ఆయా రాశుల వారిపై చంద్ర సంచారం ప్రభావం ఎలా ఉంటుందంటే..?
చంద్ర సంచారాన్ని బట్టి వివిధ రాశుల వారి మనస్తత్వాన్ని, వ్యవహార శైలిని అర్థం చేసుకోవచ్చు రెండు రోజులకొకసారి రాశి మారే చంద్రుడి వల్ల మనసులోని భావాలలో తరచూ మార్పులు జరుగుతుంటాయి. చంద్రుడు మనఃకారకుడైనందు వల్ల అది ఏ రాశిలో ఉంటే ఆ రాశికి తగ్గట్టుగా కొద్దిగానైనా మనసు మారుతుంటుంది. వివిధ రాశుల్లో చంద్రుడు సంచారం చేస్తున్నప్పుడు..
చంద్ర సంచారాన్ని బట్టి వివిధ రాశుల వారి మనస్తత్వాన్ని, వ్యవహార శైలిని అర్థం చేసుకోవచ్చు రెండు రోజులకొకసారి రాశి మారే చంద్రుడి వల్ల మనసులోని భావాలలో తరచూ మార్పులు జరుగుతుంటాయి. చంద్రుడు మనఃకారకుడైనందు వల్ల అది ఏ రాశిలో ఉంటే ఆ రాశికి తగ్గట్టుగా కొద్దిగానైనా మనసు మారుతుంటుంది. వివిధ రాశుల్లో చంద్రుడు సంచారం చేస్తున్నప్పుడు అంటే మీ జన్మరాశి మీద నుంచి ప్రస్తుతం గ్రహ సంచార చంద్రుడు వెడుతున్నప్పుడు ఏం జరిగేదీ ఇక్కడ పరిశీలిద్దాం.
మేషం: ఈ రాశి మీద నుంచి చంద్రుడు వెడుతున్నప్పుడు మితిమీరిన ఆత్మ విశ్వాసం ఏర్పడుతుంది. ఎక్కడా లేని ధైర్యం వస్తుంది. ఏ పనైనా చేయగలననిపిస్తుంది. కొద్ది పట్టుదలతో ముఖ్యమైన వ్యవ హారాలను చక్కబెట్టడం, పెండింగ్ పనులను పూర్తి చేయడం జరుగుతుంది. అయితే, చంద్రుడు మేషంలో సంచారం చేస్తున్న సమయంలో కలుపుకునిపోయే తత్వం కొరవడుతుంది. పట్టు విడు పుల ధోరణి ఉండదు. ఓర్పు, సహనాలు కూడా తక్కువగా ఉంటాయి. కోపతాపాలు పెరుగుతాయి.
వృషభం: ఈ రాశి మీద నుంచి చంద్రుడు వెడుతున్నప్పుడు ఈ రాశివారిలో శాంత స్వభావం పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించే తత్వం ఎక్కువవుతుంది. ప్రతి పనీ ఒక ప్రణాళిక ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం చేయడం జరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా కుటుంబ వ్యవహారాల మీద దృష్టి కేంద్రీకృతమవుతుంది. ఆదాయం పెరిగే మార్గాల గురించి ఆలోచించడం, ఖర్చులు తగ్గించుకోవడం వంటివి జరుగుతాయి.
మిథునం: ఈ రాశి మీద నుంచి చంద్రుడు వెడుతున్నప్పుడు సహజంగా వ్యక్తిగత, కుటుంబ సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించుకోవడం జరుగుతుంది. మేధ పాదరసంలా పనిచేస్తుంది. ముఖ్య మైన వ్యవహారాలను చక్కబెట్టుకోవడం, వివాదాలను తెలివితేటలతో పరిష్కరించడం, ఇతరులతో లౌక్యంగా వ్యవహరించడం వంటివి చోటు చేసుకుంటాయి. విభేదాల స్థానంలో సామరస్యాన్ని పెంపొందించుకుంటారు. ఎటువంటి వ్యక్తులనైనా తెలివిగా, మాటలతో ఆకట్టుకోవడం జరుగు తుంది.
కర్కాటకం: ఈ రాశిలో చంద్ర సంచారం జరుగుతున్నప్పుడు ఎక్కువగా కుటుంబ వ్యవహారాల మీదా, పిల్లల మీదా దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులను మాటలతో, చేతలతో మెప్పించడానికి, ఆకట్టుకోవడానికి కృషి చేస్తారు. వ్యాపారాల్లో సేల్స్ మన్ తత్వం ఎక్కువగా ఉంటుంది. ఇష్టమైన బంధువులను కలుసుకోవడం, తల్లిని, తల్లి తరఫు బంధువులను ఆద రించడం వంటివి జరుగుతాయి. గృహ, వాహన సౌకర్యాల మీద ఆసక్తి పెంచుకోవడం జరగవచ్చు.
