Zodiac Signs: మీ కుటుంబ జీవితాన్ని నిర్ణయించేది గ్రహాల గమనమే.. 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసా..?
జ్యోతిష శాస్త్రం ప్రకారం లగ్నం నుంచి గానీ, రాశి నుంచి గానీ రెండవ స్థానం కుటుంబ స్థానం అవుతుంది. సాధారణంగా ఈ రెండవ స్థానంలో శుభగ్రహాలు ఉన్నా, ఈ స్థానంపై శుభ గ్రహ దృష్టి ఉన్నా కుటుంబానికి సంబంధించి మంచి జరుగుతుంది.
జ్యోతిష శాస్త్రం ప్రకారం లగ్నం నుంచి గానీ, రాశి నుంచి గానీ రెండవ స్థానం కుటుంబ స్థానం అవుతుంది. సాధారణంగా ఈ రెండవ స్థానంలో శుభగ్రహాలు ఉన్నా, ఈ స్థానంపై శుభ గ్రహ దృష్టి ఉన్నా కుటుంబానికి సంబంధించి మంచి జరుగుతుంది. అంటే కుటుంబ స్థానం మీద గురు, శుక్ర, బుధ గ్రహాల ప్రభావం చాలా మంచి చేస్తుంది. ఈ స్థానంలో శని, రవి, కుజుడు, రాహు, కేతు వులు ఉన్న పక్షంలో తప్పకుండా కుటుంబంలో అశాంతి అసంతృప్తి చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నెలలో రవి శుక్ర బుధ కుజ గ్రహాలు రాశులు మారుతున్నందువల్ల వీటి ప్రభావం వివిధ రాశుల కుటుంబ స్థానాల మీద ఏ విధంగా ఉండబోతున్నది పరిశీలిద్దాం.
మేష రాశి: ఈ రాశి వారికి రెండవ స్థానంలో రవి ప్రవేశించడం జరుగుతోంది. దీనివల్ల కుటుంబంలో ప్రధానంగా ఆర్థిక సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కారం అవుతాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. కుటుంబంలో పిల్లలతోనూ, జీవిత భాగస్వామి తోనూ కొద్దిగా అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కఠినంగా మాట్లాడటం వ్యవహరించడం మంచిది కాదు. ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. మనశ్శాంతి తగ్గే సూచనలు ఉన్నాయి. అయితే కుటుంబంలో శుభకార్యం ఒకటి జరిగే అవకాశం ఉంది. వాహన సౌకర్యం కూడా ఏర్పడవచ్చు.
వృషభ రాశి: ఈ రాశి వారికి కుటుంబ స్థానంలో ఉన్న కుజ, శుక్ర గ్రహాలు రాశి మారి కర్కాటకంలోకి ప్రవేశించడం జరుగుతుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం, సయోధ్య ఏర్పడ తాయి. కుటుంబంలో విలాసాలు, వినోదాల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. కుటుంబ సమేతంగా విహారయాత్రలు చేయటం కూడా జరుగుతుంది. ఈ రాశి వారి మాటకు విలువ పెరుగుతుంది. వీరి సలహాలు, సూచనలు కుటుంబ సభ్యులకు ఎంతగానో నచ్చుతాయి. జీవిత భాగస్వామికి విలువైన వస్తువులు కానుకగా ఇచ్చే సూచనలు ఉన్నాయి.
మిథున రాశి: ఈ రాశి వారికి కుటుంబ స్థానంలో కుజ, శుక్ర గ్రహాల ప్రవేశం వల్ల కుటుంబ పరంగా భారీగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా విలాసాల మీద, విలువైన వస్తువుల కొనుగోలు మీద డబ్బు ఖర్చు చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అప్పుడప్పుడు వివాదాలు, వాదాలు చెలరేగే అవకాశం ఉంది. అయితే, కుటుంబానికి సంబంధించి ఒకటి రెండు ముఖ్యమైన సమస్యలు అనుకోకుండా పరిష్కార మయ్యే సూచనలు ఉన్నాయి. బంధువుల రాకపోకలతో కొద్దిగా ఒత్తిడికి గురి కావచ్చు. కుటుంబంలో ఒకరికి స్వల్ప అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది.
