EPFO: ఈపీఎఫ్ ఖాతాలో తప్పులున్నాయా..? కంపెనీ హెచ్ఆర్‌తో పని లేదంతే..!
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) గురించి దాదాపు అందరికీ తెలిసిందే. వివిధ కంపెనీలు, ఫ్యాక్టరీలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు దీనిలో చందాదారులుగా ఉంటారు. ప్రతి నెలా వారి జీతం నుంచి కొంత మొత్తం దీనిలో జమ అవుతుంది. అలా పెరుగుతూ ఉద్యోగ విరమణ తర్వాత పెద్ద మొత్తంలో అందుతుంది.

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. అయితే చందాదారుల పేర్లు, ఇతర వ్యక్తిగత వివరాల్లో కొన్ని పొరపాట్లు దొర్లుతాయి. వాటిని సవరించుకోవడం అత్యవసరమైనప్పటికీ, ఆ విధానం కష్టంగా ఉండడంతో చందాదారులు ఆసక్తి చూపేవారు కాదు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు తప్పాయి. ఖాతాదారులు తమ వ్యక్తిగత వివరాలను ఆన్ లైన్ లో సొంతంగా సవరించుకోవచ్చు. ఈపీఎఫ్ ఖాతాదారులు తమ పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలను ఆన్ లైన్ లో చాలా సులభంగా సవరించుకునే విధానం అమల్లోకి వచ్చింది. గతంలో వీటి కోసం యాజమాన్య పరిశీలన, ఈపీఎఫ్ వో ఆమోదం అవసరమయ్యేది. ఇప్పుడు అవేమీ లేకుండా ఆన్ లైన్ లో మార్చుకోవచ్చు. అలాగే ఈకేవైసీ ఈపీఎఫ్ (ఆధార్ సీడెడ్) ఖాతా ఉన్న చందాదారులు తమ ఆధార్ ఓటీపీ సాయంతో బదిలీ క్లెయిమ్ లను యాజమాన్యం ప్రమేయం లేకుండానే ఆన్ లైన్ లో ఫైల్ చేసుకోవచ్చు.
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవియా శనివారం ఈ సేవలను ప్రకటించారు. వీటి వల్ల సభ్యుల ప్రొఫైల్, కేవైసీ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఖాతాదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో దాదాపు 27 శాతం వీటికి సంబంధించే ఉంటున్నాయన్నారు. తాజాగా ఈ సమస్యలను ఆన్ లైన్ లో పరిష్కరించుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. కొత్త విధానంలో ఖాతాదారుడి పేరు, పుట్టిన తేదీ, జెండర్, జాతీయత, తండ్రి/తల్లి పేరు, వైవాహిక స్థాయి, భాగస్వామి పేరు, సంస్థలో చేరిన తేదీ, సంస్థను వదిలిన తేదీ వంటి వివరాలను ఈపీఎఫ్ వో పోర్టల్ లో సొంతంగా సవరించుకోవచ్చు. అయితే 2017 అక్టోబర్ 1 తర్వాత యూనివర్సల్ ఖాతా నంబర్ (యూఏఎన్) పొందిన వారికే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ మార్పుల కోసం ఉద్యోగి ఎటువంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు.
2017 అక్టోబర్ ఒకటే తేదీ కన్నా ముందుగానే యూఏఎన్ నంబర్ పొంది ఉంటే.. ఆ ఉద్యోగి వివరాలను ఈపీఎఫ్ వో అనుమతితో యజమాని సవరించే అవకాశం ఉంది. ఆధార్ తో యూఏఎన్ అనుసంధానం కాని సందర్భంలో వివరాల సవరణ కోసం దాన్ని ఈపీఎఫ్ వోకు పంపుతారు. కాగా.. కొత్త విధానం ద్వారా పీఎఫ్ ఖాతాల సమస్యలున్న వారిలో 45 శాతం మంది ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా చాలా సులువుగా పరిష్కరించుకునే అవకాశం కలుగుతుంది. మిగిలిన వారు యజమాన్యం ద్వారా సవరించుకోవచ్చు. ఉద్యోగుల ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ వో)లో సుమారు 7.6 కోట్ల మంది సభ్యులున్నారు. వీరందరికీ మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు, సమస్యలను సులువుగా పరిష్కరించుకునేందుకు ఆ సంస్థ చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








