Financial Year 2025-26: గడువు విషయంలోనే గొడవంతా.. కొత్త ఆర్థిక సంవత్సరంలో ముఖ్యమైన గడువు తేదీలివే..!
భారతదేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరం రెండు రోజు క్రితం ప్రారంభమైంది. ఆర్థిక సంవత్సరం అంటే సామాన్యులకు పెద్దగా పట్టింపు ఉండదు కానీ వ్యాపారస్తులతో ఆదాయపు పన్ను చెల్లించే ఉద్యోగస్తులకు చాలా కీలకం. పన్ను చెల్లింపులతో పాటు వివిధ పెట్టుబడులకు ఆర్థిక సంవత్సరాన్నే ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ముఖ్యమైన గడువు తేదీల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ప్రస్తుత రద్దీ జీవితంలో ప్రతిదీ నిర్వహించడం కష్టం. కానీ ఆర్థిక సంబంధిత విషయాల నిర్వహణ కూడా చాలా ముఖ్యం. లేకుంటే భారీ నష్టాలు సంభవించవచ్చు. అందువల్ల పెట్టుబడి ప్రణాళిక, పన్ను గడువులను తీర్చడం, బీమా ప్రీమియంలు చెల్లించడం, పత్రాలను నిర్వహించడం, బడ్జెట్‌ను నిర్వహించడం ముఖ్యమైనవిగా ఉన్నాయి. ఏదైనా ముఖ్యమైన తేదీ తప్పిపోతే జరిమానా బాదుడు తప్పకపోవచ్చు. ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా ఉండాలంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ముఖ్యమైన గడువు తేదీల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఏప్రిల్ 30
అక్షయ తృతీయ ఏప్రిల్ 30న వచ్చింది. ఈ రోజున బంగారం కొనడం శుభప్రదంగా పరిగణిస్తారు. కానీ బ్యాలెన్స్‌ను కొనసాగించడానికి మీ పోర్ట్‌ఫోలియోలో కనీసం 10 శాతంబంగారంలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.
మే 2025
మీకు అవసరమైన పత్రాలను సేకరించి సకాలంలో ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి సిద్ధం అవ్వాలి. అలాగే ఈ నెలాఖరులోగా ఫారం 16 పొందాలి. మీరు జీతం పొందే వ్యక్తి అయితే ఐటీఆర్ దాఖలు చేయడానికి మీ యజమాని నుండి ఫారం 16 తీసుకోవడం మర్చిపోవద్దు.
15 జూన్ 2025
మీ పన్ను బాధ్యత రూ. 10,000 కంటే ఎక్కువగా ఉంటే మీరు ముందస్తు పన్ను చెల్లించాలి. మూలధన లాభాలు లేదా డివిడెండ్ ఆదాయం నుంచి సంపాదించే పెట్టుబడిదారులకు ఇది చాలా ముఖ్యం. మీరు బోనస్ అందుకుంటే దానిని ఖర్చు చేయడానికి బదులుగా, రుణ ముందస్తు చెల్లింపు కోసం లేదా అత్యవసర నిధిని సృష్టించడానికి ఉపయోగించాలి.
జూలై 31
ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ. జీతం పొందే, చిన్న పెట్టుబడిదారులు ఈ తేదీలోపు ఐటీఆర్ దాఖలు చేయడం ముఖ్యం. లేకుంటే రూ. 5,000 వరకు ఆలస్య రుసుము వసూలు చేయబడవచ్చు.
ఆగస్టు 15
ఆర్థిక స్వేచ్ఛ కోసం చర్యలు తీసుకోవాలి. మీ ఆర్థిక స్థితిని సమీక్షించుకోవాలి. అత్యవసర నిధిని సృష్టించి పెట్టుబడులను పెంచాలి. అలాగే రుణాన్ని తగ్గించడానికి ఒక ప్రణాళికను రూపొందించాలి.
సెప్టెంబర్ 15
రెండో ముందస్తు పన్ను వాయిదాకు ఇది ఆఖరు తేదీ. ఈ తేదీ నాటికి మీ అంచనా వేసిన పన్ను బాధ్యతలో 45 శాతం చెల్లించాలి. మీ పెట్టుబడులను పరిశీలించి, అవసరమైతే వాటిని సమతుల్యం చేసుకోండి. అధిక ఖర్చును నివారించడానికి రాబోయే పండుగలకు బడ్జెట్‌ను సెట్ చేసుకోవాలి.
అక్టోబర్ 2 నుంచి 23 వరకు
ఖర్చుల కోసం బడ్జెట్ తయారు చేసుకోవాలి. పండుగలను ఆస్వాదించాలి. కానీ మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయాలి. పండుగ అమ్మకాల సమయంలో తెలివిగా షాపింగ్ చేయాలి. డిస్కౌంట్ల ప్రయోజనాన్ని పొందాలి. అలాగే అవసరానికి మించి ఖర్చు చేయాలి.
నవంబర్ 14
పిల్లలకు ఆర్థిక విషయాలను నేర్పాలి. భవిష్యత్తులో వారు ఆర్థికంగా బాధ్యతాయుతంగా మారడానికి డబ్బు, పొదుపు మరియు పెట్టుబడికి సంబంధించిన ప్రాముఖ్యత గురించి పిల్లలకు నేర్పండి.
డిసెంబర్ 15
మూడవ ముందస్తు పన్ను చెల్లింపు వాయిదాకు ఇది ఆఖరు తేదీగా ఉంది. మీ అంచనా వేసిన పన్ను బాధ్యతలో 75 శాతం చెల్లించాలి.
డిసెంబర్ 31
ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి అవకాశం. మీరు జూలై 31 లోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. లేకపోతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
జనవరి 1
మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి వాస్తవిక, సాధించగల లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. బీమా, పన్ను రుజువును సమర్పించాలి. బీమా పాలసీ పునరుద్ధరణ తేదీలను గమనించాలి. మీ పన్ను ఆదా పెట్టుబడుల రుజువును యజమానికి అందించాల్సి ఉంటుంది.
ఫిబ్రవరి 1
బడ్జెట్ పై నిఘా ఉంచాలి. కేంద్ర బడ్జెట్‌ను జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఇందులో పన్నులు, పెట్టుబడులకు సంబంధించిన మార్పులు ఉండవచ్చు.
మార్చి 15
నాలుగో ముందస్తు పన్ను వాయిదాకు ఆఖరు తేదీ. ఈ తేదీ లోపు ఆర్థిక సంవత్సరం చివరి ముందస్తు పన్ను చెల్లింపు చేయాలి.
మార్చి 31
పన్ను ఆదా పెట్టుబడులకు చివరి తేదీ. పెట్టుబడి పెట్టే ముందు కేవలం పన్ను ఆదా కోసం కాకుండా మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








