Fastag: ఫాస్టాగ్ నుంచి టోల్ ఛార్జీ కంటే ఎక్కువ కట్ అయిందా..? తిరిగి రీఫండ్ వచ్చేస్తుంది.. కానీ ఇలా చేస్తేనే..
మీ ఫాస్టాగ్ నుంచి టోల్ ఛార్జీ కంటే ఎక్కువ వసూలు చేశారా? అయితే మీకో శుభవార్త. మీరు పూర్తి రీఫండ్ పొందవచ్చు. ఇందుకోసం ఫిర్యాదు చేసేందుకు హెల్ప్ లైన్ నెంబర్లను కేంద్రం ప్రవేశపెట్టింది. వీటి ద్వారా ఫిర్యాదు చేస్తే మీకు రీఫండ్ అందిస్తారు.

దేశంలోని వాహనదారులకు టోల్ చార్జీల విషయంలో ఊరటనిచ్చే వార్త ఇది. టోల్ గేట్ల వద్ద డబుల్ స్కానింగ్, చిన్న వాహనానికి పెద్ద వాహనం తరహాలోనే టోల్ వసూలు చేయడం, సాఫ్ట్ వేర్ లోపం వల్ల అధిక టోల్ ఛార్జీ వసూలు లాంటివి చోటుచేసుకుంటున్నాయి. దీని వల్ల వాహనదారుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేయబడుతుంది. ఇలాంటివి తరచుగా ఎక్కోడ ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి వాహనదారుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. 2024లో 4.1 బిలియన్ల ఫాస్టాగ్ ట్రాన్సాక్షన్లు జరగ్గా.. అందులో 12.55 లక్షల లావాదేవీలు తప్పుగా టోల్ తీసివేయబడ్డాయని 2025 మార్చి 26న ప్రభుత్వం రాజ్యసభకు అధికారికంగా ఓ నివేదిక సమర్పించింది. వీటికిగాను 2025 జనవరి నుండి 2025 డిసెంబర్ మధ్య నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 17.66 లక్షల ఫాస్టాగ్ లావాదేవీలకు డబ్బు రీఫండ్ అందించింది.
తప్పుగా ఫాస్టాగ్ నుంచి వసూలు చేశారా..?
అధిక టోల్ ఛార్జీల గురించి ఫిర్యాదు చేసేందుకు చాలా మంది తరచుగా ఇష్టపడరు. దీనివల్ల టోల్ కంపెనీలకు బాగా లాభం చేకూరుతుంది. అయితే తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇకపై టోల్ కంపెనీ మీ ఫాస్టాగ్ నుండి ఒక్క రూపాయి అదనంగా తీసివేసినా.. 100 శాతం మొత్తం రీఫండ్ అందించాల్సి ఉంటుంది. భోపాల్-దేవాస్ నాలుగు లేన్ల హైవేలో మూడు యాక్సిల్ బస్సుల నుండి నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువ టోల్ వసూలు చేశారు. అతి తక్కువ సమయంలోనే రూ.11 కోట్లకు పైగా అదనపు సొమ్ము వసూలు చేశారు. మధ్యప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MPRDC) ఈ వసూలుకు వ్యతిరేకంగా.. ఒక నియమాన్ని అమలు చేసింది. ఫాస్టాగ్ వసూలు చేసే కంపెనీ మనస్తాపం చెంది హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆ కంపెనీ పిటిషన్‌ను కొట్టివేసి రీఫండ్ అందించాలని ఆదేశించింది.
తప్పుగా వసూలు చేస్తే ఎలా ఫిర్యాదు చేయాలి..?
మీ ఫాస్టాగ్ నుంచి తప్పుగా డబ్బులు వసూలు చేస్తే ముందుగా NHAI కేంద్ర హెల్ప్‌లైన్ 1033కు కాల్ చేయాలి. అలాగే బ్యాంక్ యాప్‌లో ‘వివాదం’ అని నమోదు చేయాలి. మీ ఫాస్టాగ్ అనుసంధానించబడిన బ్యాంక్ కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించాలి. తప్పుగా డబ్బు తీసివేసినట్లు ఫిర్యాదు చేయాలి. వినియోగదారులు ఫిర్యాదు చేస్తే రీఫండ్ అందుతుంది. అధికారులు పరిశీలించి రీఫండ్ అందిస్తారు. ఇది వాహనదారులకు పెద్ద ఊరటగా చెప్పవచ్చు.
