కుదిరిన ‘డీఎంకే-కాంగ్రెస్’‌ సీట్ల సర్దుబాటు

చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరిలో కలిసి పోటీ చేసేందుకుగానూ డీఎంకే.. పలు పార్టీలతో పొత్తులపై తుది నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో తమ మిత్రపక్షాలతో చర్చలు జరిపిన ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్.. మంగళవారం మీడియా సమావేశంలో ఈ విషయంపై ప్రకటన చేశారు. తమిళనాడులోని 39 స్థానాలు, పుదుచ్చేరిలో 1 స్థానంలో తమ పార్టీతో పాటు కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎమ్‌ఎల్‌, ఐజేకే, కేఎమ్‌డీకేతో కలిసి పనిచేస్తాయని తెలిపారు. ‘మేము […]

కుదిరిన ‘డీఎంకే-కాంగ్రెస్’‌ సీట్ల సర్దుబాటు
Ram Naramaneni

|

Mar 05, 2019 | 8:52 PM

చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరిలో కలిసి పోటీ చేసేందుకుగానూ డీఎంకే.. పలు పార్టీలతో పొత్తులపై తుది నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో తమ మిత్రపక్షాలతో చర్చలు జరిపిన ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్.. మంగళవారం మీడియా సమావేశంలో ఈ విషయంపై ప్రకటన చేశారు. తమిళనాడులోని 39 స్థానాలు, పుదుచ్చేరిలో 1 స్థానంలో తమ పార్టీతో పాటు కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎమ్‌ఎల్‌, ఐజేకే, కేఎమ్‌డీకేతో కలిసి పనిచేస్తాయని తెలిపారు. ‘మేము మా మిత్రపక్షం కాంగ్రెస్‌కి 10 సీట్లు కేటాయిస్తున్నాం. మరో 10 సీట్లలో ఇతర మిత్రపక్షాలు పోటీ చేస్తాయి. మిగిలిన 20 సీట్లలో డీఎంకే పోటీ చేస్తుంది. ఈ సారి మా కూటమిలో ఎమ్‌ఎమ్‌కే పార్టీకి చోటు లేదు. ఏయే నియోజక వర్గాల్లో ఏయే పార్టీ పోటీ చేయాలనే విషయంపై మేము మార్చి 7న సమావేశం కానున్నాం’ అని ప్రకటన చేశారు.

ఈ కూటమిలో భాగస్వామ్యమైన సీపీఐ, సీపీఎం, వీసీకే రెండేసి స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఎండీఎంకే, ఐయూఎమ్‌ఎల్‌, ఐజేకే, కేఎమ్‌డీకే ఒక్కో స్థానంలో పోటీ చేస్తాయి. అలాగే, ఎండీఎంకేకి ఓ రాజ్యసభ సీటు ఇస్తామని డీఎంకే తెలిపింది. ఏయే నియోజక వర్గాల్లో ఏయే పార్టీ పోటీ చేయాలనే విషయంపై డీఎంకే నేత దురైమురుగన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ మార్చి 7న చర్చలు జరపనుంది. ఈ సమావేశానికి హాజరుకావాలని మిత్రపక్షాల నేతలకు డీఎంకే ఆహ్వానం పంపింది. కాగా, స్టాలిన్‌ మంగళవారం చేసిన ప్రకటనతో.. వీరి పొత్తులో సినీనటుడు విజయ్‌కాంత్‌కి చెందిన డీఎండీకే కలిసే అవకాశాలు లేవని స్పష్టమైపోయింది. అన్నాడీఎంకే ఏర్పాటు చేస్తున్న కూటమితో ఆ పార్టీ కలిసే అవకాశాలు కనపడుతున్నాయి. అన్నాడీఎంకే సమన్వయ కర్త, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం సోమవారం విజయ్‌కాంత్‌ నివాసానికి వెళ్లి ఈ విషయంపై చర్చలు జరిపారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu