Pan 2.0: ఈ-మెయిల్ ఉంటే పాన్ 2.0 వచ్చేసినట్టే.. దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం
దేశంలోని పౌరులందరి దగ్గర ఆధార్ కార్డుతో పాటు ఉండాల్సిన మరో ముఖ్యమైన డాక్యుమెంటు పాన్ కార్డు. దీన్నే పర్మనెంట్ అక్కౌంట్ నంబర్ (పాన్) అని పిలుస్తారు. ఆర్థిక లావాదేవీల విషయంలో పారదర్శకత తీసుకు రావడం, ప్రభుత్వానికి పన్నుల ఎగవేతను కట్టడి చేయడం దీని ప్రధాన లక్ష్యాలు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర పాన్ కార్డు కనిపిస్తుంది.
నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొత్తగా పాన్ 2.0 అనే ప్రాజెక్టును మొదలుపెట్టింది. ఆర్థిక మోసాలు, సమాచార చౌర్యాన్ని అరికట్టడానికి కొత్త పాన్ విధానం తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పాన్ 2.0 ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో సరైన సమాచారం లేదు. ఈ విధానంలో క్యూర్ కోడ్ తో ఉన్న పాన్ కార్డును అందజేస్తారు. అయితే ఇప్పటికే కార్డులున్నవారికి ఎలాంటి ఇబ్బంది కలగదు. అవి వినియోగంలో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకే పాన్ 2.0ను తీసుకువస్తున్నట్టు తెలిపింది.
పాన్ 2.0 ప్రాజెక్టు ఇంకా మొదలు కానుందున ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ఇతర వ్యక్తులు తమ ఇ మెయిల్ ఐడీ ద్వారా పాన్ 2.0ను పొందే అవకాశం ఉంది. ఇ మెయిల్ లో కార్డు పొందటానికి ఎలాంటి చార్జీ కట్టనవసరం లేదు. కానీ భౌతికంగా కార్డు కావాలంటే మాత్రం రూ.50 కట్టాలి. దేశం వెలుపల పాన్ కార్డు డెలివరీ కోసం రూ.15తో పాటు పోస్టల్ చార్జీలు వసూలు చేస్తారు. ఆదాయపు పన్ను డేటా బేస్ లో మీ ఇమెయిల్ ఐడీ లేకపోతే కొత్తగా అప్ డేట్ చేసుకునే వీలు ఉంది. ఇమెయిల్ ద్వారా కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు ముందుగా తమ కార్డును ఎన్ఎస్డీఎల్ లేదా యూటీఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెట్ (యూటీఐఐటీెఎస్ఎల్) జారీ చేసిందో గమనించాలి. మీ పాన్ కార్డు వెనుక భాగంలో ఆ వివరాలు ఉంటాయి. అనంతరం ఇమెయిల్ లేదా డిజిటల్ రూపంలో పాన్ పొందటానికి ఈ కింద తెలిపిన పద్దతులు పాటించండి.
పాన్ కార్డు 2.0 పొందడం ఇలా
- ముందుగా ఎన్ఎస్‌డీఎల్ అధికారిక లింక్‌ను ఓపెన్ చేయండి
- అందులో అడిగిన పాన్, ఆధార్, ఇతర వివరాలను నమోదు చేయాలి. అనంతరం అన్ని బాక్సుల్లో టిక్ చేసి సెండ్ చేయాలి
- స్క్రీన్‌పై వెబ్ పేజీ ప్రత్యక్షమవుతుంది. దానిలో వివరాలను సరిచూసుకోవాలి. తర్వాత వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.
- ఓటీపీని నమోదు చేసి, మీ వివరాలను ధ్రువీకరించుకోవాలి. ఓటీపీ కేవలం పది నిమిషాల వరకూ చెల్లుబాటు అవుతుంది.
- చెల్లింపు పద్ధతిని ఎంపిక చేసుకోవాలి. నిబంధనలను అంగీకరిస్తూ టిక్ బాక్స్ లు ఎంచుకోవాలి.
- చెల్లింపు పూర్తయిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- అనంతరం ఆదాయపు పన్ను డేటా బేస్ లో అప్ డేట్ చేసిన ఇమెయిల్ ఐడీకి పాన్ డెలివరీ అవుతుంది.
- ఈ ప్రాసెస్ కు గరిష్టంగా సుమారు అరగంట పడుతుంది.
- యూటీఐఐటీఎస్ఎల్ నుంచి ఇ-పాన్ కార్డు డౌన్ లోడ్ చేసుకునే విధానం ఇలాగే ఉంటుంది.
- ఆదాయపు పన్ను శాఖలో పాన్ రికార్డుల ప్రకారం అందుబాటులో ఇమెయిల్ కు మాత్రమే ఇ-పాన్ పంపిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి