Electric Vehicles: 2025 కల్లా కొత్త బస్సుల్లో 10 శాతం విద్యుత్‌వే.. రేటింగ్స్‌ సంస్థ ఇక్రా వెల్లడి

Electric Vehicles: దేశంలో కొత్తగా కొనుగోలు చేసే బస్సుల్లో 8-10 శాతం విద్యుత్‌ బస్సులే ఉండే పరిస్థితి కనిపిస్తోంది. 2025 కల్లా సాకారమవుతుందని రేటింగ్స్‌ సంస్థ ఇక్రా వెల్లడించింది..

Electric Vehicles: 2025 కల్లా కొత్త బస్సుల్లో 10 శాతం విద్యుత్‌వే.. రేటింగ్స్‌ సంస్థ ఇక్రా వెల్లడి
Follow us

|

Updated on: Aug 20, 2021 | 12:16 PM

Electric Vehicles: దేశంలో కొత్తగా కొనుగోలు చేసే బస్సుల్లో 8-10 శాతం విద్యుత్‌ బస్సులే ఉండే పరిస్థితి కనిపిస్తోంది. 2025 కల్లా సాకారమవుతుందని రేటింగ్స్‌ సంస్థ ఇక్రా వెల్లడించింది. ఏడాదిన్నర కాలంగా కొవిడ్‌ వల్ల ప్రజా రవాణా వ్యవస్థలపై ఒత్తిడి ఉన్నా, ఇ-బస్‌ల కొనుగోళ్లు పెరుగుతున్నాయని తెలిపింది. విద్యుత్తు వాహనాల తయారీ, అమ్మకాల్లో వేగం పెంచేందుకు ఉద్దేశించిన ఫేమ్‌ 2 పథకం గడువును రెండేళ్లు పొడిగించి, 2024 ఏప్రిల్‌గా చేయడం ఈ రంగానికి సహకారం అందించేందుకు ఉపయోగ పడుతుందని తెలిపింది.

ఈ పథకం కింద 7మీటర్ల పొడవైన బస్సులకు రూ.35 లక్షలు, 9 మీటర్ల బస్సులకు రూ.45 లక్షలు, 12 మీటర్ల బస్సులకు రూ.55 లక్షల మూలధన రాయితీ లభిస్తుందని తెలిపింది. బస్సు వ్యయంలో 40 శాతం వరకు రాయితీ వర్తిస్తోందని, డీజిల్‌ వ్యయాలతో పోలిస్తే వీటిని 3-5 రెట్లు చౌకగా నడపొచ్చని వివరించింది. అందువల్ల బస్సు యాజమాన్యాలకు సీఎన్‌జీ బస్సులతో సమాన వ్యయాలే విద్యుత్తు బస్సులతో అవుతాయని తెలిపింది.

డీజిల్‌ బస్సుల కంటే 20-30 శాతం తగ్గుతాయని, ప్రారంభంలో రాయితీల వల్ల ఇ-బస్‌లకు మేలు కలిగినా, క్రమంగా దేశీయ తయారీ, విడిభాగాల లభ్యత వల్ల వ్యయాలు తగ్గుతాయని పేర్కొంది. ఫలితంగా వీటి అమ్మకాలు పెరుగుతాయని, ఇ-బస్సుల పనితీరు, సామర్థ్యంపైనే మధ్య, దీర్ఘకాలంలో ఈ విభాగ వృద్ధి ఆధారపడుతుందని వివరించింది. ఛార్జింగ్‌ సదుపాయాల కొరత, ఒకసారి ఛార్జింగుతో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలదనే అంశం, బస్సు ధరల వంటివి ఇ-బస్‌లకు సవాళ్లు విసిరే అంశాలని, అయినా కూడా 2024-25కు కొత్త బస్సుల్లో 8-10 శాతం ఇ-బస్‌లే ఉంటాయనే అంచనాను ఇక్రా రేటింగ్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకుమార్‌ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఇ-బస్‌ తయారీ సంస్థలతో ప్రత్యక్ష అనుసంధానం కలిగిన సంస్థలు, ఆర్థిక స్థోమత కలిగిన సంస్థలు మాత్రం ఇ-బస్‌లలో దూసుకెళ్తాయనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు.

కాగా, ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. పలు వాహనాల కంపెనీలు కూడా ఎకక్ట్రిక్‌ వాహనాల తయారీ వైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అమాంతంగా పెరుగుతుండటంతో చాలా మంది కూడా విద్యుత్‌ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఎలక్ట్రిక్‌ బస్సులు కూడా రోడ్లెక్కనున్నాయి.

ఇవీ కూడా చదవండి: SBI: ఎస్‌బీఐ తన వినియోగదారులకు హెచ్చరిక.. వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చేసుకోండి.. లేకపోతే ఇబ్బందే..!

Gold Fixed Deposit Scheme: మీ ఇంట్లో బంగారం ఉందా..? ఈ స్కీమ్‌లో పెడితే వడ్డీ పొందవచ్చు..!

Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రూ.1400 ప్రీమియంతో రూ.35 లక్షల వరకు పొందవచ్చు.. పూర్తి వివరాలు!