త్వరలో శుభవార్త… వ్యాక్సిన్‌పై ట్రంప్ కీలక ప్రకటన

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో విఫలం అయ్యాడన్న అమెరికా ప్రతిపక్షాల వాదనను తోసిపుచ్చిన అగ్రరాజ్య అధినేత.. వైరస్ బారిన పడిన ఎన్నో దేశాల కంటే మెరుగైన స్థితిలో అమెరికా ఉందని వ్యాఖ్యానించారు. అమెరికాలో ఇప్పటివరకు మొత్తం...

త్వరలో శుభవార్త... వ్యాక్సిన్‌పై ట్రంప్ కీలక ప్రకటన
Follow us

|

Updated on: Jul 14, 2020 | 12:59 PM

ప్రపంచ మానవాళి యావత్తు ఎప్పుడు.. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ రూపకల్పనపై మరోసారి పెద్ద ఎత్తున ఊహాగానాలకు తెరలేపారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. అగ్రరాజ్యం అమెరికా త్వరలోనే శుభవార్త వినిపించబోతోందని డోనాల్డ్ ట్రంప్ తాజాగా వెల్లడించారు. ఈ మేరకు సోమవారం అంటే భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున వైట్ హౌస్ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు.

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో విఫలం అయ్యాడన్న అమెరికా ప్రతిపక్షాల వాదనను తోసిపుచ్చిన అగ్రరాజ్య అధినేత.. వైరస్ బారిన పడిన ఎన్నో దేశాల కంటే మెరుగైన స్థితిలో అమెరికా ఉందని వ్యాఖ్యానించారు. అమెరికాలో ఇప్పటివరకు మొత్తం 34 లక్షల మంది కరోనా వైరస్ బారిన పడగా ఇప్పటికి సుమారు లక్షా 37 వేల మంది మృత్యువాతకు గురయ్యారు. అయితే బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా వంటి పెద్ద దేశాలకంటే అమెరికాలోనే కోవిడ్ పరీక్షలు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయని, కరోనా వైరస్ పరీక్షల నిర్వహణ సామర్థ్యంలో అమెరికానే ముందంజలో ఉందని డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

కొన్ని దేశాలలో ఇప్పటికీ కరోనా వైరస్ పరీక్షలు నామమాత్రపు సంఖ్యలో జరుగుతున్నాయని, అమెరికా ఇప్పటి వరకు నాలుగున్నర కోట్ల మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించిందని అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ సమీక్షా సమావేశంలో వెల్లడించారు. అమెరికా జనాభా 32 కోట్లు కాగా దాదాపు 15 శాతం మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించడం అతిపెద్ద విషయమని ఆయన చెప్పుకున్నారు. అమెరికాలో మరణాల రేటు అత్యల్ప స్థాయిలో ఉందన్న విషయం గుర్తించాలని డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కొన్ని దేశాలలో ఆసుపత్రికి వచ్చిన వారికి, అనారోగ్యం ఉన్నవారికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారని అందుకే ఆయా దేశాలలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య తక్కువగా కనిపిస్తున్నాయని ఆయన అన్నారు.

కరోనాకు వ్యతిరేకంగా అత్యంత గొప్పగా పని చేస్తున్న అమెరికా త్వరలోనే ప్రపంచ మానవాళికి శుభవార్త వినిపించబోతోందని డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇప్పటికే రూపొందించిన వ్యాక్సిన్ల వాడకం మంచి ఫలితాలను ఇస్తుందని, దాంతో చికిత్స విధానంలో మెరుగైన మార్పులను తీసుకురాబోతున్నామని, ఈ విషయంలో త్వరలోనే అమెరికా వెల్లడించబోతున్న శుభవార్త యావత్ ప్రపంచ మానవాళికి హర్షాతిరేకం కలిగిస్తుందని అమెరికా అధ్యక్షుడు తెలిపారు.