Budget 2025: మధ్యతరగతికి ఊరట కలిగించేలా బడ్జెట్.. ఆర్థిక నిపుణుల అంచనాలు ఇవే..!
ప్రస్తుతం మన దేశంలో కేంద్ర బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చలు జరుగుతున్నాయి. సంపన్నుల నుంచి సామాన్యుల వరకూ బడ్జెట్ అందించే రాయితీలు, మినహాయింపుల గురించే ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు ఎంతో ఆసక్తిగా బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈసారి ఆదాయపు పన్ను మినహాయింపును పెంచుతారనే వార్త జోరుగా ప్రచారమవుతోంది. ఇదే జరిగితే ఆదాయపు పన్ను చెల్లింపుదారులందరికీ ఉపశమనం లభిస్తుంది.
![Budget 2025: మధ్యతరగతికి ఊరట కలిగించేలా బడ్జెట్.. ఆర్థిక నిపుణుల అంచనాలు ఇవే..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/budget-2025-7.jpg?w=1280)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. దేశ ప్రగతి, ప్రజల సంక్షేమాన్ని లెక్కలోకి తీసుకుని బడ్జెట్ లో రాయితీలు, మినహాయింపులు ఇస్తారు. ప్రస్తుతం నిత్యావసరాలు, ఇతర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వాటికి అనుగుణంగా వేతనాలు లేవు. దీంతో జీతంలో ఎక్కువ భాగంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను చెల్లించే వేతన జీవులందరూ పన్ను మినహాయింపు కోసం ఎదురు చూస్తున్నారు. సాధారణంగా బడ్జెట్ ప్రక్రియలో ఖరారు చేసిన చివరి అంశాలలో ఆదాయపు పన్ను రేట్లు ఉంటాయి. చాలా మంది ఆర్థిక వేత్తలు, నిపుణులు ఆదాయపు పన్ను మినహాయింపు పెంపు పైనే ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేశారు. ముఖ్యంగా మధ్య తరగతిపై భారాన్ని తగ్గించడానికి పన్ను రేట్లను పునర్నిర్మించాలని వాదించారు. గతేడాది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీతం పొందే వ్యక్తుల కోసం స్టాండర్డ్ డిడక్షన్ ను రూ.75 వేలకు పెంచారు. అలాగే పన్ను శ్లాబ్ లను కూడా సవరించారు. ఈ మార్పుల వల్ల పన్ను చెల్లింపుదారులకు రూ.17,500 నికర లాభం వస్తుందని తెలిపారు.
కొత్త బడ్జెట్ లో స్టాండర్డ్ డిడక్షన్ ను మరింత పెంచడంపై ప్రభుత్వంలో చర్చలు జరిగాయి. దీన్నిపెంచితే పన్ను చెల్లింపుదారులందరికీ గణనీయమైన ఉపశమనం కలుగుతుంది. ప్రధానంగా మధ్యతరగతి ప్రజలకు ఆదాయాన్ని పొదుపు చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతం పాత, కొత్త విధానాల్లో ఆదాయపు పన్ను చెల్లింపులు జరుగుతున్నాయి. కొత్త పన్ను విధానంలో రూ.మూడు లక్షల వరకూ పన్ను ఉండదు. రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకూ ఐదు శాతం, రూ.7 లక్షల నుంచి రూ.పది లక్షల వరకూ పది శాతం, రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకూ 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ 20 శాతం, రూ.15 లక్షలకు పైబడి 30 శాతం చెల్లించాలి. ఒక పాత పన్ను విధానంలో రూ.2.50 లక్షల వరకూ పన్ను ఉండదు. రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ఐదు శాతం, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ 20 శాతం, రూ.10 లక్షలకు పైబడి 30 శాతం పన్ను విధిస్తారు.
కొత్త పన్ను విధానంలో రేట్లను మెరుగుపర్చడంతో పాటు ఆరోగ్య బీమా, పెన్షన్ కాంట్రిబ్యూషన్ వంటి ఖర్చులకు రాయితీలు పెంచే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఎస్ బీఐ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం రూ.50 వేల వరకూ ఆరోగ్య బీమా మినహాయింపులు, రూ.75 వేల నుంచి రూ.1 లక్ష వరకూ నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్ పీఎస్) విరాళాలు ఉన్నాయని సూచించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి