Talasani warns congress leaders: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటుంటే వాటిని చూడలేని కాంగ్రెస్ నేతలు దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నారని, వాటికి ధీటుగా సమాధానం చెబుతామని తలసాని హెచ్చరించారు. కరోనా నియంత్రణా చర్యలపై ముఖ్యమంత్ర కేసీఆర్ నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న తర్వాత మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ కరోనా నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నారని, ప్రజలందరూ లాక్ డౌన్ కు సహకరిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20వేల బెడ్స్ అందుబాటులో ఉంచామని చెప్పారు. తెలంగాణ ప్రజలతో సమానంగా వలస జీవులకు నిత్యవసర సరుకులు అందిస్తున్నామని తెలిపారు. వైద్యపరంగా ప్రభుత్వం అన్ని వసతులు కల్పించిందన్నారు.
నిత్యావసర సరుకుల సాకుతో కొంతమంది రోడ్లెక్కుతున్నారని, మరికొంత మంది దద్దమ్మలు గాలిమాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి తలసాని. ఇలాంటి సమయంలో ప్రజలను తప్పుదారి పట్టించొద్దని కాంగ్రెస్ నేతలకు సూచించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మీడియాకు ఇచ్చిన గౌరవం ఏంటో అందరికి తెలుసన్నారు తలసాని.
ప్రపంచ అగ్ర దేశాలు సైతం బయో మెడిసిన్ ఇండియాను అడిగే పరిస్థితి ఇప్పుడు ఉందని అన్న మంత్రి, విమర్శలు చేసే వాళ్ళు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. జ్ఞానం లేని వ్యక్తులు మాట్లాడిన మాటలు వింటే నవ్వొస్తుందని వ్యంగ్యంగా అన్నారాయన. మీడియాలో కనిపించాలనే ప్రతిపక్ష నేతలు విమర్శలు చేసారని, కాంగ్రెస్ నేతలు పనికిరాని దద్దమ్మలని తలసాని మండిపడ్డారు.