బీహార్ రాజ్ భవన్ లో కరోనా కలకలం.. 20 మందికి పాజిటివ్ నిర్దారణ !
రాజ్ భవన్ ఉద్యోగులూ కరోనాబారినపడటం విస్మయానికి గురి చేస్తోంది. నిత్యం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ముందస్తుజాగ్రత్తలు తీసుకునే రాజ్ భవన్ లోనూ ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావటంపై విస్మయం కలుగుతోంది.

కరోనా వైరస్ సగటు మనిషి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. చాపకింద నీరులా సైలెంట్ గా వ్యాపిస్తోంది. ఎప్పుడు ఎవరు కరోనాబారినపడతారో తెలియని పరిస్థితి నెలకొంది. సామాన్యుడు, సెలబ్రిటీ అన్న తేడా లేకుండా వైరస్ సైలెంట్ గా విస్తరిస్తోంది. ఎవరినీ వదిలి పెట్టడం లేదు. ఇప్పటికే ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర రాజభవన్ లలోని సిబ్బంది పెద్ద ఎత్తున్న కరోనాబారినపడగా… తాజాగా ఆ జాబితాలో బీహార్ రాజ్‌భవన్ కూడా చేరింది.
బీహార్ రాజ్‌భవన్‌లో కరోనా కలకలం రేపింది. రాజ్ భవన్ లో ఏకంగా 20 మంది కరోనాబారినపడ్డారు. వీరిలో భద్రత సిబ్బంది సహా పలువురు అధికారులు ఉన్నారు. పట్నా బీజేపీ కార్యాలయంలో 75 మంది నేతలకు కరోనా సోకింది. ఇందులో పని చేసే ఓ అధికారికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో వంద మంది బీజేపీ నేతల నమూనాలు సేకరించారు. ఈ పరీక్షల్లో 75 మందికి వైరస్ సోకినట్టు తేలింది.
ఇటీవల మూడు రోజుల కిందట తెలంగాణ రాజ్‌భవన్‌లో కరోనా కలకలం సృష్టించింది. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న 28 మంది పోలీసు సిబ్బందికి, పదిమంది రాజ్‌భవన్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులు మరో పదిమందికి కలిపి మొత్తం 48 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గవర్నర్ తమిళిసై, అధికారులు సైతం పరీక్షలు చేయించుకోగా వారికి నెగెటివ్ వచ్చింది.
మహారాష్ట్రలో రాజ్ భవన్ లో పని చేస్తున్న సుమారు 16 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది. దీంతో గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇప్పటికే ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారని, రానున్న రోజుల్లో అవసరమైతే ఆయనకు కోవిడ్-19 టెస్టులు నిర్వహిస్తామని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. రాజ్ భవన్ స్టాఫ్ క్వార్టర్స్ ని సీల్ చేసి శానిటైజేషన్ చేసే ప్రక్రియను చేపట్టామని, గవర్నర్ కార్యాలయాన్ని ఎనిమిది రోజుల పాటు మూసి ఉంచుతామని వారు చెప్పారు. ఇక కరోనా పాజిటివ్ సోకిన ఉద్యోగులను క్వారంటైన్ కి తరలించారు.
రాజ్ భవన్ ఉద్యోగులూ కరోనాబారినపడటం విస్మయానికి గురి చేస్తోంది. నిత్యం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ముందస్తుజాగ్రత్తలు తీసుకునే రాజ్ భవన్ లోనూ ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావటంపై విస్మయం కలుగుతోంది.



