పెంచి పెద్దచేసిన కొడుకునే మనువాడిన పడతి
ఇదో దిక్కుమాలిన ప్రేమకథ... అసలు దీన్ని ప్రేమంటారో .. ఇంకేమంటారో మొత్తం చదివాక మీరే డిసైడ్ చేసుకోండి

ఇదో దిక్కుమాలిన ప్రేమకథ… అసలు దీన్ని ప్రేమంటారో .. ఇంకేమంటారో మొత్తం చదివాక మీరే డిసైడ్ చేసుకోండి.. రష్యాలో 35 ఏళ్ల మెరీనా బల్మషేవ అనే ఓ యువతి ఉంది.. ఆమె సోషల్ మీడియాలో పెద్ద స్టార్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నాలుగు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారంటేనే ఆమె ఎంత పాపులరో అర్థమవుతుంది.. సరే.. ఆమె ఇప్పుడు తను ప్రేమించిన ఓ ఇరవయ్యేళ్ల వ్లాదిమిర్ వోయాను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఇందులో తప్పేమిటి? తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకోకూడదా ఏమిటి? అన్న ప్రశ్నలు అప్పుడే వేయకండి.. అసలు కథ వేరే ఉంది..
మెరీనా చాలా కాలం కిందట అలెక్స్ ఆరే అనే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది.. ఈ దంపతులిద్దరూ అయిదుగురు పిల్లలను దత్తత తీసుకున్నారు.. వారి ఆలనాపాలనా చూసుకున్నారు.. పదేళ్లపాటు వీరి సంసారం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా హాయిగా సాగింది.. ఆ తర్వాతే లుకలుకలు మొదలయ్యాయి.. అవి విడాకుల వరకు వెళ్లాయి.. న్యాయస్థానమేమో పిల్లల బాధ్యత తండ్రికి అప్పగించింది.. మెరీనా ఓ చోట.. అలెక్స్ ఆరే మరోచోటా ఎవరి బతుకు వారు బతుకుతున్నారు..
ఈ మధ్యలో ఆరే ఇరవయ్యేళ్ల కొడుకు వ్లాదిమిర్ వోయా తనను పెంచిన తల్లి మెరీనా ప్రేమలో కూరుకుపోయాడు.. ఆమె కూడా వోయా ప్రేమలో పడిపోయింది.. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు.. నిజానికి జనవరిలోనే పెళ్లి జరగాలి.. కానీ కరోనా వైరస్ కారణంగా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.. ఇప్పటికీ కరోనా తీవ్రత ఎక్కువగానే ఉన్నా.. ఎడబాటును భరించలేక గత వారం వరుసకు తల్లీకొడుకులైన మెరీనా, వోయాలు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.. చేసుకుంటే చేసుకుంది కానీ.. ఆ పెళ్లి ఫోటోలను..ముచ్చట్లను సోషల్ మీడియాలో పంచుకుంది మెరీనా.. ఇక ఇప్పట్నుంచి అలెక్స్ ఆరేతో మాట్లాడే ప్రసక్తే లేదని కొత్త దంపతులు గట్టిగా చెప్పేశారు.. ఏడేళ్ల వయసు నుంచి పెంచి పెద్ద చేసిన కొడుకుతో పెళ్లేమిటని కొందరు తిట్టిపోస్తున్నారు.. కొందరేమో పెళ్లి చేసుకుంటే తప్పేమిటని అంటున్నారు.. ఎవరేమనుకున్నా లెక్క చేసేది లేదని, ఇది తన వ్యక్తిగతమని మెరీరా అంటోంది.. కొసమెరుపు ఏంటంటే ప్రస్తుతం మెరీరా ప్రెగ్నెంట్!