ఒంటరైన రాజాసింగ్.. బిజెపి నేతలు ఏంచేశారంటే?
రాజాసింగ్ పేరు రౌడీషీటర్ల జాబితాలో ఉండటం బీజేపీలో దుమారాన్ని రేపుతోంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనను పోలీసులు ఇలా అవమానించినా పార్టీ నాయకత్వం స్పందించక పోవడం పట్ల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పార్టీలో తనకు పెద్దగా గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు రాజాసింగ్. తాజాగా రేగతున్న వివాదంతో ఆయన మరోసారి పార్టీలో ఒంటరయ్యరన్న వార్తలు వినిపిస్తున్నాయి. మంగళ్ హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజాసింగ్‌పై రౌడిషీట్ ఉందంటూ పోలీసులు […]
రాజాసింగ్ పేరు రౌడీషీటర్ల జాబితాలో ఉండటం బీజేపీలో దుమారాన్ని రేపుతోంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనను పోలీసులు ఇలా అవమానించినా పార్టీ నాయకత్వం స్పందించక పోవడం పట్ల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పార్టీలో తనకు పెద్దగా గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు రాజాసింగ్. తాజాగా రేగతున్న వివాదంతో ఆయన మరోసారి పార్టీలో ఒంటరయ్యరన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మంగళ్ హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజాసింగ్‌పై రౌడిషీట్ ఉందంటూ పోలీసులు లిస్ట్ విడుదల చేయడం బీజేపీలో వివాదాస్పద మవుతోంది. గోరక్షతో పాటు అనేక కేసులు ఆయనపై ఉండటంతో గతంలో రౌడీ షీట్ ఓపెన్ చేసారు పోలీసులు. బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనపై రౌడీ షీట్ కొనసాగించడం దుమారాన్ని రేపుతోంది. రౌడీ షిటర్‌ల కౌన్సిలింగ్ కోసం బుధవారం మంగళ్ హట్ పోలీసులు విడుదల చేసిన జాబితాలో రాజాసింగ్ పేరు ఎమ్మెల్యేతో సహా పేర్కొనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ పోలీసులు ఎమ్మెల్యేకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.
బుధవారమే రౌడీ షీటర్ల జాబితాలో రాజాసింగ్ పేరు వచ్చినట్టు తెలిసినా ఇప్పటి వరకు పార్టీకి చెందిన ఏ ఒక్క నేత కూడా స్పందించక పోవడం దుమారం రేపుతోంది. గతంలోనూ తనను పార్టీలో ఏకాకిని చేసారంటూ అసహనం వ్యక్తం చేసిన రాజాసింగ్‌కు తాజా వివాదంలో కనీసం పార్టీ నేతల నుండి మద్దతు, పరామర్శ లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. జాబితాలో తన పేరు ప్రస్తావించిన తర్వాత మీడియాతో మాట్లాడిన రాజాసింగ్.. పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత తన తదుపరి కార్యాచరణ ఏంటో చెబుతానని చెప్పారు. కానీ ఆ తర్వాత రాజాసింగ్‌ను ఏ ఒక్కరు కలిసి మాట్లాడలేదు. ఆయన కూడా ఎవరినీ కల్వలేదు. ఎమ్మెల్యే పోస్ట్ తో సంబంధం లేకుండా హిందుత్వమే ఎజెండాగా పని చేసుకుపోయే రాజాసింగ్‌ను కావాలనే రాష్ట్ర నాయకత్వం పక్కన పెడుతుందన్న విమర్శలు లేకపోలేదు.
ఆసెంబ్లీలో ఒక్కగానొక్క ఎమ్మెల్యే.. ఫ్లోర్ లీడర్ గా వ్యవహరిస్తున్న రాజాసింగ్‌కు ఇలా జరగడం .. దీనిని ఆ పార్టీ నేతలు ఖండించక పోవడం లో ఆంతర్యం ఏంటన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ప్రజా సమస్యలపై బీజేపీ చేస్తున్న హడావుడి రాజాసింగ్ విషయంలో ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఆ పార్టీ నేతల్లో. ఈ విషయాన్ని జాతీయ నాయకత్వం తో పాటు .. హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని సైతం కలిసి ఈ అంశాన్ని వివరిస్తానని ఆయన చెబుతున్నారు. తెలంగాణ అమిత్ షా అంటూ సంబోదించిన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ .. రాజాసింగ్ కు ఇలాంటి అవమానం జరిగినా స్పందించక పోవడం దురదృష్టకరం అంటున్నారు రాజాసింగ్ అభిమానులు.