EPFO Pension: ప్రైవేట్ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్! మీ పెన్షన్ డబుల్ అవుతుందా?
ఈ దీపావళికి ప్రైవేట్ ఉద్యోగులకు ఒక పెద్ద శుభవార్త అందే అవకాశం ఉంది. ఉద్యోగుల భవిష్యత్తు కోసం పనిచేసే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO), వారి ఉద్యోగుల పెన్షన్ పథకాన్ని (EPS) పెంచనుంది. ప్రస్తుతం నెలకు రూ. 1,000 ఉన్న కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలనే ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్‌ను ఈపీఎఫ్‌వో సంతృప్తి పరచవచ్చని భావిస్తున్నారు. ఈ నిర్ణయం ఉద్యోగులకు, పెన్షనర్లకు మార్కెట్ ద్రవ్యోల్బణం దృష్ట్యా గొప్ప ఉపశమనాన్ని ఇవ్వనుంది.

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ద్వారా నిర్వహించబడే ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ కింద కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేసే ఈ సంస్థ, ఉద్యోగుల చిరకాల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంది. ఈ పెన్షన్ పెంపుపై తుది నిర్ణయం కోసం ఉద్యోగులు ఇంకా సంస్థ నుంచి అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.
పెన్షన్ పెంపుపై కీలక సమావేశం:
ఈ పెన్షన్ పెంపునకు సంబంధించిన అంశంపై చర్చించడానికి EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశం అక్టోబర్ 10, 11 తేదీలలో బెంగళూరులో జరిగింది. ఈ సమావేశం నుంచే పెన్షన్ పెంపునకు సంబంధించిన సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉంది అని ఉద్యోగులు ఆశిస్తున్నారు.
ప్రస్తుత కనీస పెన్షన్ మొత్తం చాలా తక్కువగా ఉంది. 2014లో నిర్ణయించిన కనీస పెన్షన్ మొత్తం నెలకు రూ. 1,000 మాత్రమే. ద్రవ్యోల్బణం, మారుతున్న మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఈ మొత్తం సరిపోవడం లేదని ఉద్యోగులు గట్టిగా చెబుతున్నారు. దీని కారణంగా, కార్మిక సంఘాలు పెన్షన్ ప్రయోజన సంఘాలు ఈ మొత్తాన్ని రూ. 7,500కు పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సూపర్వైజర్స్ (CBT) ఏకంగా 7.5 రెట్లు పెంచడానికి నిరాకరించినట్లు తెలుస్తుంది. దీనికి బదులుగా ఈ పెన్షన్ మొత్తాన్ని రూ. 1,000 నుండి రూ. 2,500కు పెంచడానికి మొగ్గు చూపినట్లు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ పెంపు ఉద్యోగులకు కొంతవరకు గణనీయమైన ఉపశమనాన్ని అందిస్తుంది.
పెన్షన్ లెక్కించే విధానం:
EPFO యొక్క EPS పథకంలో పెన్షన్ లెక్కించడానికి ప్రత్యేక ఫార్ములా ఉంది. పెన్షన్ లెక్కించే ఫార్ములా: (పెన్షనబుల్ జీతం × పెన్షనబుల్ సర్వీస్) ÷ 70. ఇందులో పెన్షనబుల్ జీతం అంటే చివరి 60 నెలల సగటు జీతం, పెన్షనబుల్ సర్వీస్ అంటే EPSకి ఎంత కాలం పాటు సేవలందించారో ఆ సంఖ్య. ఈ పథకం నుంచి ప్రయోజనం పొందాలంటే కనీసం 10 సంవత్సరాల సర్వీస్ అవసరం. పెన్షన్ పొందడానికి గరిష్ట జీతం పరిమితి నెలకు రూ. 15,000గా ఉంది. ఉద్యోగుల పెన్షన్ పెంపు త్వరలో అధికారికంగా ప్రకటించవలసి ఉంది.