కర్కాటక రాశి: ఈ రాశి వారి కుటుంబ స్థానాధిపతి ఉచ్ఛ స్థానంలో ఉండటం వల్ల కుటుంబం యావత్తు కొంత కాలం పాటు సుఖసంతోషాలతో గడపటానికి అవకాశం ఉంది. కుటుంబ పరంగా కొన్ని ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులకు సంబంధించి శుభవార్తలు వింటారు. పిల్లలలో ఒకరికి మంచి ఉద్యోగం లభించడమో లేదా మంచి పెళ్లి సంబంధం కుదరటమో జరుగుతుంది. కుటుంబానికి సంబంధించినంతవరకు ఏ కార్యం తలపెట్టినప్ప టికీ అది విజయవంతంగా పూర్తి అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.
సింహ రాశి: కుటుంబ స్థానాధిపతి అయిన బుధ గ్రహం గురు గ్రహంతోను, ఉచ్ఛ స్థితిలో ఉన్న రవితోనూ మేష రాశిలో కలిసి ఉన్నందువలన ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. కుటుంబ సమ స్యలు తప్పకుండా చక్కబడతాయి. కుటుం బంలో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఆదాయం పరిస్థితి కూడా ఆశాజనకంగానే ఉంటుంది కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. రావల సిన డబ్బు చేతికి అంది కుటుంబ అవసరాలు తీరుతాయి. అయితే, కఠినంగాను పరుషం గానూ మాట్లాడటం వల్ల కలతలు తలెత్తే ప్రమాదం ఉంది.
కన్యా రాశి: ఈ రాశి వారికి ద్వితీయ స్థానాన్ని గురు బుధ గ్రహాలు బలంగా వీక్షించడం వల్ల, ఈ స్థానానికి అధిపతి అయిన శుక్రుడు లాభ స్థానంలో ఉన్నందువల్ల కుటుంబంలో సుఖశాంతులు నెలకొనే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కారణంగా ముఖ్యమైన కుటుంబ అవసరాలు తీరుతాయి. కుటుంబ సభ్యులలో పురోగతి ఉంటుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. ఇంట్లో ఒకటి రెండు శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ పరంగా శుభవార్తలు వింటారు. అయితే బాగా దగ్గర బంధువులు కానీ సన్నిహితులు గానీ డబ్బు విషయంలో మోసం చేసే అవకాశం ఉంది.
తులా రాశి: ఈ రాశి వారికి కుటుంబ స్థానాధిపతి అయిన కుజ గ్రహం దశమ స్థానంలో నీచ పడటం జరుగుతుంది. దీనివల్ల కుటుంబంలో విభేదాలు, అపార్ధాలు చోటుచేసుకుని మనశ్శాంతి తగ్గే అవకాశం ఉంది. ఒకటి రెండు సమస్యలు పరిష్కారం అయినప్పటికీ కొత్తగా మరికొన్ని సమస్యలు ప్రారంభం అయ్యే సూచనలు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి మాట్లాడటం, వ్యవహరించడం చాలా మంచిది. ముఖ్యమైన డబ్బు అవసరాలు తీరిపోతాయి. కుటుంబంలో ఖర్చులు పెరగటానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులలో ఒకరికి పెళ్లి సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి కుటుంబ స్థానాధిపతి అయిన గురువు ఆరవ స్థానంలో సంచరిస్తూ ఉండటం కుటుంబ శాంతికి ఏమంత శ్రేయస్కరం కాదు. ప్రతి చిన్న మాట అపార్ధానికి దారి తీయవచ్చు. కుటుంబ పరంగా ఆదాయం తగ్గటానికి, ఖర్చులు పెరగటానికి అవకాశం ఉంది. జీవిత భాగ స్వామితో అతి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కుటుంబ విషయాలలో బంధువులు కల్పించుకునే సూచనలు ఉన్నాయి. తోబుట్టువు లతో ఆస్తి సంబంధమైన చికాకులు ఏర్పడవచ్చు. ప్రస్తుతానికి డబ్బు ఇవ్వడం, డబ్బు తీసుకోవడం వంటి లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది.
