SIM Card Bocking: ఏఐ సాయంతో 80 లక్షల సిమ్ కార్డ్స్ బ్లాక్.. కీలక లక్ష్యం అదే..!
భారతదేశంలో ఫోన్ చేసి పౌరులను మభ్యపెట్టి చేసే మోసాల సంఖ్య పెరిగింది. మోసపోయిన వ్యక్తులు ఆ ఫోన్ నెంబర్ ద్వారా కేసు పెడుతున్నా నకిలీ వివరాలతో సిమ్ కార్డులను పొందడంతో వారిని పట్టుకోవడం కుదరడం లేదని పోలీసులు చెబుతూ ఉంటారు. అయితే ఇలాంటి సిమ్ కార్డులపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కొరడా ఝళిపించింది. ఏకంగా 80 లక్షల సిమ్ కార్డులను బ్లాక్ చేసింది.
సైబర్ క్రైమ్ సమస్యలను పరిష్కరించేందుకు నకిలీ పత్రాలను ఉపయోగించి జారీ చేసిన 80 లక్షల సిమ్ కార్డ్‌లను భారత ప్రభుత్వం డీయాక్టివేట్ చేసింది. ముఖ్యంగా పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాల నుంచి ప్రజలను రక్షించేందుకు ఈ చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ఏఐ ఆధారిత సిస్టమ్స్‌ను ఉపయోగించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీఓటీ) మోసపూరిత సిమ్ కార్డ్‌లను గుర్తించి బ్లాక్ చేసింది. అలాగే సైబర్ క్రైమ్‌లతో నేరుగా లింక్ అయి ఉన్న 6.78 లక్షల మొబైల్ నంబర్‌లు డీయాక్టివేట్ చేసింది. నకిలీ పత్రాలతో నమోదైన మొబైల్ నంబర్‌లను కనుగొనడానికి డీఓటీ ఏఐపై ఆధారపడింది. డీఓటీ చర్యలపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ సిమ్ కార్డుల విషయంలో డీఓటీ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కలిసి పనిచేశాయని, అందువల్లే ఈ స్థాయిలో సిమ్ కార్డులను బ్లాక్ చేయడం సాధ్యమైందని పేర్కొన్నారు.
అలాగే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సైబర్ క్రైమ్‌లను నిరోధించడానికి బలమైన విధానాలను ప్రవేశపెట్టింది మెసేజ్ ట్రేస్‌బిలిటీ రూల్‌ను డిసెంబర్ 11, 2024న అమలు చేసింది. ఈ నియమం టెలికాం ఆపరేటర్‌లను నకిలీ సందేశాల మూలంతో పాటు వాటి చైన్‌ను కనుగొనడానికి అనుమతిస్తుంది. అలాగే కాల్‌లు, సందేశాలను బ్లాక్ చేయడం కోసం కొత్త విధానాన్ని అక్టోబర్ 1, 2024 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. నెట్‌వర్క్ స్థాయిలో టెలిమార్కెటింగ్ కాల్‌లు, స్పామ్ సందేశాలను నిరోధించడానికి కఠినమైన మార్గదర్శకాలు అమలు చేస్తున్నారు. ఈ విధానాలు మోసాన్ని తగ్గించడంతో ఆన్‌లైన్ బెదిరింపుల నుండి వినియోగదారులను రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రభుత్వం తాజా చర్యలతో స్పామ్ కాల్‌లు, మోసపూరిత కార్యకలాపాలు, సైబర్ క్రైమ్‌లను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నందున భారతదేశం ఇలాంటి కీలక చర్యలను తీసుకుందని వివరిస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 ద్వారా పెద్ద సంఖ్యలో సైబర్ నేరాలను అరికడుతున్నారు. సైబర్ మోసానికి గురైన 10 లక్షల మందికి పైగా బాధితుల నుంచి రూ.3,500 కోట్లకు పైగా ఆదా చేసినట్లు ఇటీవల ఓ నివేదికలో పేర్కొన్నారు. ఈ హెల్ప్‌లైన్ స్కామ్‌ల బారిన పడిన వినియోగదారులకు సహాయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి