Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలు ఎందుకు కొనుగోలు చేయాలి? లాభాలేంటి? నష్టాలేంటి? పూర్తి వివరాలు..
మీరు ఒక విద్యుత్ శ్రేణి వాహనాన్ని కొనుగోలు చేయాలంటే ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి? అసలు ఎలక్ట్రిక్ వాహనాల వల్ల వినియోగదారులకు కలిగే లాభాలు ఏంటి? ఇబ్బందులు కూడా ఉన్నాయా? తెలుసుకుందాం రండి..

మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు తన ముద్ర వేయడం ప్రారంభించాయి. ప్రభుత్వాలు కూడా సహజ ఇంధన వాహనాల స్థానంలో విద్యుత్ శ్రేణి వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో వీటి కొనుగోళ్లు పెరుగుతున్నాయి. చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. కార్లు, బైక్ ల తయారీదారులు ఇప్పటికే తమ ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్ చేశాయి. ఈ నేపథ్యంలో మీరు ఒక విద్యుత్ శ్రేణి వాహనాన్ని కొనుగోలు చేయాలంటే ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి? అసలు ఎలక్ట్రిక్ వాహనాల వల్ల వినియోగదారులకు కలిగే లాభాలు ఏంటి? ఇబ్బందులు కూడా ఉన్నాయా? తెలుసుకుందాం రండి..
ఎలక్ట్రిక్ వాహనం వల్ల కలిగే ప్రయోజనాలు..
పర్యావరణ హితం.. విద్యుత్ శ్రేణి వాహనాలు పూర్తి పర్యావరణ హితమైనవి. కర్బన ఉద్ఘారాలు అస్సలు ఉండవు. వీటిని వినియోగించడం వల్ల వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. తద్వారా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడిన వారం అవుతాం.
రన్నింగ్ కాస్ట్ తక్కువ.. సంప్రదాయ ఇంధన వాహనాలు(ఐసీఈ)తో పోల్చితే ఎలక్ట్రిక్ వాహనాల్లో ఆపరేటింగ్ కాస్ట్ చాలా తక్కువ. ఈవీల చార్జింగ్ అనేది పెట్రోల్ డీజిల్ కన్నా చాలా తక్కువ ధరకే లభ్యమవుతుంది. అలాగే ఈవీలకు చాలా తక్కువ మెయింటెనెన్స్ అవసరం అవుతుంది.



ప్రభుత్వ ప్రోత్సాహం.. మన దేశంలో ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లపై పలు సబ్సిడీలను అందిస్తోంది. పలు రకాల ఇన్సెంటివ్స్ ఇస్తోంది. అలాగే జీఎస్టీ రేట్లు, ఇన్ కమ్ ట్యాక్స్ ప్రయోజనాలను అందిస్తోంది.
పెట్రోల్, డీజిల్ పై ఆధార పడకుండా.. మన దేశంలో ఆయిల్ ను వేరే దేశాల నుంచి ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుంది. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. దీంతో విద్యుత్ వాహనాలు బాగా మార్కెట్లోకి వస్తే ఇంధన దిగుమతి తగ్గి, ప్రభుత్వంపై భారం తక్కువవుతుంది.
టెక్నోలాజికల్ అడ్వాన్స్ మెంట్స్.. ప్రస్తుతం వస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు అత్యాధునిక సాంకేతికతతో వస్తున్నాయి. సంప్రదాయ ఇంధన వాహనాల్లోని లేని అనేక ఫీచర్లు వీటిల్లో ఉంటున్నాయి. రానున్న కాలంలో మరిన్ని అడ్వాన్స్ డ్ ఫీచర్లు వినియోగదారులకు అందే అవకాశం ఉంది.
ఈ ఇబ్బందులు కూడా ఉంటాయి..
అధిక ధరలు.. సంప్రదాయ కార్లు, బైక్ లతో పోల్చితే ఎలక్ట్రిక్ వాహనాల ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ప్రధానంగా వాటిలోని బ్యాటరీల కారణంగానే రేటు అధికమవుతుంది. అయితే దీర్ఘకాలంలో రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ కాబట్టి ఇది ప్రయోజనకరంగానే ఉంటుంది.
చార్జింగ్ స్టేషన్లు లేకపోవడం.. మన దేశంలో చార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రాక్చర్ ఇప్పుడిప్పుడే ఏర్పడుతోంది. ఇది పూర్తి స్థాయిలో పెట్రోల్, డీజిల్ లాగా అందుబాటులోకి రావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా రూరల్ పరిధిలో చార్జింగ్ స్టేషన్లు లేకపోవడం చాలా పెద్ద మైనస్ అని చెప్పాలి.
రేంజ్ తక్కువ.. ఒక ఎలక్ట్రిక్ వాహనం చార్జింగ్ పెట్టాలంటే చాలా సమయం పడుతుంది. అదే సంప్రదాయ ఇంధన వాహనం అయితే నిమిషాల్లోనే రీ ఫ్యూయలింగ్ పూర్తవుతుంది. అలాగే మైలేజీ కూడా ఓ ప్రధాన సమస్య. బ్యాటరీ అయిపోతే దానిని వెంటనే చార్జింగ్ పెట్టుకోనే అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
బ్యాటరీ పనితీరు తగ్గిపోతుంది.. బ్యాటరీ వాడుతుండగా.. దాని పనితీరు రానురాను తగ్గిపోతుంది. ఫలితంగా కొత్త బ్యాటరీ మార్చుకోవాల్సి వస్తుంది. ఇది ఖర్చును పెంచుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..