LPG Price Hike: జనం నెత్తిన మరోసారి గ్యాస్ ‘బండ’.. భారీగా పెరిగిన ధర.. నేటి నుంచే అమల్లోకి..
LPG Gas Cylinder Price in Hyderabad: సామాన్యులకు షాకింగ్ న్యూస్ ఇది. గృహ వినియోగ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. సిలిండర్ ధర రూ.50 పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి.
Domestic LPG Gas Cylinder: పేద, మధ్యతరగాతి వర్గాలకు బ్యాడ్ న్యూస్. దేశీయ చమురు సంస్థలు వినియోగదారులకు మరో షాకిచ్చాయి. సామాన్యుడిపై గ్యాస్ సిలిండర్ ధర పెరుగుదల రూపంలో మరో భారం పడింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధర మరోసారి పెరిగింది. బండ ధరను రూ.50 మేర పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో.. గ్యాస్ బండ రేటు 1100 దాటేసింది. ఈ నిర్ణయంతో ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న సామన్యులపై మరింత భారం పడనుంది. తాజా పెంపుతో ఢిల్లీ(Delhi) ప్రస్తుతం రూ.1003గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర రూ.1053కు చేరుకుంది. హైదరాబాద్(Hyderabad)లో గ్యాస్ బండ ధర రూ.1055 నుంచి రూ.1105కు చేరింది. మాములుగా అయితే ప్రతి నెల 1న వీటి ధరల్లో మార్పులు చేర్పులు చేస్తాయి చమురు సంస్థలు. ఈ నెల 1న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.183.50 మేర తగ్గించాయి. తాజాగా నెలలో 5 రోజులు గడిచిన తర్వాత డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచడం చర్చనీయాంశంగా మారింది. కాగా పెంచిన గ్యాస్ సిలిండర్ ధర నేటి(బుధవారం) నుంచే అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.