Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: వారఫలాలు.. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 4, 2023 వరకు..

బంధుమిత్రులతో అపార్ధాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.

Weekly Horoscope: వారఫలాలు.. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 4, 2023 వరకు..
Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jan 29, 2023 | 4:52 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) శని, గురు గ్రహాలు స్వస్థానాలలో ఉండటంవల్ల ఈ రాశి వారికి ఈ వారం ఎన్నో విధాలుగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అధికార యోగం సూచనలున్నాయి. వాహనం కొనటానికి, ఆస్తులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది చాలా మంచి సమయం. కొత్త ప్రయత్నాలు, ఆలోచనలు, నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ పరంగా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆరోగ్యానికి సంబంధించి ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల కనిపిస్తోంది. దానధర్మాలను తగ్గించుకోవడం మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఈ వారం గురువు, రాహువు, శని చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక సమస్యల నుంచే కాక, ఆరోగ్య సమస్యల నుంచి కూడా ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ పరంగా శుభవార్తలు వింటారు. కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. అదనపు ఆదాయానికి గత కొద్ది కాలంగా చేస్తున్న ప్రయత్నాలు సానుకూల పడతాయి. సమాజానికి మేలు జరిగే పనులు చేస్తారు. పుర ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాల వారు కొద్దిగా కష్టపడినా మంచి ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. స్నేహితుల ద్వారా ఒక మంచి పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. ఆరోగ్యం చాలావరకు సానుకూల పడుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఈ వారం శని రాహులు చాలా వరకు అనుకూలంగా ఉన్నందువల్ల ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు శుభవార్త వినే సూచనలున్నాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో హోదా పెరగడం, సంపాదన పెరగటం వంటివి చోటు చేసుకుంటాయి. డబ్బు బాధ్యతలను ఇతరులకు అప్పగించి నష్టపోతారు. బంధువులలో కొందరు మీ గురించి దుష్ప్రచారం సాగిస్తారు. దూర ప్రాంతంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు నిలకడగానే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఈ వారం ఈ రాశి వారికి గురు, కుజ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల విదేశాల నుంచి ఆశించిన సమాచారం వినటం, ఆదాయం బాగా పెరగటం, ఆరోగ్యం బాగా మెరుగుపడటం వంటివి జరుగుతాయి. ఉద్యోగ పరంగా మంచి పురోగతి కనిపిస్తుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. పిల్లల్లో ఒకరికి మంచి చోట పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పొదుపు సూత్రాలు కూడా పాటిస్తారు. వృత్తి వ్యాపారాల్లో బాగా లాభాలు గడిస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) కుజ, రాహువులు ఈ వారం అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడు తుంది. తల్లిదండ్రుల కారణంగా అనుకోకుండా ఆస్తి కలిసి వస్తుంది. పని ఒత్తిడి, పని భారం ఎక్కువగా ఉంటాయి. అనవసర ప్రయాణాల మీద ఖర్చు పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, ఒకరిద్దరు స్నేహితులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాల వారు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఐటీ నిపుణులు ఉద్యోగాల్లో నిలదొక్కుకుంటారు. కోర్టు కేసు ఒకటి సానుకూలంగా మారుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఇబ్బంది పెడతాయి. పిల్లలు చదువుల్లో ముందడుగు వేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఈ రాశి వారికి శని కుజుల సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. ఆరవరాశిలో ఉన్న శని వల్ల అనారోగ్యాల నుంచి ఉపశమనం, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి, కోర్టు కేసులో విజయం వంటివి చోటు చేసుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో అన్ని విధాలా స్థిరత్వం ఏర్పడుతుంది. సంపాదన పెరుగుతుంది. నవమరాశిలో కుజ సంచారం వల్ల విదేశాల నుంచి సానుకూల సమాచారం అందుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. విదేశీయానానికి ఆటంకాలు తొలగుతాయి. కొందరు సన్నిహితుల సహాయంతో ఒక వ్యక్తిగత సమస్యని పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనుల్లో సహకారం లభిస్తుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) శని సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల మంచి నిర్ణయాలు, ప్రయత్నాల వల్ల కలిసి వస్తుంది. ఉద్యోగంలో అధికారులకు, వ్యాపారంలో భాగస్వాములకు మీ సలహాలు, సూచనలు నచ్చుతాయి. ఆదాయంలో ఆశించిన పెరుగుదల కనిపిస్తుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. విదేశాల్లోనో, బాగా దూరప్రాంతంలోనో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఐటీ నిపుణులు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, రియల్ ఎస్టేట్ వారు ఎంతగానో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ) ఐదవ రాశిలో ఉన్న గురు గ్రహం, ఆరవ రాశిలో ఉన్న రాహువు ఈ రాశి వారికి ఆర్థికంగా మంచి ప్రయోజనాలు కలిగిస్తాయి. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఉద్యోగరీత్యా స్థాన చలనానికి అవకాశం ఉంది. బంధువుల నుంచి సహకారం లభిస్తుంది. ముఖ్యమైన పనులలో టెన్షన్ ఉంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. కుటుంబంలో కొద్దిగా ప్రశాంతత లోపిస్తుంది. కుటుంబ సభ్యులతో పొరపొచ్చాలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగా ఉంటుంది. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం ప్రస్తుతానికి మంచిది కాదు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగానే ఉంటుంది. డబ్బు జాగ్రత్త.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) స్వస్థానాలలో ఉన్న శని, గురు గ్రహాల వల్ల, ఆరవ రాశిలో ఉన్న కుజ గ్రహం వల్ల అదృష్ట యోగం పట్టే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వాహనం కొనటానికి, ఆస్తి పెంచుకోవడానికి అవకాశం ఉంది. శుభకార్యాలలో తోబుట్టువులకు సహాయ సహకారాలు అందిస్తారు. రుణ సమస్యను చాలావరకు తగ్గించుకుంటారు. అనారోగ్యం తగ్గు ముఖం పడుతుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో అపార్ధాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ధన స్థానంలో శని, తృతీయ స్థానంలో గురువు సంచరిస్తున్నందువల్ల ఆరోగ్యానికి, ఆదాయానికి కొదవ ఉండదు. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. రుణ సమస్యలు కొద్దిగా తగ్గుతాయి. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కుతారు. స్నేహితులతో విభేదాలు తగ్గించుకుంటారు. ఎంతో శ్రమపడి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు ఇబ్బంది పెడతాయి. పిల్లలు చదువుల్లో బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఐటీ వారు రాణిస్తారు.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ధన స్థానంలో గురువు, తృతీయ స్థానంలో రాహువు సంచారం చేస్తున్నందువల్ల ఆర్థిక సమస్యలు కొంతవరకు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగంలో టెన్షన్లు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి ఎక్కువవుతుంది. పెళ్లి ప్రయత్నాలలో చికాకులు తలెత్తుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా స్వప్రయత్నంతో పరిష్కారం అవుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) రాశినాథుడు గురువు స్వస్థానంలో ఉండటం, కుజుడు మూడవ స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగంలో ఆశించిన విధంగా స్థిరత్వం లభిస్తుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. కుటుంబ సభ్యుల నుంచి, తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల వారు ఆశించిన స్థాయిలో ముందుకు దూసుకు వెళతారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతనలో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.