ) అవుట్‌లెట్‌ బెంగళూరులో ప్రారంభమైంది.

భర్త బలవన్మరణంతో తలకిందులు..

అలా మొదలైన సీసీడీ దేశవ్యాప్తంగా విస్తరించి భారతీయ ఆతిథ్య రంగంలో ప్రముఖ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. తెర మీద సిద్ధార్థే కనిపించినా.. తెరవెనుక మాళవిక ప్రోత్సాహమూ ఎక్కువే. సీసీడీ రోజువారీ కార్యకలాపాలన్నీ ఈవిడే చూసుకునేవారు. అంతా సవ్యంగానే సాగుతోంది. ఇంతలో.. 2019 జులై.. సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్కసారిగా షాక్‌! కాఫీ కింగ్‌గా పేరుగాంచిన ఆయన మరణానికి కారణం.. అప్పు. అదీ కూడా రూ. ఏడువేల కోట్లు. సంస్థ దివాలా తీసేసింది అనుకున్నారంతా. దాదాపు 24 వేలమంది కార్మికులు తమ భవిష్యత్‌ ఏంటనే ఆందోళనలో పడ్డారు. ఒకానొక దశలో ఉద్యోగులు జీతాల కోసం ధర్నాలూ చేశారు. ఆ సమయంలో బాధనంతా పక్కనపెట్టి మళ్లీ తెరమీదకొచ్చారు మాళవిక. తన పిల్లలతోపాటు ఉద్యోగుల బాధ్యతనూ స్వీకరించారు. ‘సిద్ధార్థతో నా అనుబంధం 32 ఏళ్లు. సంస్థే ఆయన లోకం. ఉద్యోగులే కుటుంబ సభ్యులు. ఆయన నిర్మించిన సామ్రాజ్యాన్ని ముందుకు నడిపే బాధ్యతను తీసుకుంటాను’ అంటూ అందర్నీ సమాధానపరిచారు. 2020 డిసెంబరులో సంస్థ సీఈఓ పగ్గాలు తీసుకున్న మాళవిక కు ఇక్కడా ఎన్నో ఎదురుదెబ్బలు. కొవిడ్‌, చెల్లని చెక్కుల వివాదాలు. అన్నింటినీ ఒక్కొక్కటిగా దాటుతూ వచ్చారు.

వేలకోట్ల అప్పులకు వారసురాలిగా..

పెట్టుబడిని తగ్గించుకోవడానికి ఎన్నో వెండింగ్‌ మెషిన్‌లను వెనక్కి రప్పించారు. సంస్థ నిరర్థక ఆస్తులనీ అమ్మేశారు. ఏడాది కాలంలో సగం అంటే.. రూ.మూడువేల కోట్లకుపైగా అప్పుల్ని తీర్చేశారు. కాగా ఇంకొన్నేళ్లలోనే తిరిగి సంస్థకు పూర్వ వైభవం వస్తుందన్న ఆశ ఆమెలోనేకాదు.. సంస్థ ఉద్యోగుల్లోనూ కనిపిస్తోంది. టాటా వంటి సంస్థలూ పెట్టుబడికి ఆమెతో చర్చలు జరుపుతున్నాయి. గతంలో మాళవిక సంస్థకు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యురాలు. రూపాయి జీతం తీసుకోలేదు. సంస్థలో ఆమెకున్న వాటా కూడా నాలుగు శాతమే. అయినా సీసీడీని ముందుకు నడపడం తన బాధ్యతగా భావించారు. కాఫీ ఎస్టేట్‌లో భర్తతో కలిసి మొక్కలు నాటేవారు. ఏ అవుట్‌లెటైనా ఇద్దరూ ప్రారంభించేవారు. సాధారణ ప్రేమికుల్లా కూర్చొని వినియోగదారులను గమనించేవారు. ఇలా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. పైగా భర్తకు సంస్థపై ఎనలేని ప్రేమ.. ఇవన్నీ ఆమెను మధ్యలో వదిలేయనివ్వలేదు.

భర్త  కలల సామ్రాజ్యం కూలిపోకుండా..

‘ఏడాదిలో ఎన్నో సవాళ్లు. నా భర్త వారసత్వాన్ని కొనసాగించాలన్న తపనే ముందుకు నడుపుతోంది. తను వదిలిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. అప్పులు చెల్లించడంతోపాటు వ్యాపారాన్నీ అభివృద్ధి పథంలో సాగించాలి. తద్వారా ఉద్యోగులకూ భద్రత కలిగించాలి. ఇదే నా ధ్యేయం’ అని ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పటికే సగం అప్పులు తీర్చేసింది. సంస్థను నమ్మిన మదుపరులకు కూడా ఆమె భరోసా ఇచ్చింది. ఉద్యోగులకు విశ్వాసాన్ని నింపి ఉన్నత శిఖారాల వైపు అడుగులు వేసేలా చేసింది మాళవిక హెగ్దే. సంస్థ భవిష్యత్ ప్రణాళికలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయని.. త్వరలోనే అన్నింటిని అధిగమించి.. అనుకున్నది సాధిస్తామని ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.

భర్తపై ప్రేమ, ఆయన కలల సామ్రాజ్యం కూలిపోకూడదనే తాపత్రయంతో దాన్ని నిలబెట్టడానికి ఆమె చూపిస్తోన్న ధైర్యం, తెగువలకు ప్రశంసలు దక్కుతున్నాయి. చిన్న చిన్న వాటికే బెంబేలెత్తిపోయే ఎంతోమందికి ఆమె జీవితం స్ఫూర్తిమంతమే కదూ! బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వాళ్లను, వారి మూలంగా వీధిన పడ్డ ఉద్యోగులు, మదుపరుల కష్టాలు చూస్తుంటే.. వేలాదిమంది ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడి, అప్పులిచ్చిన సంస్థలు కూడా నష్టపోకుండా, అప్పుల బాధ్యతను నెత్తిన వేసుకుని, పట్టుదలతో కాఫీడే సంస్థకు పూర్వ వైభవం తెచ్చే దిశగా అడుగులు వేస్తున్న మాళవిక హెగ్దే కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.

Also read:

Chris Morris: ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడి షాకింగ్‌ నిర్ణయం.. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు..

Saina Nehwal: హీరో సిద్ధార్థకు కౌంటరిచ్చిన సైనా తండ్రి.. అతను దేశం కోసం ఏం చేశాడంటూ..

Coronavirus: కరోనా బారిన పడిన టీమిండియా ఆల్‌రౌండర్‌.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరం..