తెలంగాణలో కరోనా హాట్ స్పాట్స్ ఇవే… తస్మాత్ జాగ్రత్త
ఒక్కసారిగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా నిజాముద్దీన్‌లో మతపరమైన ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు నివసిస్తున్న ప్రాంతాల్లో కరోనా కేసులు

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కసారిగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా నిజాముద్దీన్‌లో మతపరమైన ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు నివసిస్తున్న ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఆరు కరోనా హాట్ స్పాట్స్‌ను గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం.
కరోనావ్యాధి సోకి కూడా ఇన్నాళ్లు బయటకు చెప్పని ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను హాట్ స్పాట్స్‌గా పేర్కొంటున్నారు. భైంసా, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్ పాతబస్తీ, గద్వాల్, మిర్యాలగూడను హాట్ స్పాట్స్‌గా గుర్తించి.. అక్కడ లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు.
ఇప్పటికే ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో చాలా మంది బయట తిరిగారు. తమ తమ ప్రాంతాల్లో పలువురిని కలిశారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆరు హాట్ స్పాట్స్‌లో లాక్‌డౌన్‌ను మరింత పక్కాగా అమలు చేయబోతున్నారు. ఈ ప్రాంతాల్లో మూడు కి.మీ. పరిధి వరకు ఎవరినీ అనుమతించరు. ఇక్కడ ఉన్న వారిని బయటకు వెళ్లనీయడం లేదు. బయట నుంచి కూడా ఇతరులను లోపలకు అనుమతించడం లేదు.
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వచ్చిన ఢిల్లీ మర్కజ్ కేసులన్నింటినీ నేరుగా సికింద్రాబాద్ గాంధీకి తరలించాలని నిర్ణయించారు. వారు లేదా వారికి సంబంధించి కరోనా నెగటివ్ వచ్చిన వ్యక్తులందర్నీ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రభుత్వ క్వారంటైన్‌లోనే ఉంచాలని నిర్దేశించారు.
కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 154 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 17 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా… 9 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 128 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.