బ్రేకింగ్.. కరోనా ఎఫెక్ట్.. రాష్ట్రపతి, ప్రధాని వేతనాల్లో 30 శాతం కోత
కరోనా బీభత్సం నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల వేతనాల్లో 30 శాతం కోత విధించుకోవాలన్న ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది.

కరోనా బీభత్సం నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల వేతనాల్లో 30 శాతం కోత విధించుకోవాలన్న ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. ఆయా రాష్ట్రాల గవర్నర్లకు కూడా ఇది వర్తిస్తుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. రెండేళ్ల పాటు ఎంపీల్యాడ్స్ స్కీమ్ ను నిలిపివేసి.. ఈ పథకం నుంచి రూ. 7.900 కోట్లను కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకు మళ్ళించనున్నట్టు ఆయన చెప్పారు. అలాగే ఎంపీల వేతనాల్లో కూడా 30 శాతం కోత పడుతుందని, అలా వచ్ఛే సొమ్ము ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ కు వెళ్తుందని ఆయన వివరించారు.
ఈ ఏప్రిల్ నుంచే వేతనాల కోత అమలులోకి వస్తుందని జవదేకర్ చెప్పారు. కరోనా సంక్షోభం మొదలయ్యాక మొదటిసారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగిందన్నారు. లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తి వేస్తారన్న ప్రశ్నకు ఆయన.. ప్రతి నిముషం తాము ప్రపంచ వ్యాప్త పరిస్థితిని గమనిస్తున్నామని, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అధీకృత అధికారుల బృందమొకటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని, సరైన సమయంలో ఆ బృందం ఒక నిర్ణయం తీసుకుంటుందని కూడా ఆయన పేర్కొన్నారు. లాక్ డౌన్ ను దశలవారీగా ఎత్తివేసే విషయమై ప్రభుత్వం ఆయా రాష్ట్రాల సూచనలను కోరిందని ఆయన తెలిపారు.