సింహం: ఈ రాశిలో చంద్ర సంచారం జరుగుతున్నప్పుడు అహంకారం ఎక్కువగా వ్యక్తమవుతూ ఉంటుంది. ఎక్కడా పట్టు విడుపుల ధోరణి కనిపించదు. స్వతంత్రంగా వ్యవహరించడం, సొంత ఆలోచనలను అమలు చేయడం, ఇతరులతో ఎక్కువగా కలవకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఈ రాశివారికి తండ్రితో సఖ్యత ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో కొద్దిగా ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం, తన విధులకు మాత్రమే పరిమితం కావడం వంటివి కూడా కనిపిస్తాయి.
కన్య: ఈ రాశిలో చంద్రుడు సంచారం చేస్తున్నప్పుడు ప్రతి విషయం గురించీ వివరంగా తెలుసుకోవడం, కొన్ని విషయాల్లో అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం వంటివి జరిగే అవకాశం ఉంది. ప్రతి వ్యవహా రాన్నీ ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా చక్కబెట్టడం, సొంత పనులకు అంకితమయిపోవడం వంటివి కూడా జరుగుతాయి. వీరిలో గ్రంథ పఠనం, పుస్తక ప్రియత్వం ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో మరింతగా శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మడం జరగదు.
తుల: ఈ రాశిలో చంద్ర సంచారం జరుగుతున్నప్పుడు ఈ రాశివారు కుటుంబ సభ్యులతో లేదా సన్నిహితులతో మరింత ఎక్కువగా సరదాగా కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది. ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా పట్టించుకోకుండా ఉండడం అనేది ఈ రాశివారికి బాగా చేతనవుతుంది. తమ వ్యవహారాలు, తమ సరదాలే తమకు ముఖ్యంగా కనిపిస్తాయి. స్వార్థ చింతన ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తగినంత ఖ్యాతిని, ప్రతిష్ఠను కోరుకుంటారు.
వృశ్చికం: ఈ రాశి మీద నుంచి చంద్రుడు వెడుతున్నప్పుడు ఈ రాశివారు మరింత ఒంటరితనం, ఏకాంతం కోరుకుంటారు. ‘నన్ను ఒంటరిగా వదిలేయండి’ అన్నట్టుగా వ్యవహరిస్తారు. ఎక్కువగా ఇంటికే పరిమితం అవుతారు. చంద్రుడు వృశ్చిక రాశిలో ప్రవేశించగానే వీరి మూడ్స్ మారిపోతాయి. ఏ మాటా బయటపెట్టరు. ఎవరితోనూ ఏ విషయమూ పంచుకోరు. కోపతాపాలు, అసహనం కూడా ఎక్కువగానే ఉంటాయి. ఏ పని చేయాల్సి వచ్చినా ఒంటరిగానే పూర్తి చేయడం జరుగుతుంది.
ధనుస్సు: ఈ రాశిలో చంద్రుడు ప్రవేశించిన మరుక్షణం నుంచి వీరిలో కోరికలు, ఆకాంక్షలు పెరిగిపోతాయి. సంపాదనకు సంబంధించి కొత్త కొత్త ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఆదాయం పెరగడానికి మార్గాలు అన్వేషిస్తుంటారు. సాధారణంగా వీరికి బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది.. ఆ ప్రేమాభిమా నాలు మరీ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సరికొత్త పరిచయాల కోసం ఎంతగానో ఆరాటపడతారు.
మకరం: ఈ రాశి మీదుగా చంద్రుడు సంచారం చేస్తున్నప్పుడు వీరికి వృత్తి, ఉద్యోగాల మీద మరింతగా శ్రద్ధ పెరుగుతుంది. ఇతరుల బాధ్యతలు మోయడం ఎక్కువవుతుంది. ఆధ్యాత్మిక వ్యవహారాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. అటు అధికారులతోనూ, ఇటు సహోద్యోగుల తోనూ రాజీపడని ధోరణిని అనుసరిస్తారు. ఇంటా బయటా ఎటువంటి బాధ్యతలు నిర్వర్తించడానికైనా సిద్ధపడతారు. ఎక్కువగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు.
కుంభం: ఈ రాశిలో చంద్ర సంచారం జరుగుతున్నప్పుడు, వీరికి పని ధ్యాస మరింత ఎక్కువవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను లేదా పెండింగు పనులను పూర్తి చేసుకోవడం మీద, ఇంటి వ్యవహారా లను చక్కబెట్టుకోవడం మీద మరింత శ్రద్ధ పెడతారు. వృత్తి, ఉద్యోగాల్లో అంకితభావం పెరుగు తుంది. ఎప్పుడో జరిగిపోయిన విషయాలను తలచుకుని బాధపడడం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతరులతో తమ మనసులోని విషయాలను పంచుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు.
మీనం: ఈ రాశిలో చంద్ర సంచారం జరుగుతున్నప్పుడు ఈ రాశివారు సాధారణంగా ఆధ్యాత్మిక చింతన మీద లేదా కుటుంబ వ్యవహారాల మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతుంటారు. కుటుంబసమేతంగా విహార యాత్రలకు లేదా తీర్థయాత్ర లకు వెళ్లడం జరుగుతుంది. వ్యక్తిగత శ్రద్ధ ఎక్కువవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సరికొత్త ఆలోచనలను, వ్యూహాలను ప్రవేశపెడుతుంటారు. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు.