Chandrababu fires జగన్, విజయసాయిలపై చండ్ర నిప్పులు… అన్నీఅసత్యాలే!
ఏపీలో రాజకీయ వాదులాట మరోసారి పీక్ లెవల్‌కు చేరుతోంది. ముఖ్యమంత్రి జగన్, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిలపై చండ్రనిప్పులు చెరిగారు విపక్ష నేత చంద్రబాబు. కరోనాపై జరుగుతున్నదంతా అసత్యమేనని...

ఏపీలో రాజకీయ వాదులాట మరోసారి పీక్ లెవల్‌కు చేరుతోంది. ముఖ్యమంత్రి జగన్, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిలపై చండ్రనిప్పులు చెరిగారు విపక్ష నేత చంద్రబాబు. కరోనాపై జరుగుతున్నదంతా అసత్యమేనని, వ్యవసాయరంగంపై కూడా అంతా నిర్లక్ష్యమేనని చంద్రబాబు మంగళవారం విరుచుకుపడ్డారు. కరోనాను నియంత్రించడంలోను, వ్యవసాయ దారులను ఆదుకోవడంలోను జగన్ ప్రభుత్వం విఫలమైనట్లు స్పష్టంగా కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు.
‘‘ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి.. కర్నూలు జిల్లాలో వైద్యం చేసే వారిపట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మొదటి నుంచి చాలా తప్పులు జరిగాయి.. ఎవరైనా మాట్లాడితే ఎదురుదాడే పనిగా పెట్టుకున్నారు.. ఏ2 ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. దక్షిణ కొరియా నుంచి వచ్చిన కిట్లపై అందరూ నిలదీస్తే ఇప్పుడు ధర తగ్గిస్తామంటున్నారు.. పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా ప్రవర్తించటం ఎంత వరకు న్యాయం.. క్లిష్ట సమయంలో కిట్లలో ముడుపుల కోసం కక్కుర్తిపడ్డారు.. జరుగుతున్న పరిణామాలపై ప్రశ్నిస్తే కేసులు పెడతామంటారా? కర్నూల్ ని స్మశానంగా మారుస్తుంటే ఎవ్వరూ ప్రశ్నించకూడదా? ’’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు.
ఇతర రాష్ట్రాలు మెరుగైన ప్యాకేజీలు ఇస్తుంటే ఏపీలో నామమాత్రపు సరుకులతో సరిపెట్టడం సరికాదన్నారు. ప్రజలు ఆకలితో బాధపడుతుంటే ఇతర రాష్ట్రాలను చూసైనా వారికి సాయం చేయట్లేదని విమర్శించారు. కరోనాపై శ్రద్ధపెట్టిన రాష్ట్రాలే అక్కడ వ్యాధిని నియంత్రించగలిగాయని అన్నారు చంద్రబాబు. ‘‘ ర్యాపిడ్ కిట్ల కొనుగోలు వ్యవహారం చూశాక మీ నిజస్వరూపం, వైఖరి బయటపడ్డాయి.. మొదటి లాక్‌డౌన్ సందర్భంగా 5 వేలు డిమాండ్ చేశాం.. లాక్‌డౌన్ కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు కనీసం 7500 నుంచి 10,000 వేలైనా ఇవ్వాలి.. ’’ అని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ విజయసాయికి ఊరకుక్క మాదిరి వ్యవహరించే అధికారం ఎవరిచ్చారు ? రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన సమయమని ఇప్పటికైనా గ్రహించాలి.. ఇప్పటికైనా దాపరికాలు సరికాదు.. ఇప్పటికే రాష్ట్రం ఎంతో మూల్యం చెల్లించుకుంది.. రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.. రైతుల్ని ఆదుకుంటామనే ప్రకటనలు తప్ప ఆచరణలో ప్రభుత్వం విఫలమైంది.. పలుచోట్ల రైతులు పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు.. తప్పుని ఎవ్వరు ఎత్తి చూపినా వారిపై ఎదురు దాడులు చేస్తున్నారు.. ’’ అని ఆరోపించారు చంద్రబాబు.
‘‘ కన్నా, పవన్ కళ్యాణ్ ఏదైనా మాట్లాడితే వారిపైనా విరుచుకుపడుతున్నారు.. విధులు నిర్వర్తించే పోలీసులకు తగిన రక్షణ పరికరాలు లేవు.. పోలీసులు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రాణాలు తీసే విధంగా ప్రవర్తించటం సరికాదు.. ప్రభుత్వం కరోనా నియంత్రణకు ఎక్కడా శ్రద్ధ చూపటం లేదనటానికి అనేక ఉదాహరణలున్నాయి.. మనుషులు ఉంటారా చనిపోతారా అనే భయాందోళనలో ఉంటే రోజూ ఎన్నికలు పెట్టాలని పరితపిస్తున్నారు.. ’’ అని మండిపడ్డారాయన.




