Google Airtel: జియోకు షాకిచ్చిన గూగుల్.. ఎయిర్‌టెల్‌కు కొత్త బలం.. ఇండియాలోనే అతిపెద్ద డీల్..!
Google Airtel: భారత టెలికాం రంగంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇండియాను వేదికగా చేసుకుని వ్యాపార దిగ్గజ సంస్థలు పోటీకి దిగబోతున్నాయా..
Google Airtel: భారత టెలికాం రంగంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇండియాను వేదికగా చేసుకుని వ్యాపార దిగ్గజ సంస్థలు పోటీకి దిగబోతున్నాయా ? అంటే అవుననే సమాధానం వస్తోంది ఇండస్ట్రీ వర్గాల నుంచి. దీనిని నిజం చేస్తూ ఇటీవల జాతీయ మీడియాలో కథనాలు సైతం వెలువడుతున్నాయి. టెక్ దిగ్గజం, సెర్చ్ ఇంజన్ గూగుల్ ఇండియాలోని టెలికాం సెక్టార్‌పై గురి పెడుతోంది. టెలికాం పరంగా ప్రపంచంలోనే రెండో పెద్ద మార్కెట్‌గా గుర్తింపు పొందిన భారత్‌లో పాగా వేసేందుకు తనదైన శైలిలో అడుగులు వేస్తోంది. ఇప్పటికే జియో నెట్‌వర్క్‌లో రూ. 34,000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి 7 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఎయిర్‌టెల్‌తో చర్చలు
టెలికాం సెక్టార్‌లో జియో నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్న ఎయిర్‌టెల్‌లో భారీ స్థాయిలో పెట్టబడులు పెట్టేందుకు గూగుల్ సిద్ధమైంది. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య ఏడాది కాలంగా చర్చలు జరుగుతున్నాయని, ఎన్నో అంశాలపై క్లారిటీ వచ్చిందని, త్వరలోనే ఈ డీల్ కార్యరూపం దాల్చనుందని కథనాలు వెలువడ్డాయి. ఈ డీల్ ఇండియాలోనే అతి పెద్ద డీల్ అయ్యే అవకాశం ఉందని కూడా పేర్కొంటున్నాయి. ఎయిర్‌టెల్, గూగుల్‌ల మధ్య ఒప్పందం కుదిరితే టెలికాం రంగంలో మరోసారి పోటీ తప్పదని, దాని వల్ల వినియోగదారులకు తక్కువ ధరలకే మొబైల్ నెట్‌వర్క్ సేవలు అందుతాయనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. గతంలో టాటా డొకోమో రాకతో కాల్ పల్స్ రేట్లు తగ్గిపోగా జియో రాకతో డేటా, కాల్ ఛార్జీలు గణనీయంగా తగ్గిపోయాయి. అయితే ఆ తర్వాత ఎంతో మార్పు వచ్చింది. మళ్లీ ధరలు పెరుగుతున్నాయి.