Bank Holidays: ప్రైవేట్ బ్యాంకులు 5 రోజుల పనిదినాలు స్వచ్చంధంగా అమలు చేయవచ్చా..? ఆర్బీఐ రూల్స్‌తో..
బ్యాంక్ ఉద్యోగులు వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం అమలు చేసేందుకు వెనకడుగు వేస్తోంది. దీంతో బ్యాంక్ ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. అయితే ప్రైవేట్ బ్యాంకులు స్వచ్చంధంగా 5 రోజుల పని దినాలు అమలు చేయవచ్చా..?

బ్యాంకు ఉద్యోగుల ఐదు రోజుల పని దినాల డిమాండ్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవల సమ్మెను వాయిదా వేసుకున్నప్పటికీ.. వారి ప్రధాన డిమాండ్‌లలో ఐదు రోజుల పనిదినాల అమలు కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకుల్లో ఉద్యోగులు తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒక సర్వే ప్రకారం, 82.2 శాతం మంది బ్యాంకు ఉద్యోగులు అధిక పనిభారంతో సతమతమవుతున్నారు. ఉదయం బ్యాంకులు తెరిచినప్పటి నుంచి కస్టమర్లను డీల్ చేయడంతో పాటు, బ్యాక్ ఎండ్ వర్క్, టార్గెట్లు, కరెన్సీ లెక్కలు చూసుకోవడంలో రోజంతా గడిచిపోతుంది. చాలామంది రాత్రి తొమ్మిది, పది గంటల వరకు కూడా పని చేయాల్సి వస్తుంది. గత పదేళ్లలో డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరగడం, ఏటీఎంలు అందుబాటులోకి రావడంతో ఖాతాదారులు శాఖలకు రావడం తగ్గింది. అయినప్పటికీ బ్యాంకు ఉద్యోగుల పనిభారం తగ్గడం లేదు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ వంటి సంస్థలు ఇప్పటికే ఐదు రోజుల పని విధానాన్ని పాటిస్తున్నాయి. ఇదే విధానాన్ని బ్యాంకింగ్ రంగంలోనూ అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. బ్యాంకుల దైనందిన నిర్వహణ ఖర్చులు తగ్గడంతో పాటు ఉద్యోగుల మానసిక ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ డిమాండ్‌పై కేంద్రం సానుకూలంగా ఉన్నప్పటికీ.. అమలు చేయడంలో జాప్యం చేస్తోంది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అమలు చేయడం గురించి సంగతి అలా ఉంచితే.. ప్రైవేట్ రంగ బ్యాంకులుతమ విచక్షణ మేరకు 5 రోజుల పని వారాన్ని అమలు చేయవచ్చా? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఒకవేళ అన్ని శనివారాలు బ్యాంకులను మూసి వేయాలనుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి అనుమతి అవసరమా? అనే సందేహాం చాలామందిలో ఉంది. అయితే ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఖచ్చితంగా ప్రైవేట్ బ్యాంక్ అనుమతి తీసుకోవాలి. ఆర్బీఐ అనుమతి ఇస్తేనే ప్రైవేట్ బ్యాంక్ అయినా సెలవు ప్రకటించడం కుదరుతుంది. ప్రైవేట్ బ్యాంకు స్వచ్ఛందంగా 5 రోజుల పనివారాన్ని ప్రవేశపెట్టి ఆర్‌బిఐ, ప్రభుత్వ నిబంధనల ప్రకారంస్పష్టమైన అనుమతి అవసరం. అనుమతి తీసుకోకుండా అమలు చేయడం కుదరదు.
గత పదేళ్లలో బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ మార్పులు భారీగా వచ్చాయి. మనదేశంలో 2025 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో డిజిటల్ చెల్లింపుల వాటా ఏకంగా 99.8 శాతానికి చేరింది. 2026 ఆగస్టు నెలలో యూపీఐ లావాదేవీలు 24.51 బిలియన్ల రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఏటీఎంలు, క్యాష్ రీసైక్లర్ మిషన్లు అందుబాటులోకి రావడంతో నగదు జమ చేయడం, తీసుకోవడం సులువైంది. ఈ యంత్రాలు దొంగనోట్లను గుర్తించడంతో పాటు నగదు పంపిణీని కూడా సురక్షితంగా చేస్తాయి. ఖాతాదారులు చిన్నచిన్న పనుల కోసం బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం దాదాపుగా తగ్గిపోయింది. అయినప్పటికీ బ్యాంకు ఉద్యోగులు మాత్రం క్షణం తీరిక లేకుండా అదనపు గంటలు పనిచేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది
