Indian GCC industry: దేశంలో పరుగులు పెడుతున్న కొత్త పరిశ్రమ..ఆసక్తి చూపుతున్న ప్రపంచ దేశాలు
యువతకు సరైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించినప్పుడే ఆ దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది. ప్రజల ఆదాయాలు పెరిగి జీవన పరిస్థితులు మెరుగుపడతాయి. అప్పుడే కుటుంబాలు, సమాజం, తద్వారా దేశం ముందుకు సాగుతాయి. ప్రస్తుతం మన దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు బాగున్నాయి.
దేశంలోని జీసీసీ పరిశ్రమ 2030 నాటికి వంద బిలియన్ల డాలర్లకు చేరుకోనుంది. దీని ద్వారా 2.5 మిలియన్లకు పైగా ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోని జీసీసీ సెంటర్లు గత ఐదేళ్లలో విపరీతమైన ప్రగతి సాధించాయి. అసలు జీసీసీ అంటే ఏమిటో తెలుసుకుందాం. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లనే సంక్షిప్తంగా జీసీసీలు అంటారు. వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలకు పొరుగు, ప్రాసెస్ సేవలను అందించేందుకు నైపుణ్యంతో పాటు చౌకగా మానవ వనరులు లభించే ఇతర దేశాలలో తమ ఉప కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటాయి. వీటినే జీసీసీలు అంటారు. వీటి ద్వారా ఐటీ, ఆర్ అండ్ డీ, ఫైనాన్స్, టెలికాం, బ్యాంకింగ్ తదితర రంగాల్లో సేవలు అందిస్తారు. ఈ పరిశ్రమకు మన దేశం చాలా అనుకూలంగా ఉంది. దీంతో అనేక కంపెనీలు ఇక్కడ జీసీసీలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి.
ఇండియాస్ జీసీసీ ల్యాండ్ స్కేప్ పేరుతో ఇటీవల విడులైన ఓ నివేదిక ప్రకారం.. దేశంలో 1700కి పైగా జీసీసీలు కొనసాగుతున్నాయి. వీటి ద్వారా వివిధ ప్రాంతాల్లో సుమారు 1.9 మిలియన్ల మంది నిపుణులకు ఉపాధి లభిస్తోంది. ఈ కేంద్రాలు దాదాపు 64.6 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయం ఆర్జిస్తున్నాయి. దేశంలోని జీసీసీలు కేవలం సంఖ్యపరంగా పెరగడమే కాకుండా సేవల విషయంలోనూ ముందుకు దూసుకువెళుతున్నాయి. గత ఐదేళ్లలో సాంప్రదాయ సేవలకు మించి పోర్ట్ ఫోలియో, ట్రాన్స్ ఫర్మేషన్ హబ్ లుగా మారాయి. ఈ కారణంగా 2030 నాటికి ఈ పరిశ్రమ గణనీయంగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే దాాదాపు 2.5 మిలియన్ల కు మంచి ఉద్యోగాలు లభిస్తాయని చెబుతున్నారు. దేశంలోని జీసీసీలలో దాదాపు 70 శాతానికి పైగా 2026 నాటికి ఏఐ టెక్నాలజీ కలిగి ఉంటాయని వెల్లడించారు.
జీసీసీల ఏర్పాటుకు మన దేశం ఎంతో అనుకూలంగా ఉంటుంది. తూర్పు ఐరోపాలో కంటే దాదాపు 40 శాతం తక్కువ ఖర్చుతో ఇక్కడ పని జరుగుతుంది. దీంతో ప్రపంచంలోని వివిధ కంపెనీలు తమ జీసీసీలను ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. దేశంలోని వివిధ నగరాలలో జీసీసీలు సేవలు అందిస్తున్నాయి. వాటిలో బెంగళూరు 36 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ముంబై, పూణే 31 శాతం, ఢిల్లీ ఎన్ సీఆర్ 22 శాతం, హైదరాబాద్ 14 శాతంతో కొనసాగుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి