AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yearly Horoscope 2023: కొత్త సంవత్సరంలో ఈ రాశుల వారికి ధనలాభం, విశేష శుభ ఫలితాలు

Yearly Horoscope Predictions 2023: కొత్త సంవత్సరం(2023) ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. గ్రహాల రాశి మార్పుల పరంగా 2023 సంవత్సరం చాలా ముఖ్యమైనది.. ప్రత్యేకమైనది. శని, గురు, రాహు, కేతువుల వంటి ప్రధాన గ్రహాల రాశిచక్రాలు మారతాయి.

Yearly Horoscope 2023: కొత్త సంవత్సరంలో ఈ రాశుల వారికి ధనలాభం, విశేష శుభ ఫలితాలు
Yearly Horoscope 2023Image Credit source: TV9 Telugu
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Dec 13, 2022 | 11:22 AM

Share

Yearly Astrology Predictions 2023: కొత్త సంవత్సరం(2023) ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. గ్రహాల రాశి మార్పుల పరంగా 2023 సంవత్సరం చాలా ముఖ్యమైనది.. ప్రత్యేకమైనది. కొత్త సంవత్సరంలో శని, గురు, రాహు, కేతువుల వంటి నాలుగు ప్రధాన గ్రహాల రాశిచక్రాలు మారతాయి. దీని ప్రభావంతో కొత్త సంవత్సరం కొన్ని గ్రహాల వారి జీవితాలను కొత్త మలుపు తిప్పనుంది. మరీ ముఖ్యంగా మొత్తం 12 రాశులలోని కొన్ని రాశుల వారికి విశేష శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా మూడు రాశుల వారికి మంచి అదృష్ట యోగం పట్టబోతోంది. కొత్త సంవత్సరం వారికి విశేష ధన లాభం, శుభ ఫలితాలు లభిస్తాయి.  వ్యక్తిగత జాతకాలలో దశలు అంతర్దశలు బాగున్న పక్షంలో ఈ ఫలితాలు 100% వర్తిస్తాయి. మిధునం, తుల, మకర రాశుల వారికి కొత్త సంవత్సరం పట్టిందల్లా బంగారం కాబోతోంది.

మేషం

దాదాపు ఏడాదంతా శని కుంభంలో, గురువు మీన, మేషాల్లో, రాహు మేష మీనాల్లో, కేతువు తుల, కన్యల్లో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారి జీవితాల్లో కొన్ని సానుకూల మార్పులు, శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ప్రధానంగా ఉద్యోగంలో, ఆర్థిక కుటుంబ వ్యవహారాల్లో వీటి ప్రభావం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. ఆర్థిక ఒడిదుడుకులు బాగా తగ్గుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. ఎవరికి ఆర్థిక సంబంధమైన బాధ్యతలు అప్పగించవద్దు. పోయే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులతో విభేదాలకు, అపార్ధాలకు అవకాశం ఉంది.

వృషభం

దశమ స్థానంలో శని, వ్యయ స్థానంలో గురు రాహువులు సంచరిస్తున్నందు వల్ల ఈ రాశి వారికి విదేశాల్లో ఉద్యోగం, ఆకస్మిక ధన లాభం, మంచి పేరు ప్రతిష్టలు, సంతానయోగం, వివాహయోగం వంటి శుభపరిణామాలు అనుభవానికి వస్తాయి. మొత్తం మీద ఈ ఏడాదంతా మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగరీత్యా కానీ, చదువు రీత్యా కానీ బాగా దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. దగ్గర బంధువుల్లో ఒకరి ఆరోగ్యం బాగా ఆందోళన కలిగిస్తుంది. ఎవరికీ డబ్బు ఇవ్వద్దు, తీసుకోవద్దు. సన్నిహితులు ఒకరు మిమ్మల్ని నమ్మించి మోసగించే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి.

ఇవి కూడా చదవండి

మిథునం

నవమంలో శని, లాభం లో గురు రాహులు ఈ రాశి వారి అదృష్టాన్ని తిరగరాయబోతున్నాయి, అష్టమ శని కారణంగా ఇంతవరకు పడిన కష్టాలు క్రమంగా తగ్గిపోతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అధికార యోగానికి, ఆస్తులు సమకూర్చుకోవడానికి ఇది అనుకూల సమయం. మంచి చోట వివాహం కుదురుతుంది. సంతానంలో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. ఆదాయం బాగా పెరుగుతుంది. శుభకార్యాలు చేస్తారు. గృహ వాహన యోగాలు ఉన్నాయి. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణులు అవుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలం అవుతాయి. ఈ రాశి వారికి ఈ ఏడాది దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది.

కర్కాటకం

అష్టమ శని, దశమ గురువు, దశమ రాహువు కారణంగా వృత్తి ఉద్యోగాల్లో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వ్యాపారంలోనూ, రాజకీయాల్లోనూ ఉన్నవారు కొన్ని చిక్కులను, ఆర్థిక సమస్యలను, అపనిందలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగాల్లో విపరీతంగా పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. బంధుమిత్రులతో అపార్ధాలు తలెత్తుతాయి. కుటుంబ సభ్యులతో సంప్రదించిన తరువాతే నిర్ణయాలు తీసుకోండి. మితిమీరిన ఔదార్యం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ఒక పట్టాన పనులు పూర్తి కావు. ఆరోగ్యం జాగ్రత్త. వైద్య ఖర్చులు పెరిగే సూచనలున్నాయి.

సింహం

ఏడవ రాశిలో శని సంచారం వల్ల పని భారం పెరుగుతుంది. ఇంటా బయటా బాగా పని ఒత్తిడి ఉంటుంది. నవమ రాశిలో గురువు సంచారం వల్ల ఆదాయం పెరగటానికి, ఆర్థికంగా స్థిరపడటానికి, అప్పుల బాధ తగ్గటానికి అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించవచ్చు. తండ్రి వైపు నుంచి ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. శుభకార్యాలు చేస్తారు. అనారోగ్యాలకు పరిష్కారం దొరుకుతుంది. ఇరుగుపొరుగుతో విభేదాలు తలెత్తే సూచనలున్నాయి. రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి వచ్చే అవకాశం ఉంది. బంధువర్గంలో వివాహం కుదరవచ్చు.

కన్య

ఆరవ స్థానంలో శని సంచారం చాలావరకు యోగిస్తుంది. ఎనిమిదవ రాశిలో గురువు రాహు సంచారం కొద్దిగా కష్టనష్టాలు తెచ్చిపెడుతుంది. ఏడాది మొత్తం మీద మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి ఉద్యోగాలకు ఎటువంటి సమస్య లేనప్పటికీ, కుటుంబ విషయాలలో మాత్రం చికాకులు ఏర్పడతాయి. బంధుమిత్రుల వల్ల ఇబ్బంది పడతారు. నమ్మిన వాళ్లు ద్రోహం తలపెడతారు. వ్యాపారంలో లాభాలు నిలకడగా సాగుతాయి. వృత్తి నిపుణులకు దూరప్రాంతం నుంచి మంచి ఆఫర్లు వస్తాయి. విదేశాలలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కోర్టు కేసులు అనుకూలంగా ఉండకపోవచ్చు. బంధుమిత్రులకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. గృహ వాహన ప్రయత్నాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.

తుల

ఐదవ రాసిలో శని, సప్తమ రాశిలో గురువు రాహువుల సంచారం, తులా రాశిలో కేతువు సంచారం అన్ని విధాల యోగదాయకం అవుతాయి. ఉద్యోగంలో స్థిరపడతారు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. వృత్తి నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి. ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి ఇష్టపడిన వారితోనే వివాహం జరిగే అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరిగి రుణ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. సంతానం లేని వారికి ఈ ఏడాది సంతానయోగం ఉంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. తోబుట్టులతో సంబంధాలు మెరుగుపడతాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఈ ఏడాది ఈ రాశి వారు అన్ని రంగాల్లోనూ విజయాలు సాధిస్తారు.

