Vizag politics: మళ్ళీ విశాఖకు చంద్రబాబు.. వైసీపీ కౌంటర్ వ్యూహం

చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎయిర్‌పోర్టు దగ్గర జరిగిన హైడ్రామాతో వార్తలతో హీటెక్కిన విశాఖ నగరం మరోసారి అదే దిశగా పయనిస్తూ వుంది. అందుకు చంద్రబాబు మరోసారి విశాఖకు రానున్నారన్న కథనాలు కారణమవుతుండగా.. వైసీపీ నేతలు కౌంటర్ వ్యూహంతో రెడీ అవుతున్నారు.

Vizag politics: మళ్ళీ విశాఖకు చంద్రబాబు.. వైసీపీ కౌంటర్ వ్యూహం
Follow us
Rajesh Sharma

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 29, 2020 | 3:26 PM

Vizag city once again gearing up for political high drama: చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎయిర్‌పోర్టు దగ్గర జరిగిన హైడ్రామాతో వార్తలతో హీటెక్కిన విశాఖ నగరం మరోసారి అదే దిశగా పయనిస్తూ వుంది. ఇందుకు ఒకవైపు టీడీపీ, ఇంకోవైపు వైసీపీ నేతలు రచిస్తున్న వ్యూహాలే ఉదాహరణ అని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. చంద్రబాబు గో బ్యాక్ నినాదాలు చేసింది కేవలం వైసీపీ శ్రేణులేనని భావిస్తున్న టీడీపీ మరోసారి చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు ప్రారంభించారు. అదే సమయంలో చంద్రబాబు మరోసారి వస్తే ఏం చేయాలన్నదానిపై వైసీపీ నేతలు.. ముఖ్యంగా ఎంపీ విజయసాయిరెడ్డి ద‌ృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరి 27న విశాఖ పర్యటనకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎయిర్‌పోర్టు ఆవరణలోనే చుక్కలు చూపించారు ఆయన పర్యటనను వ్యతిరేకిస్తున్న వారు. చంద్రబాబును అడ్డుకున్న వారెవరు అన్న దానిపై వైసీపీ, టీడీపీ నేతలు చెరో వాదన వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. అదే సమయంలో చంద్రబాబు మరోసారి వైజాగ్ పర్యటనకు వస్తారని లీకులు వదులుతున్నారు.

చంద్రబాబు విశాఖ పర్యటనకు ఈసారి టీడీపీ నేతలు పక్కా వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఫ్లైట్‌లో కాకుండా ట్రెయిన్ లేదా రోడ్డు మార్గంలో విశాఖకు రావాలని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది. అందుకు అనుగుణంగా యాత్రా వ్యూహాన్ని రచించే బాధ్యతలను మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు అప్పగించారని తాజా సమాచారం. రోడ్డు మార్గంలో వస్తే.. మార్గమధ్యంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చంద్రబాబుతో జతకలిసి… విశాఖకు తరలే అవకాశాలుంటాయి. అప్పుడు చంద్రబాబు యాత్రను అడ్డుకోవడం వైసీపీ శ్రేణులకు సాధ్యం కాదని టీడీపీ వ్యూహం రచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరోవైపు చంద్రబాబు వ్యూహానికి ప్రతి వ్యూహంతో వైసీపీ నేతలు సిద్దమవుతున్నారు. శనివారం విశాఖలో పర్యటించిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి… చంద్రబాబు మరోసారి వైజాగ్‌కు వస్తారన్న ప్రచారంపై సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. వైసీపీ కీలక నేతలతో ఆయన భేటీ అయ్యి.. ఈసారి చంద్రబాబు వ్యూహాన్ని ఎలా తిప్పికొట్టాలనే దానిపై సమాలోచనలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం.

ఒకవైపు టీడీపీ విశాఖ వ్యూహం.. మరోవైపు వైసీపీ ప్రతివ్యూహం.. ఈ రెండు చూస్తుంటే.. విశాఖ నగరం మరోసారి రాజకీయ కార్యకలాపాలతో హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.