AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ టీడీపీలో ముసలం.. బాబు అంతరంగంపై సర్వత్రా ఆసక్తి

అసలు ఉనికి వుందో లేదో తెలియని తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. నాయకత్వ మార్పు అనివార్యమంటూ ఓ వర్గం టీడీపీ అధినేత చంద్రబాబును ఆశ్రయించింది. పార్టీకి జవజీవాలందించడంతోపాటు క్రియాశీలకంగా మార్చేందుకు తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై...

తెలంగాణ టీడీపీలో ముసలం.. బాబు అంతరంగంపై సర్వత్రా ఆసక్తి
Rajesh Sharma
|

Updated on: Sep 21, 2020 | 3:12 PM

Share

అసలు ఉనికి వుందో లేదో తెలియని తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. నాయకత్వ మార్పు అనివార్యమంటూ ఓ వర్గం టీడీపీ అధినేత చంద్రబాబును ఆశ్రయించింది. పార్టీకి జవజీవాలందించడంతోపాటు క్రియాశీలకంగా మార్చేందుకు తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై అధినేతకు లేఖ రాశారు తెలంగాణ టీడీపీ నేతలు కొందరు. గత ఏడేళ్ళుగా ఒక్కరినే అధ్యక్షునిగా కొనసాగించడం వల్ల పార్టీ శ్రేణులు డీలా పడిపోయారని, తక్షణం నాయకత్వ మార్పుపై దృష్టి సారించాలని ఈ నేతలు అధినేత చంద్రబాబుకు మొరపెట్టుకున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ నేతలు ఒక్కరొక్కరే ఇతర పార్టీలకు చేరిపోవడంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మనుగడలో వుందా లేదా అన్నంత స్థాయికి చేరిపోయింది. ఈ క్రమంలో తెలంగాణ టీడీపీ పగ్గాలను బీసీ నేతకు అప్పగిస్తే బలహీన వర్గాల్లో అయినా పార్టీ పునాదులు చెదిరిపోకుండా వుంటాయని భావించిన చంద్రబాబు.. జగిత్యాలకు చెందిన సీనియర్ నేత ఎల్. రమణకు తెలంగాణ టీడీపీ పగ్గాలను అప్పగించారు. ఇది దాదాపు ఆరున్నరేళ్ళ క్రితం జరిగింది. రమణను అధ్యక్షునిగా మార్చిన తర్వాత పార్టీ నాయకుల వలస ఏ మాత్రం ఆగలేదు. సరికదా.. కీలక నేతలంతా అయితే కాంగ్రెస్ పార్టీలోనో.. లేక బీజేపీలోనో చేరిపోయారు.

ఈ క్రమంలో పార్టీ మనుగడ ప్రశ్నార్థకం కావడంతో 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చిరకాల ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు కూడా టీడీపీ సిద్దపడింది. ఏకంగా చంద్రబాబు, కాంగ్రెస్ అధినేతలతో కలిసి ప్రచారం చేసినా.. తెలంగాణలో టీడీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు కూడా క్రమంగా అధికార పార్టీకి దగ్గరవడంతో తెలంగాణలో టీడీపీ కథ ముగిసినట్లేనన్న విశ్లేషణలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆరు నెలల్లోనే పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లోను తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు కన్నెత్తి చూడలేదు. ఈ క్రమంలోనే గత కొంత కాలంగా తెలంగాణ టీడీపీ కార్యకలాపాలు అస్సలు జరగడం లేదు. చంద్రబాబు హైదరాబాద్‌లో వున్నప్పడు మాత్రం ఒకరిద్దరు నేతలు ఆయన్ని కలిసి.. పార్టీ భవిష్యత్తుపై చర్చించడం వంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ప్రస్తుత అధ్యక్షుడు రమణను మార్చాలంటూ కొందరు సీనియర్లు చంద్రబాబుకు లేఖ రాశారు. నాయకత్వం‌ మార్పు జరగాలని ఈ లేఖలో చంద్రబాబును కోరారు పార్టీ నేతలు. తెలంగాణలో పార్టీ పరిస్థితిని గురించి చంద్రబాబుకు వివరించిన సీనియర్లు, ఆరున్నరేళ్ళుగా ఒకే అధ్యక్షునితో పార్టీ పరిస్థితి గందరగోళంలో పడిందని తెలిపినట్లు సమాచారం. కింది స్థాయి నుండి అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జిలను మార్చాలని, కోర్ కమిటీని పునర్వ్యవస్థీకరించాలని వారు చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణ టీడీపీలో మొదలైన ఈ ముసలంపై చంద్రబాబు ఎలా స్పందిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది.