హైదరాబాద్: వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. మొదటి రోజు విచారణలో భాగంగా 30మంది అనుమానితులను విచారించిన పోలీసులు.. రెండో రోజు మరికొందరిని విచారిస్తున్నారు. ఈ క్రమంలో నోటీసులు అందుకున్న జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి ఏసీపీ కార్యాలయానికి చేరుకుంది. జయరామ్ హత్యపై ఇప్పటికే ఆమెను ఏపీ పోలీసులు విచారించగా.. తాజాగా హైదరాబాద్ పోలీసులు కూడా వివిధ కోణాల్లో శిఖాను ప్రశ్నించనున్నారు.
మరోవైపు జయరామ్ కేసులో నిందితులుగా ఉన్న రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్‌లను మూడు రోజులు కస్టడీకి తీసుకున్న పోలీసులు.. హత్య జరిగిన రోజు రాకేశ్ ఇంట్లో జరిగిన సీన్‌ను రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నారు.
జయరామ్‌కు రాకేశ్ అప్పు ఇవ్వలేదా..? ఇదిలా ఉంటే జయరామ్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకొస్తోంది. రాకేశ్ రెడ్డి.. జయరామ్‌కు ఒక్క రూపాయి కూడా అప్పు ఇవ్వలేదని తెలుస్తోంది. జయరామ్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేయాలన్న ఉద్దేశంతోనే రాకేశ్ ఆయన్ను ట్రాప్ చేశాడని పోలీసులు తెలిపారు. జయరామ్‌ను చంపేసిన అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారులను రంగంలోకి దించి అప్పు ఇచ్చినట్లు దొంగ పత్రాలు సృష్టించాడని పోలీసులు అన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించిన చింతల్‌కు చెందిన రౌడీ షీటర్ సహా ఏడుగురు అనుమానితులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న 11 మంది పోలీసు శాఖకు చెందిన అధికారులపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.