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి కుటుంబం పట్ల విపరీతంగా ప్రేమాభిమానాలు పెరిగే అవకాశం ఉంది. ఈ రాశికి కుటుంబ స్థానాధిపతి అయిన శని స్వక్షే త్రంలో బలంగా ఉన్నందువలన కుటుంబానికి సంబంధించి శుభ పరిణామాలు చోటు చేసుకోవ డానికి బాగా అవకాశం ఉంది. కుటుంబ స్థానం మీద శుక్ర గ్రహ వీక్షణ కూడా ఉన్నందువలన దాంపత్య జీవితంలో అన్యోన్యత కూడా పెరుగు తుంది. కుటుంబంలో ప్రశాంతత సామరస్యం వెల్లి విరుస్తాయి. మాటకు విలువ పెరుగుతుంది. ఆదాయం బాగా పెరగటంతో కుటుంబ అవస రాలు తీరిపోతాయి. కుటుంబ సమేతంగా విహారయాత్రకు వెళ్లే అవకాశం కూడా ఉంది.
మకర రాశి: ఈ రాశి వారికి కుటుంబ స్థానంలో శనీశ్వరుడు స్వక్షేత్రంలో ఉన్నందువలన కుటుంబ పరంగా మంచి అభివృద్ధి కనిపిస్తోంది. కుటుంబంలో ఆదాయం పెరగటంతో పాటు సుఖ సంతోషాలు కూడా వృద్ధి చెందుతాయి. తరచూ ఆత్మీయు లను కలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యమైన కుటుంబ సమస్యలు వాటి అంతటవే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సమేతంగా తీర్థయాత్రలకు గానీ, విహారయాత్రలకు గానీ వెళ్లే అవకాశం ఉంది. కుటుంబంలో పెద్దల నుంచి ఆర్థికంగా, నైతికంగా సహాయ సహకారాలు లభించే సూచనలు ఉన్నాయి. ఆర్థిక సంబంధమైన కేసు ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది.
కుంభ రాశి: ఈ రాశి వారికి కుటుంబ స్థానాధిపతి అయిన గురు గ్రహం మిత్ర క్షేత్రంలో ఉన్నందువల్ల కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోయే అవకాశం ఉంది. కుటుంబ పరంగా ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ఒకటి రెండు ముఖ్యమైన కుటుంబ సమస్యలు కొద్దిపాటి ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. కుటుంబ పరంగా ఆదాయం పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించి ప్రణాళికలు వేయటం జరుగుతుంది. ఒక ముఖ్యమైన శుభకార్యం చోటు చేసుకోవచ్చు. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు.
మీన రాశి: ఈ రాశి వారికి కుటుంబ స్థానంలో నాలుగు గ్రహాలు కలిసి ఉండటం ఒక శుభయోగంగా చెప్పవచ్చు. కుటుంబ ఆదాయం ఆశించిన దాని కంటే ఎక్కువగా అభివృద్ధి చెందడం జరుగు తుంది. కుటుంబ సభ్యులు వారి వారి రంగాలలో పురోగతి సాధిస్తారు. కుటుంబ పెద్దల నుంచి శుభవార్తలు వింటారు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లలనుంచి తీపి కబురు చెవిన పడుతుంది. పుణ్య కార్యాల మీద, దైవ కార్యాల మీద ఎక్కు వగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. కుటుంబంలో ఒకరు మంచి ఉద్యోగం సంపాదించుకునే సూచనలు ఉన్నాయి. ఒకటి రెండు శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).
మరిన్ని జ్యోతిష్య కథనాల కోసం క్లిక్ చేయండి..