వృశ్చికం

నాలుగవ రాశిలో శని సంచారం, ఆరవరాశిలో గురువు రాహువుల సంచారం వల్ల ఈ రాశి వారు కుటుంబ పరంగా ఆర్థికంగా కొన్ని ఇబ్బందులకు గురికాక తప్పదనిపిస్తోంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది కానీ, ఆర్థిక వ్యవహారాలు మాత్రం ఆశించిన విధంగా ఉండకపోవచ్చు. విపరీతమైన తిప్పట, ప్రతి పని ఆలస్యం కావటం, అనవసర ఖర్చులు, అనవసర ప్రయాణాలు, ఉద్యోగంలో స్థానచలనాలు, తోబుట్టువులు, బంధువులతో విభేదాలు, ఇంటిలో అనారోగ్యాలు వంటివి అనుభవానికి వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. రాజకీయాలలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి సమయం అన్ని విధాల అనుకూలంగా ఉంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

ధనుస్సు

మూడవ రాశిలో శని, ఐదవ రాశిలో గురువు రాహు సంచారం చేయడం అన్ని విధాల యోగదాయకం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అదృష్ట యోగం ఉంది. అధికార యోగం కూడా ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సంతానం పురోగతి సాధిస్తారు. ఇతరులకు వీలైనంతగా సహాయపడతారు. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి బయటపడతారు. విదేశీయానానికి, విహారయాత్రలకు అవకాశం కలుగుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత ఏర్పడుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. వ్యాపారులు బాగా లాభాలు ఆర్జిస్తారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ఆర్థిక లావాదేవీలు చక్కగా ఉపకరిస్తాయి.

మకరం

రెండవ రాశిలో శని సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కుటుంబ పరంగా శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. రుణ బాధ ఇతర ఆర్థిక సమస్యలు బాగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారం చేపట్టే అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. నాలుగో రాశిలో గురువు రాహులు సంచరించడం వల్ల ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఉద్యోగాల విషయంలో ఆచితూచి అడుగు వేయండి. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి.. బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యమైన పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. వ్యాపారుల లాభాలు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం పరవాలేదు.

కుంభం

ఈ రాశిలో శని ప్రవేశించడం వల్ల అన్ని పనులు ఆలస్యం కావడం, తిప్పట శ్రమ ఎక్కువగా ఉండటం, తరచూ అనారోగ్యాలకు గురికావటం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ అప్రమత్తంగా ఉండటం అవసరం. సన్నిహితులు మోసం చేసే అవకాశం ఉంది. బంధువులు ఇబ్బంది పెడతారు. అపనిందలు మీద పడే సూచనలు ఉన్నాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. జీవిత భాగస్వామి నుంచి, ఇతర కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం ఉంటుంది. అనారోగ్యాల నుంచి విముక్తి ఉంటుంది. మూడవ రాశిలో గురువు సంచారం అంతగా అనుకూలంగా లేకపోయినా, అదే రాశిలో రాహు సంచారం వల్ల ఆర్థిక సమస్యలు అదుపులో ఉంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. తిప్పట ఎక్కువగా ఉన్నప్పటికీ, ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి.

మీనం

ఈ రాశి వారికి 12 వ రాశిలో శని ప్రవేశంతో ఏది నాటి శని ప్రారంభమైంది. దీనివల్ల అనవసర ఖర్చులు, చిన్న చిన్న అనారోగ్యాలు, ఆకస్మిక ప్రయాణాలు, తిప్పట, శ్రమ వంటివి అనుభవానికి వస్తాయి. విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరి వలన నో డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. తీర్థయాత్రలు, దూర ప్రయాణాలకు వెళ్లే సూచనలు ఉన్నాయి. అయితే రెండవ రాశిలో గురువు రాహు సంచారం చేయటం వల్ల ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రాదు అనుకున్న డబ్బు చేతికి వస్తుంది. బంధువులు, స్నేహితులు అండగా ఉంటారు. కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆరోగ్యం కొంచెం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి.

– కౌశిక్, ప్రముఖ జ్యోతిష్య నిపుణులు

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి