EPFO News: పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఐదు కీలక మార్పులు చేసిన ఈపీఎఫ్ఓ
ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక భరోసా కల్పించే పథకాలలో ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఒకటి. వివిధ ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు దీనిలో చందాదారులుగా ఉంటారు. ప్రతి నెలా వారి జీతంలో కొత్తం మొత్తం ఈపీఎఫ్ కు చెల్లిస్తారు. అదే మొత్తం వారి యాజమాన్యం కూడా కడుతుంది. ఈ పథకం ద్వారా ఉద్యోగి రిటైర్ అయ్యాక పెద్దమొత్తంలో నగదు అందుతుంది.

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ వో) పర్యవేక్షణలో ఈపీఎఫ్ ఖాతాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో 2025లో కొత్తగా ఐదు మార్పులను ఈపీఎఫ్ వో తీసుకువచ్చింది. చందాదారులకు ప్రయోజనం కల్పించే ఈ మార్పులను గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరినప్పడు ఈపీఎఫ్ ఖాతాను ప్రారంభిస్తారు. అతడు ఉద్యోగం చేస్తున్న కొద్దీ దానికి చెల్లించే మొత్తం పెరుగుతుంది. ఒక కంపెనీకి నుంచి మరో కంపెనీకి మారినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే కాలనుగుణంగా ఈపీఎఫ్ ఖాతాలకు సంబంధించి మార్పుల ప్రక్రియ గతంలో కొంచెం కష్టతరంగా ఉండేది. దీనివల్ల చాలామంది చందాదారులు వాటిని అలాగే వదిలేసేవారు. ఇప్పుడు వాటిని సులభతరం చేస్తూ ఈపీఎఫ్ వో కొత్తగా నిబంధనలు మార్చింది.
జాయింట్ డిక్లరేషన్ ప్రాసెస్
జాయింట్ డిక్లరేషన్ ప్రాసెస్ విషయంలో ఈపీఎఫ్ వో కొత్త సర్క్యూలర్ జారీ చేసింది. చందాదారుల సౌలభ్యం కోసం ఈ మార్పు చేసింది. దీని ద్వారా ఎస్ వోపీ వెర్షన్ 3.0 ప్రతిపాదనల్లో కొన్నింటిని మార్చడం సులభతరమవుతుంది. 2024 జూలై 31 నుంచి అమల్లోకి వచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పాత వెర్షన్ ను మార్పు చేసింది. కొత్త వెర్షన్ లో సభ్యుల కోసం నూతన వర్గీకరణలు, సవరించిన డాక్యుమెంట్ సమర్పణ పద్ధతులు, యజమానులు హక్కుదారుల కోసం నవీకరించిన విధానాల్లో కొన్ని మార్పులు వచ్చాయి.
సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ స్కీమ్ (సీపీపీఎస్)
ఈపీఎఫ్ వో 2025 జనవరి ఒకటి నుంచి సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ స్కీమ్ (సీపీపీఎస్) ను అందుబాటులోకి తీసుకువచ్చింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పెన్షన్ ఇవ్వనుంది. దీని ద్వారా దేశంలోని ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ తీసుకునే అవకాశం కల్పించింది. తద్వారా ఇకపై పెన్షన్ పేమెంట్ ఆర్డర్ల అవసరం ఉండదు.
అధిక పెన్షన్ పై స్పష్టత
ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కింద అధిక సంపాదన పొందుతున్న వ్యక్తుల పెన్షన్ కేసుల ప్రాసెసింగ్ విధానాలను వివరిస్తూ ఈపీఎఫ్ వో కొత్త సర్క్యూలర్ విడుదల చేసింది. అధిక వేతనాలపై పెన్షన్ (పీవోహెచ్ డబ్ల్యూ) కేసులకు సంబంధించిన కొన్ని సమస్యలపై క్షేత్ర కార్యాలయాలు ప్రశ్నలు లేవనెత్తాయి. వీటి పరిష్కారానికి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించారు.
ఈపీఎఫ్ మెంబర్ ప్రొఫైల్ అప్ డేట్
ఈపీఎఫ్ అకౌంట్ అప్ డేటేషన్ సులభతరమైంది. తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ ను ఇప్పటికే ఆధార్ ద్వారా వెరిఫై చేయించుకున్న వారు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు లేకుండానే పుట్టిన తేదీ, జెండర్, జాతీయత, తల్లిదండ్రుల పేరు, వివాహ స్థితి, జీవిత భాగస్వామి పేరు, జాయినింగ్ తేదీ, ఉద్యోగం వీడిన తేదీ మార్చుకోవచ్చు. అయితే 2017 అక్టోబర్ ఒకటికి ముందు యూఏఎన్ ఉన్న వారికి నిబంధనలు వేరుగా ఉంటాయి.
పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ ఫర్
ఉద్యోగులు సాధారణంగా జీతభత్యాలు, ఇతర ప్రయోజనాల కోసం కంపెనీలు మారుతూ ఉంటారు. అలాంటి సమయంలో పీఎఫ్ ఖాతాను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ట్రాన్స్ ఫర్ చేసుకునే ప్రక్రియను తాజాగా సులభతరం చేశారు. కంపెనీల యాజమాన్యాల ఆమోదం లేకుండానే ఆన్ లైన్ లో తమ ఖాతాను బదిలీ చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




